Monday, November 3, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంబందీల మృతదేహాల కోసం హమాస్‌ గాలింపు

బందీల మృతదేహాల కోసం హమాస్‌ గాలింపు

- Advertisement -

మానవతా సాయాన్ని అడ్డుకుంటున్న ఇజ్రాయిల్‌
గాజా :
తనకు బందీలుగా చిక్కి ప్రాణాలు కోల్పోయిన ఇజ్రాయిలీల మృతదేహాల కోసం గాజాలో హమాస్‌ గాలింపు కొనసాగిస్తోంది. మరోవైపు సహాయ సామగ్రితో నగరంలోకి ప్రవేశిస్తున్న వాహనాలను ఇజ్రాయిల్‌ దళాలు అడ్డుకుంటున్నాయి. పరిమిత సంఖ్యలో మాత్రమే వాహనాలను అనుమతిస్తున్నాయి. గాజా స్ట్రిప్‌లోకి ప్రతి రోజూ 600 ట్రక్కులను అనుమతిస్తానని హామీ ఇచ్చిన ఇజ్రాయిల్‌ ఇప్పుడు కేవలం 145 ట్రక్కులను మాత్రమే పంపుతోంది. గాజాలో తీవ్ర అనారోగ్యానికి గురై ప్రత్యేక చికిత్స అవసరమైన 16 వేల మందికి పైగా రోగులు అక్కడి నుంచి బయటపడలేక ఇబ్బంది పడుతున్నారు. వారిని అక్కడి నుంచి తరలించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. సెప్టెంబర్‌ నాటికి ఈజిప్టుకు 3,995 మంది రోగులను, యూఏఈకి 1,450 మందిని, ఖతార్‌కు 970 మందిని, తుర్కియేకు 437 మంది రోగులను చికిత్స నిమిత్తం తరలించారు. ఇటలీలో 201 మంది రోగులకు చికిత్స అందించారు. పాలస్తీనాకు చెందిన 3,800 మంది చిన్నారులకు అత్యవసర వైద్య చికిత్స అవసరమున్నదని, వారిని గాజా నుంచి తరలించాలని ఐక్యరాజ్యసమితి గత వారం తెలిపింది.
ఆహార పంపిణీలో కొంత మెరుగుదల కన్పిస్తున్నప్పటికీ సహాయ సామగ్రి తరలింపుకు తీవ్ర ఆటంకం కలుగుతోందని ఐరాస పేర్కొంది. ఇరుకుగా, సన్నగా ఉండే ఫిలిడెల్ఫి కారిడార్‌ మీదుగా సహాయ సామగ్రి రవాణా జరుగుతోంది. ఆ మార్గంలో పెద్ద వాహనాలు ప్రయాణించలేవు. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా సామగ్రిని చేరవేసేందుకు ఇజ్రాయిల్‌ నిరాకరిస్తోంది. ఇదిలావుండగా రెడ్‌ క్రాస్‌ సభ్యులు, ఈజిప్ట్‌ సాంకేతిక బృందం సాయంతో ఇజ్రాయిలీ బందీల మృతదేహాల కోసం హమాస్‌ గాలింపు కొనసాగుతోంది. మరోవైపు దక్షిణ గాజా స్ట్రిప్‌లోని ఖాన్‌ యూనిస్‌లో పేరుకుపోయిన శిధిలాలను తొలగించేందుకు ఇజ్రాయిల్‌ దళాలు కృషి చేస్తున్నాయి. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ ఇజ్రాయిల్‌ దళాలు గాజా స్ట్రిప్‌పై దాడులు కొనసాగిస్తూనే ఉంది. ఖాన్‌ యూనిస్‌, రఫా, బెయిట్‌ లహియా నగరాలపై బాంబు దాడులు జరుపుతున్నాయి. ఇజ్రాయిల్‌ మారణహోమం కారణంగా నిరాశ్రయులైన 70,000 మంది పాలస్తీనీయులకు ఐరాసకు చెందిన యూఎన్‌ఆర్‌డబ్ల్యూఏ సంస్థ 70 శిబిరాలలో ఆశ్రయం కల్పించింది.

2023 అక్టోబరులో గాజాలో యుద్ధం ప్రారంభమైన తర్వాత ఇజ్రాయిల్‌పై హెజ్బొల్లా రాకెట్‌ దాడులు మొదలు పెట్టింది. దీంతో లెబనాన్‌తో ఉత్తర సరిహద్దుకు సమీపంలో నివసిస్తున్న వేలాది మంది ఇజ్రాయిలీలు ఇళ్లను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు. హెజ్బొలా, ఇజ్రాయిల్‌ మధ్య గత సంవత్సరం కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. అయితే ఈ ఒప్పందాన్ని ఇజ్రాయిల్‌ ఉల్లంఘిస్తూ హెజ్బొల్లా స్థావరాలను లక్ష్యంగా చేసుకొని వైమానిక దాడులు కొనసాగిస్తోంది.

హెజ్బొల్లాపై దాడులు ఉధృతం చేస్తాం : ఇజ్రాయిల్‌
దక్షిణ లెబనాల్‌లోని హెజ్బొల్లాపై దాడులు ఉధృతం చేస్తామని ఇజ్రాయిల్‌ హెచ్చరించింది. హెజ్బొల్లాతో గత సంవత్సరం నవంబరులో కాల్పుల విరమణ ఒప్పందం కుదర్చుకున్నప్పటికీ దక్షిణాన ఉన్న ఐదు ప్రదేశాలను లక్ష్యంగా చేసుకొని ఇజ్రాయిల్‌ దాడులు జరుపుతోంది. ఇజ్రాయిల్‌ జరిపిన తాజా వైమానిక దాడిలో నలుగురు చనిపోగా ముగ్గురు గాయపడ్డారు. సీమాంతర దాడులకు స్వస్తి చెబుదామని, చర్చలు ప్రారంభిద్దామని లెబనాన్‌ అధ్యక్షుడు జోసఫ్‌ అవోన్‌ సూచించినప్పటికీ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ‘హెజ్బొల్లా నిప్పుతో చెలగాటం ఆడుతోంది. తగిన చర్యలు చేపట్టడంలో లెబనాన్‌ అధ్యక్షుడు విఫలమయ్యారు’ అని ఇజ్రాయిల్‌ రక్షణ మంత్రి కట్జ్‌ ఆరోపించారు. హెజ్బొల్లా ఉగ్రవాదులను పూర్తిగా నిరాయుధులను చేసి, దక్షిణ లెబనాన్‌ నుంచి వారిని తరిమేస్తామని ఇచ్చిన హామీని ప్రభుత్వం నిలబెట్టుకోవాలని సూచించారు. ఉత్తర ప్రాంతంలోని ప్రజలకు ముప్పు కలిగించడాన్ని తాము అనుమతించబోమని చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -