– భయంగా ఉందంటూ తండ్రికి ఫోన్
– వచ్చేలోపే దారుణం
– హనుమకొండ జిల్లా వంగరలో ఘటన
నవతెలంగాణ-భీమదేవరపల్లి
మనస్తాపంతో విద్యార్థిని ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగరలోని డాక్టర్ పీవీ రంగారావు మెమోరియల్ తెలంగాణ బాలికల గురుకుల పాఠశాలలో శుక్రవారం జరిగింది. వంగర బాలికల గురుకుల పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న వనం శ్రీవర్షిత (14) ఇటీవల దీపావళి సెలవులకు ఇంటికి వెళ్లింది. విద్యార్థిని తండ్రి తిరుపతి గురువారం మధ్యాహ్నం తిరిగి పాఠశాలకు తీసుకువచ్చారు. శుక్రవారం ఉదయం సిబ్బంది ఫోన్‌తో తండ్రికి కాల్ చేసి.. స్కూల్‌లో భయంగా ఉందని, త్వరగా రావాలని ఏడుస్తూ మాట్లాడింది. దాంతో ఆందోళన చెందిన విద్యార్థి తండ్రి తిరుపతి.. తాను వచ్చేంతవరకు తమ కుమార్తెను జాగ్రత్తగా చూసుకోవాలని, ఆమెకు తోడుగా ఒకరిని ఉంచాలని ప్రిన్సిపాల్‌ని ఫోన్‌లో కోరాడు. పాఠశాల సిబ్బంది మనోవేదనతో ఉన్న విద్యార్థి శ్రీవర్షితను పట్టించుకోక పోవడంతో వసతి గృహంలోకి వెళ్లి చున్నీతో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. విద్యార్థిని తండ్రి తిరుపతి పాఠశాల వద్దకు చేరుకొని గేటు వద్ద చాలాసేపు వేచి చూసినా సిబ్బంది తలుపులు తీయలేదు. విద్యార్థిని మృతిచెందిందని నిర్ధారణ చేసుకున్న సిబ్బంది గేటు తీశారు. తండ్రి లోపలకు వచ్చి చూడగానే విగతజీవిగా కూతురు కనిపించడంతో బోరున విలపించాడు. తన కూతురి వెంట ఉండి కాపాడాల్సిన మీరు దారుణంగా చంపేశారంటూ బోరునవిలపిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఘటన విషయం తెలుసుకున్న వంగర ఎస్‌ఐ దివ్య, ముల్కనూర్ ఎస్‌ఐ రాజు, ఎల్కతుర్తి ఎస్‌ఐ ప్రవీణ్, సీఐ రమేష్ పాఠశాల వద్దకు చేరుకున్నారు. అప్పటికే గ్రామస్తులకు విషయం తెలియడంతో పాఠశాల వద్ద పెద్దఎత్తున గుమ్మిగూడారు. పరిస్థితి అదుపుతప్పే అవకాశాలు కనిపిస్తుండటంతో పోలీసులు విద్యార్థిని మృతదేహాన్ని హుటాహుటిన పోస్టుమార్టం నిమిత్తం హుజురాబాద్ ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో కాజీపేట ఏసీపీ పింగిలి జయపాల్ రెడ్డి పాఠశాలకు చేరుకొని విద్యార్థులతో మాట్లాడి మనోధైర్యం కల్పించారు. పాఠశాలలో చదువుతున్న ఇతర విద్యార్థుల తల్లిదండ్రులు భయాందోళనతో వారి కుమార్తెలను వెంట తీసుకొని వెళ్లారు. ప్రిన్సిపాల్, ఇతర ఉపాధ్యాయుల వేధించడం వల్లే తన కుమార్తె చనిపోయిందని మృతురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, పాఠశాల వద్దకు చేరుకున్న సీపీఐ నాయకులు గేట్ ఎదుట బైటాయించి ఆందోళన వ్యక్తం చేశారు ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేయాలంటూ డిమాండ్ చేశారు.
విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటాం : వాసంతి, జిల్లా విద్యాధికారి
వంగర బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యార్థిని శ్రీవర్షిత మృతిపై విచారణ చేపడతామని హనుమకొండ జిల్లా విద్యాధికారి వాసంతి అన్నారు. విద్యార్థిని మృతి చెందిన విషయాన్ని తెలుసుకొని ఆమె పాఠశాలకు చేరుకుని మృతిపై ఆరా తీశారు. పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయినీలు, సిబ్బంది నిర్లక్ష్యం అని తేలితే శాఖపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు.
గురుకుల విద్యార్థిని ఆత్మహత్య
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



