– ‘పీఎం కిస్సాన్’ పేరిట ఏపీకే ఫైల్
– పీఎం కిసాన్ పథకమే లక్ష్యం
– క్లిక్ చేసి రిజిస్టరైతే ఫోన్ హ్యాక్
– తెలంగాణలో ఆరునెలల్లో రూ.681 కోట్లు తస్కరణ
– దేశవ్యాప్తంగా ఏడాదిలో రూ.22వేల కోట్లు చోరీ
– కేసు నమోదులో సైబర్ క్రైమ్ పోలీసుల చేతివాటం
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
సైబర్ నేరగాళ్లు రైతులను టార్గెట్ చేస్తున్నారు. ప్రధానమంత్రి కిసాన్ యోజన (పీఎం కిసాన్) బదులు పీఎం కిషాన్/ కిస్సాన్ పథకం పేరిట ఏపీకే ఫైల్‌ను వాట్సాప్‌కు పంపించి సెల్‌ఫోన్‌లు హ్యాక్ చేస్తున్నారు. ఎవరి ఫోనైతే హ్యాక్ అవుతుందో ఆ వాట్సాప్‌లోని కాంటాక్ట్స్, గ్రూప్‌లన్నింటికీ ఆ ఏపీకే లింక్ వెళ్తుంది. ఎవరైతే దాన్ని డౌన్‌లోడ్ చేసి రిజిస్టర్ అవుతారో వారి ఎకౌంట్లలో ఎంతుంటే అంత హ్యాకర్లు ఆన్‌లైన్ షాపింగ్‌లు చేస్తున్నారు. క్రెడిట్‌కార్డు యూజర్లను ప్రధాన టార్గెట్ చేసుకొని ఖాతాదారునితో సంబంధం లేకుండా ఓటీపీలు పంపుతూ ఎకౌంట్‌లను లూటీ చేస్తున్నారు. ఎక్కువగా ఫోన్లు, ఇతరత్ర ఆన్‌లైన్ షాపింగ్ చేస్తూ పది నిమిషాలలోపే ఎంపిక చేసుకున్న వస్తువులు డెలివరీ పొందుతున్నారు. ముఖ్యంగా కోల్‌కతా కేంద్రంగా సైబర్ నేరగాళ్లు దోపిడీకి పాల్పడుతున్నట్టు ఆధారాలను బట్టి అర్థమవుతోంది. దేశంలో ఈ ఏడాది రూ.22వేల కోట్లు సైబర్ నేరగాళ్లు తస్కరించగా, తెలంగాణలో గడిచిన ఆరు నెలల్లో రూ.681 కోట్లు కొల్లగొట్టారని, దీనిపై 37,958 ఫిర్యాదులు వచ్చినట్టు సైబర్ సెక్యూరిటీ బ్యూరో గణాంకాలు వెల్లడిస్తున్నాయి. రైతులు, సామాన్యులే కాదు.. విద్యావంతులు, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, స్టాక్‌మార్కెట్‌పై అవగాహన ఉన్నవారు సైతం సైబర్ నేరగాళ్ల బారినపడుతున్నారు. కొద్దిరోజుల కింద ఖమ్మం జిల్లాకు చెందిన ఓ ఎంఈవో సోదరుడు రూ.3కోట్లు ఇలా పోగొట్టుకోవటం గమనార్హం.
పీఎం కిసాన్ స్కీమ్ కావటంతో రిజిస్టర్ అవుతున్న రైతులు
ప్రధాన మంత్రి కిసాన్ యోజన పథకం కింద కేంద్ర ప్రభుత్వం ప్రతియేటా మూడు విడతలుగా రైతులకు రూ.6వేలు అకౌంట్లలో జమ చేస్తుంది. ఒక్కో విడత రూ.2వేల చొప్పున ఏడాదికి మూడుసార్లు ఇవి సంబంధిత రైతు ఖాతాలో పడతాయి. అయితే ఈ పథకం ప్రారంభించిన నాటి నుంచి కేంద్రం రకరకాలుగా నిబంధనలు మార్చుతోంది. ఎన్నికల సమయంలో సజావుగా అర్హులైన రైతులందరి ఖాతాలో డబ్బులు జమవుతుంది. ఏ ఎలక్షన్స్ లేనప్పుడు రోజుకో తీరుగా స్కీమ్ నిబంధనలను మార్చుతున్నారు. ఇదే అదనుగా సైబర్ నేరగాళ్లు పీఎం కిసాన్ యోజన స్కీమ్‌ను ఆన్‌లైన్ దోపిడీ కోసం వినియోగించుకుంటున్నారు. పీఎం కిసాన్ యోజనకు బదులు పీఎం కిషాన్/ కిస్సాన్ యోజన ఏపీకే పేరిట మాల్‌వేర్‌తో కూడిన ఆండ్రాయిడ్ ప్యాకేజీ కిట్ (ఏపీకే)ను హ్యాకర్లు పంపుతున్నారు. ఈ ఫైల్ ఎవరి ఫోన్‌కైతే సెండ్ అవుతుందో వారితో పాటు ఆ ఫోన్‌లో ఉన్న వాట్సాప్ కాంటాక్ట్‌లన్నింటికీ ఏపీకే వెళ్తుంది. దాన్ని ఓపెన్ చేసి యూనిక్ ఐడీ కోసం రిజిస్ట్రేషన్ చేయగానే మొబైల్ ఫోన్ హ్యాక్ అవుతుంది. ఫోన్‌ను రిస్టార్ట్ చేసినా వాట్సాప్ హ్యాంగయ్యే ఉంటుంది. అప్పటికే ఆ ఫోన్‌లోని వాట్సాప్ కాంటాక్ట్స్ అనుమతి లేకుండానే ఇతరులకు షేర్ అవుతున్నాయి. తరచూ పీఎం కిసాన్ నిబంధనలు మారుతుండటంతో కొత్త రైతులు పలువురు అప్లరు చేసుకుంటున్నారు. కొందరు అర్హులో కాదోనని, డబ్బులు జమయ్యాయో లేదోనని చెక్ చేసుకుంటున్నారు. ఇదే అదనుగా గత మూడు, నాలుగు నెలలుగా రాష్ట్రంలోని పలువురు రైతుల ఫోన్లను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేసి ఆన్‌లైన్ షాపింగ్ ద్వారా డబ్బులు కొల్లగొట్టినట్టు బాధితులు చెబుతున్నారు.
