ఇంతకు ముందు ప్రకటించిన తేదీనే కటాఫ్‌గా పరిగణిస్తాం : ఈసీ వెల్లడి
బీహార్ ఎన్నికల్లో కలర్ ఫొటోలతో బ్యాలెట్ పేపర్లు
న్యూఢిల్లీ : దేశవ్యాప్త ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై (సర్) ఎన్నికల సంఘం కీలక వ్యాఖ్యలు చేసింది. చాలా రాష్ట్రాల్లో సగం కంటే ఎక్కువ మంది సర్ ప్రక్రియలో పత్రాలు సమర్పించాల్సిన అవసరం లేదని అభిప్రాయపడింది. వీరంతా అంతకుముందు ఆయా రాష్ట్రాల్లో జరిగిన సర్ ప్రక్రియలో పాల్గొన్నందున త్వరలో చేపట్టే దానిలో పత్రాలు సమర్పించాల్సిన అవసరం లేదని బుధవారం ఈసీ పేర్కొంది. 2002- 2004 మధ్య కాలంలో అనేక రాష్ట్రాలు సర్ చేపట్టాయని, తదుపరి సవరణకు ఆ సమయాన్నే కటాఫ్ తేదీగా పరిగణిస్తామని తెలిపింది. బీహార్‌లో 2003లో చేపట్టిన సర్‌ను తాజాగా చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణకు కటాఫ్ డేట్‌గా తీసుకున్నామని గుర్తు చేసింది. బీహార్ ఎన్నికల సంఘం వివరాల ప్రకారం 2003లో చేపట్టిన ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో పాల్గొన్న 4.96 కోట్ల మంది ఓటర్లు దాదాపు 60 శాతం మంది తాజా సర్‌లో పత్రాలను సమర్పించలేదని చెప్పింది. ఆ కటాఫ్ తేదీకి ముందు సర్‌లో పాల్గొన్నవారు డేట్, ప్లేస్ ఆఫ్ బర్త్ సహా ఇతర పత్రాలను సమర్పించాల్సిన అవసరం లేదని తెలిపింది. మిగిలిన మూడు కోట్ల మంది అంటే దాదాపు 40 శాతం మాత్రమే జాబితాలోని 12రకాల గుర్తింపు పత్రాల్లో ఒక దానిని సమర్పించారని వెల్లడించింది. కొత్తగా ఓటర్ జాబితాలో చేరేవారు, ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చేవారు మాత్రం అదనంగా డిక్లరేషన్ పత్రాన్ని అందించాలని సూచించింది.
కాగా, దేశవ్యాప్తంగా ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ చేపట్టాలని ఎన్నికల సంఘం ఇప్పటికే నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన తేదీల వివరాలను త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. ఇటీవల రాష్ట్రాల ముఖ్య ఎన్నికల అధికారులతో (సీఈవో) కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. దేశంలోని చాలా రాష్ట్రాలు 2002-04 మధ్యకాలంలో ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ చేపట్టాయి. వీటిని ప్రజలకు అందుబాటులో ఉంచాలని అన్ని రాష్ట్రాల ఎన్నికల సంఘాలకు ఈసీ సూచించింది. ఈ నేపథ్యంలోనే తమ రాష్ట్రాల్లో చివరిసారి సమగ్ర సవరణ చేపట్టిన అనంతరం ప్రచురించిన ఓటర్ల జాబితాను వెబ్‌సైట్‌లో అందుబాటులోకి ఉంచుతున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో చివరిసారి 2008లో ఈ ప్రక్రియ చేపట్టగా, ఆ ఓటర్ల జాబితాను సీఈవో వెబ్‌సైట్‌లో పెట్టారు. ఉత్తరాఖండ్‌లో 2006లో నిర్వహించగా, దానికి సంబంధించిన జాబితా కూడా రాష్ట్ర సీఈవో వెబ్‌సైట్‌లో ఉంచారు.
ఈ ఏడాది చివర్లో దేశవ్యాప్తంగా సర్
బీహార్‌లో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ తర్వాత దేశవ్యాప్తంగా సర్ నిర్వహిస్తామని ఎన్నికల సంఘం ఇప్పటికే చెప్పింది. వచ్చే ఏడాది తమిళనాడు, బంగాల్, కేరళ, అసోం, పుదుచ్చేరిల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది చివర్లోనే ఈసీ సర్ ప్రక్రియ ప్రారంభించే అవకాశాలు కన్పిస్తున్నాయి. ముఖ్యంగా అక్రమ వలసదారులను తొలగించడంతో పాటు ఓటరు జాబితాల సమగ్రతను కాపాడటమే లక్ష్యంగా ఈ చర్యలు తీసుకుంటునట్లు ఈసీ అంటుంది.
కలర్ ఫొటోలతో బ్యాలెట్ పేపర్లు ఈవీఎంలపై ఈసీ సంచలన నిర్ణయం
బీహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ భారత ఎన్నిక సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఎలక్ట్రానికి ఓటింగ్ యంత్రాల (ఈవీఎం) బ్యాలెట్ పేపర్లపై అభ్యర్థులు కలర్ ఫోటోలో కనిపించనున్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల నుంచే ఈ కొత్త నిబంధనను అమలు చేయనున్నట్టు ఎన్నికల సంఘం తెలిపింది.ఈవీఎం బ్యాలెట్ పేపర్ల రూపకల్పన, ముద్రణ మార్గదర్శకాలను బుధవారం ఈసీ సవరించింది. ఇకనుంచి కొత్త బ్యాలెట్ పేపర్లపై అభ్యర్థుల కలర్ ఫొటోలు కనిపిస్తాయి. కేటాయించిన స్థలంలో మూడొంతుల వరకు అభ్యర్థి ముఖాన్ని ముద్రించనున్నారు. తద్వారా ఓటర్లు ఎలాంటి ఇబ్బంది లేకుండా స్పష్టంగా చూడగలరు. అలాగే అభ్యర్థుల సీరియల్ నంబర్లును 30 ఫాంట్ సైజ్‌తో బోల్డ్‌లో ముద్రించనున్నారు. అభ్యర్థుల పేర్లు, నోటా ఆప్షన్‌ను కూడా అదే నిబంధన వర్తించనుంది. ఒకే రకమైన ఫాంట్, ఓకే పరిమాణంలో ఉండటం వల్ల చదవడంలో సౌలభ్యంగా ఉంటుందని ఈసీ పేర్కొంది. ఈవీఎంల బ్యాలెట్ పేపర్లు 70 జీఎస్‌ఎం పేపర్‌పై ముద్రించనున్నారు. అసెంబ్లీ ఎన్నికల కోసం పింక్ కలర్ పేపర్ (నిర్దిష్ట ఆర్‌జీబీ విలువతో) ఉపయోగిస్తారు. గత ఆరు నెలల కాలంలో తీసుకువచ్చిన 28 మార్పుల్లో తాజా నిర్ణయం కూడా భాగమని తెలిపింది.