మెరుగైన చికిత్సకు ఆదేశించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
జగిత్యాల జిల్లా కేంద్రంలోని ధరూర్ క్యాంపు ఎస్సీ బాలుర హాస్టల్‌పై గత అక్టోబర్ మాసంలో పిడుగు పడటంతో విద్యార్థి బొల్లె హిమశ్ చంద్ర (8వ తరగతి) తీవ్రంగా గాయపడ్డారు. క్షణాల్లో మంటలు వ్యాపించి అతని చేతులు, వెన్ను భాగం కాలిపోయింది. టెర్రస్‌పై బట్టలు ఆరేసుకుంటున్న సమయంలో చోటు చేసుకున్న ఈ ఘటనలో సిబ్బంది వెంటనే అప్రమత్తమై బాలుడిని జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు ప్రాథమిక చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో సికింద్రాబాద్ యశోద ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన తెలిసిన వెంటనే ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వేగంగా స్పందించారు. విద్యార్థి చికిత్స పొందుతున్న ఆస్పత్రిని ఐదుసార్లు సందర్శించి వైద్యుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మరింత మెరుగైన వైద్యం అందేలా అన్ని చర్యలు తీసుకోవాలని వైద్యాధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్ ను విద్యార్థికి ఎంత ఖర్చయినా సరే మెరుగైన వైద్యం అందించాలని కోరారు.
మంత్రి ఆదేశాలతో కదిలిన యంత్రాంగం విద్యార్థికి మెరుగైన చికిత్సలో భాగంగా ప్లాస్టిక్ సర్జరీ చేయించారు. ఆ సర్జరీకి రూ.18 లక్షలు ఖర్చు అవుతుండటంతో బాలుని కుటుంబం పేదరికంతో ఆ మొత్తాన్ని భరించలేని స్థితిలో ఉంది. దీంతో మొత్తం వైద్యానికి అయిన ఖర్చును ఎస్సీ అభివృద్ధి శాఖ నిధుల నుంచి చెల్లించాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఆ ఆదేశాలతో ఎస్సీ అభివృద్ధి శాఖ కమిషనర్ క్షితిజ్ యశోద ఆస్పత్రికి చెల్లించారు. తన కుమారునికి మెరుగైన చికిత్సనందించేందుకు తోడ్పాటునందించి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మానవత్వాన్ని చూపించారని హిమశ్ చంద్ర తండ్రి బొల్లె శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు. తమ కుమారున్ని ప్రభుత్వం బతికించిందన్నారు. రూ.1.5 లక్షలు చెల్లించి ఉపాధి కోసం 10 రోజుల క్రితం గల్ఫ్ దేశంలో కూలీగా వెళ్లిన శ్రీనివాస్ కుమారుడి ప్రమాద ఘటన తెలిసి వెనక్కి వచ్చి మంత్రిని కలిశారు. శ్రీనివాస్ మంత్రికి తన కుమారుని పరిస్థితి వివరించడంతో మంత్రి వెంటనే స్పందించి చర్యలకు ఆదేశాలిచ్చారు.



