నవతెలంగాణ – హైదరాబాద్ : తమ మిలటరీ చీఫ్ మహమ్మద్ సిన్వర్ ఇజ్రాయిల్ దాడిలో మరణించినట్లు హమాస్ ఆదివారం ధృవీకరించింది. వైమానిక దాడిలో హమాస్ చీఫ్ మరణించినట్లు ఇజ్రాయిల్ ప్రకటించిన మూడు నెలల తర్వాత ఈ ప్రకటన వెలువడింది. ‘‘అమరవీరుల సైనిక కౌన్సిల్’’ గా అభివర్ణిస్తూ .. శనివారం హమాస్ విడుదల చేసిన పలువురు రాజకీయ, సైనిక నేతల మృతుల ఫొటోల్లో మహమ్మద్ సిన్వర్ ఫొటో కూడా ఉంది. 2023 అక్టోబర్ 7 ఇజ్రాయిల్‌పై దాడికి సూత్రధారిగా పేర్కొంటున్న యాహ్యా సిన్వర్ సోదరుడే మహమ్మద్ సిన్వర్. కమాండర్ మొహమ్మద్ దీఫ్ మృతి తర్వాత సిన్వర్ అల్ -కస్సామ్ బ్రిగేడ్స్ సైనిక మండలికి నేతృత్వం వహించినట్లు సమాచారం. ఈ ఏడాది జూన్‌లో సెంట్రల్ గాజాలోని ఖాన్ యూనిస్‌లోని యూరోపియన్ ఆస్పత్రి కింద వున్న సొరంగంలో మహమ్మద్ సిన్వర్ మృతదేహాన్ని గుర్తించినట్లు ఇజ్రాయిల్ సైన్యం ప్రకటించింది. మే 13న అతనిని హతమార్చినట్లు సైన్యం తెలిపింది. ఇజ్రాయిల్ దాడుల్లో ఇప్పటివరకు సుమారు 63,371మంది పాలస్తీనియన్లు మరణించారని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
మిలటరీ చీఫ్ మహమ్మద్ సిన్వర్ మృతిని ధృవీకరించిన హమాస్
- Advertisement -
- Advertisement -