తెలంగాణలో పలువురు రైతుల ఖాతాలు లూటీ
రాష్ట్రంలోని పలువురు రైతుల ఖాతాలను ఇటీవల హ్యాకర్లు లూటీ చేశారు. వాట్సాప్‌కు పీఎం-కేఐఎస్‌ఎస్‌ఏఎన్2.ఏపీకే పేరిట వచ్చిన లింక్‌ను సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ ప్రాంతానికి చెందిన ముగ్గురు రైతులు ఓపెన్ చేశారు. పీఎం కిసాన్ యోజన డబ్బులు జమయ్యాయో లేదో తెలుసుకునే ప్రయత్నం చేశారు. దాంతో వారి అకౌంట్ల నుంచి రూ.32వేలు, రూ.50వేలు, రూ.72వేల చొప్పున రూ.1.59 లక్షలు కట్ అయ్యాయి. వెంటనే బాధితులు బ్యాంకులకు వెళ్లగా అప్పటికే సైబర్ నేరగాళ్లు కాజేసినట్టు చెప్పారు. ఖమ్మం రూరల్ మండలం పెద్దతండాకు చెందిన బాణోత్ నాగేంద్రప్రసాద్‌కు ఇలాగే పీఎం కిస్సాన్ ఏపీకే లింక్ వచ్చింది. దాన్ని ఓపెన్ చేసిన వెంటనే ప్రసాద్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు నుంచి రూ.1.80 లక్షలను సైబర్ నేరగాళ్లు తస్కరించారు. ఫ్లిప్‌కార్టు నుంచి ప్రసాద్‌కు ఓటీపీలు వచ్చాయి. పది నిమిషాల్లోపే మూడు మొబైల్‌ఫోన్స్ పర్చేజ్ చేసినట్టు ఇతనికి మెసేజ్‌లు వచ్చాయి. కోల్‌కతాలోని గ్రీన్‌టవర్ ఓఎన్జీసీ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ అడ్రస్‌లో ఉంటున్న రిజ్వాన్‌ఖాన్‌కు ఈ ఫోన్లు ఆర్డర్ పెట్టిన 8 నిమిషాల్లోనే డెలివరీ అయినట్టు మెసేజ్‌లు వచ్చాయి.
ఏపీకే.ఈఎక్స్‌ఈ.పీఐఎఫ్ లింక్‌లు ఓపెన్ చేయొద్దు
ఏపీకే.ఈఎక్స్‌ఈ.పీఐఎఫ్ లాంటి ఎక్స్‌టెన్షన్‌తో ముగిసే లింకులను ఓపెన్ చేయొద్దని, వాటిని మరొకరికి ఫార్వర్డ్ చేసే ముందు ఆలోచించుకోవాలని సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు హెచ్చరిస్తున్నారు. ఫోన్ వినియోగదారునితో సంబంధం లేకుండానే అందులోని వాట్సాప్ నెంబర్లన్నింటికీ ఏపీకే లింక్, డాక్యుమెంట్ వెళ్తుండటం ఆందోళన కలిగిస్తోంది. తమ డబ్బుల తస్కరణపై బాధితులు సైబర్‌క్రైమ్ 1930కి ఆన్‌లైన్ ఫిర్యాదు చేశారు. వారి సూచన మేరకు స్థానిక సైబర్ క్రైమ్ పోలీసుస్టేషన్‌కు వెళ్లటంతో స్టేషనరీ ఖర్చుల పేరుతో చెరో రూ.4వేలు ఇవ్వాలని డిమాండ్ చేయటం గమనార్హం.
పీఎం కిసాన్ న్యూ రిజిస్ట్రేషన్ లింక్ రావటంతో ఓపెన్ చేశా..
పీఎం కిస్సాన్ న్యూ రిజిస్ట్రేషన్ అని ఏపీకే లింక్ వచ్చింది. ఇంతకుముందు పీఎం కిసాన్ డబ్బులు నా ఖాతాలో పడటం లేదు. కాబట్టి ఆ ఏపీకే లింక్‌ను ఓపెన్ చేశాను. వెంటనే నా ఫోన్ హ్యాక్ అయింది. నా ఎస్‌బీఐ వైఫై క్రెడిట్ కార్డు నుంచి ఎలాంటి ఓటీపీలు నేను చెప్పకుండానే రూ.1.20 లక్షలను సైబర్ నేరగాళ్లు కాజేశారు. ఆ డబ్బులతో మూడు మొబైల్ ఫోన్లు కొనుగోలు చేశారు. సైబర్ క్రైమ్ స్టేషన్‌లో ఫిర్యాదు ఇవ్వటానికి పోతే రూ.4వేలు స్టేషనరీ కోసమని అడిగారు.
-బోడ రవి, రైతు, పెద్దతండా, ఖమ్మంరూరల్
రైతులపై హ్యాకర్ల గురి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES