Sunday, March 29, 2026
E-PAPER
Homeసోపతిఒక ధిక్కార స్వరం హంసా వాడేకర్‌

ఒక ధిక్కార స్వరం హంసా వాడేకర్‌

- Advertisement -

భారతీయ సినిమా రంగంలో సైలెంట్‌ సినిమాల కాలం నుండి టాకీల శకం మొదటి, మలి దశాబ్దాలలో దేశంలోని అట్టడుగు కులాల వారి పాత్రనే అధికం. ఈ మాటకు బలం చేకూర్చుతూ టాకీల తొలి దశకంలోనే సినిమాలలోకి వచ్చిన, దేవదాసి కుటుంబానికి చెందిన హంస వాడేకర్‌ మనకు ఒక ప్రత్యక్ష సాక్షంగా కనిపిస్తుంది. ఆమె నటిగా తన జీవితాన్ని కొనసాగించడానికి కుటుంబంతో, నాటక, సినీరంగాలలోని మగ మహారాజులతో ఆమె ఒక యుద్ధమే చేసింది. ఒక్కోసారి యుద్ధం చేయలేక బలహీనురాలై ఓడి పోయింది కూడా. ఆమె ఎంతటి అన్యాయానికి గురైందంటే న్యాయం కోసం తన భర్తతో ఒక మెజిస్ట్రేట్‌ వద్దకు వెళ్తే న్యాయమూర్తే ఆమెపై అత్యాచారం చేశాడు. బహుశా భారతీయ చలనచిత్ర రంగంలో ఏ నటికీ ఇలాంటి వేదనా భరిత సందర్భం ఎదురై ఉండకపోవచ్చు.

హంసా వాడేకర్‌ భారతీయ సినిమా తొలితరం స్త్రీవాద నాయిక. 1923 జనవరి 24న బొంబాయిలో జన్మించి, మొదట ‘రతన్‌’ అని పిలువబడిన హంసా వాడేకర్‌ జీవితం ఒక విప్లవాత్మక మార్గంలో సాగింది. లైంగిక అణచివేతపై పోరాడి, తన ఆత్మకథలో ఆ విషయాలన్నింటినీ నిర్భయంగా రాసిన ఒక నటి ఆమె. ఆమె తల్లి సరస్వతి ఒక దేవదాసి కుమార్తె కాగా, ఆమె తండ్రి భాల్చంద్ర సాల్గావ్కర్‌ ది కళావంతుల కుటుంబం. ఈ రెండు సామాజిక వర్గాల వారు కూడా నాటి భారతదేశంలోని అణగారిన కులాలకు చెందినవారే. ఉమ్మడి కుటుంబ సభ్యులందరూ ‘జిజి’ అని పిలిచే ఆమె ముత్తవ్వ, ఒక సంపన్న మహిళ. ఆమె మరణం తర్వాత, ఆస్తి పంపకాలు జరగడంతో, ఆ కుటుంబం సావంత్‌వాడికి వలస వెళ్ళింది. కానీ హంస తల్లి దండ్రుల మద్యపాన వ్యసనం కారణంగా వారి కుటుంబం ఆర్థికంగా చితికిపోవడంతో వారు కొద్దికాలం తర్వాత బొంబాయికి వచ్చారు. రతన్‌ను మొదట మరాఠీ పాఠశాలలో, ఆ తర్వాత రెండేళ్లపాటు ఇంగ్లీషు బడిలో చదివించారు. కానీ కుటుంబ సభ్యులు ఆమె కంటే ఆమె ఏకైక తమ్ముడికే చదువు ఎక్కువ అవసరమని భావించి ఆమెను బడి మాన్పించారు. కుటుంబాన్ని పోషించడానికి రతన్‌ స్వయంగా సంగీతం, నత్యాలలో శిక్షణ పొందింది, పైగా ఆమె చాలా అందంగా, ఆకర్షణీయంగా ఉండేది. దీంతో సినిమా రంగంలోకి ఆమె అడుగుపెట్టడం అనివార్యమైంది.



సావంత్‌వాడిలో జగన్నాథ్‌ బండార్కర్‌ ఆమెకు ఇరుగుపొరుగున ఉండేవారు. ఆయన ముంబైకి మకాం మార్చి తన సొంత నాటక సంస్థను ప్రారంభించినప్పుడు అందులో నటించమని హంసను కోరారు. హంస తల్లికి ఈ విషయం నచ్చలేదు, పైగా వారిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోందని శంకించింది. స్వతహాగా తిరుగుబాటు ధోరణి కలిగిన హంస, ఆ ఆరోపణలకు కోపగించుకుని, నిజంగానే జగన్నాథ్‌తో ప్రేమలో పడింది. అలా 1937లో తన 15వ ఏట జగన్నాథ్‌ బండార్కర్‌ను పెళ్ళాడింది. ఆమె కన్నా వయసులో ఆయన చాలా పెద్దవాడు. ఇకపై తాను పనిచేయాల్సిన అవసరం ఉండదని ఆమె భావించింది. కానీ మారిన పరిస్థితులు, కుటుంబ బాధ్యతలు, అలాగే తన భర్త నాటక సంస్థ, ఆ తర్వాత ప్రారంభించిన ప్రింటింగ్‌ ప్రెస్‌ నష్టాల కారణంగా, కుటుంబాన్ని పోషించడం కోసం రతన్‌ (హంస) ఇద్దరు అక్కలతో సినిమా రంగంలోకి అడుగుపెట్టింది.

బాబూరావు పెండార్కర్‌ తీసిన ‘విజయచే లగాణే’ (1936) చిత్రంలో కథానాయికగా ఆమె తొలిసారి వెండితెరపై కనిపించింది. అదే సంవత్సరం మామా వారేర్కర్‌ ఈ చిత్రాన్ని హిందీలో ‘షాదీ కా మామ్లా’ పేరుతో తీయగా విజయం సాధించింది. కానీ కుటుంబ పరువు ”మసక బారకుండా” ఉండేందుకు ఆమె తన పేరు మార్చుకోవాలని ఆమె సోదరుడు పట్టుబట్టాడు. ఒక స్త్రీ కుటుంబ పోషణ భారాన్ని మోస్తూ కూడా తన తమ్ముడి పురుషాధిక్య భావజాలం ఒత్తిడి చేత అలా ఆమె ‘హంసా’గా పేరు మార్చుకుంది. స్త్రీపై ఎప్పుడైనా ఎక్కడైనా ఆధిపత్యం ఆమె హద్దులను, ప్రవర్తనను నిర్దేశించడం కుటుంబం నుండే మొదలవుతుందని ఈ దష్టాంతం మనకు తెలియజేస్తుంది.

తన బంధువు, నటి అయిన ఇందిరా వాడ్కర్‌ నుండి స్వీకరించిన ‘వాడేకర్‌’ అనే ఇంటిపేరును తన పేరుకు జోడించుకుంది హంస (రతన్‌).తద్వారా హిందీ మరాఠీ భాష చలనచిత్ర రంగంలో ఒక కొత్త సినీ తార ఆవిర్భవించింది. అప్పటికి ఆమె నెలకు రూ. 250 జీతం. ఆ కాలంలో ఇది చాలా పెద్ద మొత్తం. మొత్తంగా ఆమె 1936 నుండి 1969 మధ్య 25 మరాఠీ, 28 హిందీ చిత్రాలలో నటించింది. 10 చిత్రాలలో పాటలు పాడింది.
బొంబాయి టాకీస్‌ బ్యానర్‌పై ఆమె నటించిన మొదటి చిత్రం ‘నవజీవన్‌’; ఫ్రాంజ్‌ ఓస్టెన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 1939లో విడుదలైంది. ఆ తర్వాత ఫ్రాంజ్‌ ఓస్టెన్‌ దర్శకత్వంలో ‘దుర్గా’ (1939), ఎన్‌.ఆర్‌.ఆచార్య దర్శకత్వంలో ‘ఆజాద్‌’ (1940) చిత్రాల్లో ఆమె నటించింది.
1940లో హిమాన్షు రారు మరణానంతరం, ఆమె బొంబాయి టాకీస్‌ను వీడి, తాత్కాలికంగా ‘ప్రభాత్‌ టాకీస్‌’లో చేరింది. అక్కడ ఆమె ‘సంత్‌ సఖు’ (1941)లో నటించారు. ఆ తర్వాత రామచంద్ర ఠాకూర్‌ దర్శకత్వంలో, ‘నేషనల్‌ స్టూడియోస్‌’ ”అప్నా పరాయా” (1942)లో ఆమె నటించారు. పి.జైరాజ్‌, ఛాయా దేవి, ఆఘా, కె.సి.డే వంటి నటీనటులతో కలిసి ‘మేరా గావ్‌’ (1942) చిత్రంలో నటించింది. ఇంకా ఆమె ‘దిల్లగి’ (1942), ‘మీనా’ (1944), చేతన్‌ ఆనంద్‌తో కలిసి ”రాజ్‌ కుమార్‌” (1944), ప్రభాత్‌ ఫిలిమ్స్‌ కోసం 18వ శతాబ్దపు ప్రధాన న్యాయమూర్తి రామ్‌ శాస్త్రి జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన ”రామ్‌ శాస్త్రి” (1945), ”మై క్యా కరూం” (1945), ”ఆర్తి” (1945), ”బేహ్రమ్‌ ఖాన్‌” (1946) వంటి చిత్రాలలో నటించారు. ఆ తర్వాత, రాజ్‌కమల్‌ కోసం వి. శాంతారామ్‌, బాబూరావు పెయింటర్‌ సంయుక్తంగా దర్శకత్వం వహించిన ‘లోక్‌షాహిర్‌ రామ్‌ జోషి’ (1947) చిత్ర బృందంలో చేరారు. పీష్వా కాలం నాటి కవి, కీర్తన మరియు లావణి కళాకారుడు అయిన రామ్‌ జోషి (1758-1812) జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన ఈ చిత్రం, మరాఠీ జానపద నత్యం, సంగీతాన్ని అద్భుతంగా ప్రదర్శిస్తూ, హంసా నటించిన అత్యంత విశిష్టమైన చిత్రాలలో ఒకటిగా నిలిచింది.



పూణేలోని మాణిక్‌ స్టూడియోస్‌ కోసం రాజా పరాంజపే తీసిన ‘పుధాచే పావూల్‌’ (1950) చిత్రంలో ఆమె ఒక ”తమాషా నర్తకి” పాత్రను అత్యంత సహజంగా పోషించి, విమర్శకుల ప్రశంసలతో పాటు వాణిజ్యపరంగానూ గొప్ప విజయాన్ని పొందింది.
అనంత మానే దర్శకత్వం వహించి, జయశ్రీ గడ్కర్‌ సహనటిగా నటించిన ‘సాంగ్త్యే ఐకా’ (1959) చిత్రంలో కూడా ఆమె మరోసారి తమాషా నర్తకి పాత్రనే పోషించారు. 1955లో నవచిత్ర ఫిలిమ్స్‌ రాజా ఠాకూర్‌ ”మీ తులస్‌ తుజ్య అంగాని” చిత్రంలో వాడ్కర్‌ ఒక ప్రతినాయకి పాత్రలో కనిపించింది . ఈ చిత్రం 1956లో మరాఠీలో ఉత్తమ చలనచిత్రంగా మరియు ఉత్తమ దర్శకుడిగా జాతీయ చలనచిత్ర పురస్కారాలను గెలుచుకుంది.
వాడ్కర్‌ చిత్రం ‘మేరా గావ్‌’ (1942) పూర్తయిన తర్వాత వారి కుమార్తె రేఖ జన్మించింది. కాలక్రమేణా, ఆమె భర్త ఏదో తప్పుగా ఊహించుకుని శారీరకంగా హింసించినప్పుడు, ఆమె బయటకు వెళ్లి అదే విధంగా ప్రవర్తించేది. ఆమె మద్యం సేవించేది. తన ఆత్మకథలో ఏమి జరిగిందో తనకు తెలియని ఒక తాగుడు విందు గురించి వివరిస్తూ ఆమెతో కలిసి మద్యం సేవించిన వారిలో ఒకడైన జోషి ఆమెను తన మూడవ భార్యగా తీసుకువచ్చి ఒక గ్రామంలో వుంచుతాడు. ఆమె తన భర్తకు రహస్యంగా ఒక లేఖను పంపే వరకు మూడు సంవత్సరాలు ఒక ఖైదీగా గడిపింది. అతను పోలీసులతో కలిసి వచ్చి, ఆమెను పొరుగు పట్టణంలోని మేజిస్ట్రేట్‌ కార్యాలయానికి తీసుకువెళ్లాడు. అక్కడ ఆమె సాక్ష్యం చెప్పవలసి వుంది. మేజిస్ట్రేట్‌ ఒక కాగితంపై సంతకం తీసుకోవడానికి బండార్కర్‌ను బయటకు పంపి, ఆ తర్వాత హంసపై అత్యాచారం చేశాడు. న్యాయమూర్తికి భయపడి ఆమె ఈ సంఘటన గురించి బయటకు చెప్పలేదు. చివరకు ఆమె రంగస్థల నటుడు రాజన్‌ జవాలేతో ఆఖరు రోజులు గడిపింది . వాడ్కర్‌ తన ఆత్మకథ ‘సంగ్త్యే ఐకా’ (మరాఠీలో ”మీరు అడగండి, నేను చెబుతాను”)లో తన జీవితం గురించి నిష్కపటంగా రాశారు. 1970లో వచ్చిన ఈ పుస్తకానికి, 1959లో బాక్సాఫీస్‌ రికార్డులన్నింటినీ బద్దలు కొట్టిన ఆమె హిట్‌ చిత్రం సంగ్త్యే ఐకా’ పేరు పెట్టారు. హంసా వాడేకర్‌ ఆత్మకథ పితస్వామ్యం, పురుషులు, కుటుంబ వ్యవస్థపై ఒక ప్రత్యక్ష దాడిగా నిలిచిపోయింది. ఈ పుస్తకం ‘యూ ఆస్క్‌ ఐటెల్‌’ అనే ఆంగ్ల అనువాదం సమకాలీనమైన ఆందోళనలతో సతమతమైన ఒక జీవిత దశ్యాన్ని అందిస్తుంది. ఈ ఆంగ్ల అనువాదానికి రాసిన తన పరిచయం రాస్తూ వి.ఎల్‌. కులకర్ణి ”నేను హన్సాబాయి వాడేకర్‌ ఆత్మకథ ఖండాలుగా, అసంపూర్ణ కథనంలో అనేక అంతరాలతో ఉంది. బహుశా ఈ కారణాల వల్లే అది గాఢమైన ముద్ర వేస్తుంది. హన్సాబాయి ఎన్నో బాధలను అనుభవించింది. ఆమె అనుభవంలో మంచి కన్నా చెడే ఎక్కువ. కానీ ఆమె మాటల్లో గానీ, ఆమె రచనలో గానీ ఎక్కడా చేదు భావన లేదు. ఇది చాలా అసాధారణమైన విషయం. గొప్ప రచయితలు సైతం సాధించలేని ఒక విషయాన్ని, బడికి గానీ, కళాశాలకు గానీ వెళ్లకుండా జీవితమనే విశ్వవిద్యాలయంలో విద్యాభ్యాసం చేసిన ఈ మహిళ సులభంగా సాధించారు. హన్సా బాయి వాడేకర్‌ తన జీవితాన్ని ఒకరకమైన అమాయకత్వంతో చూస్తూ దానిని వ్యక్తపరుస్తుందని పేర్కొన్నారు.
1971 ఆగష్టు 23న 47వ ఏట బొంబాయిలో కన్నుమూసిన హంసా వాడేకర్‌ భారతీయ చలనచిత్ర రంగంలో ఒక అధ్యాయంగా పేర్కొనదగిన దగిన నటి. ఆమె నట జీవితం, వ్యక్తిగత జీవితం రెండు వైరుధ్యాలతో కనిపిస్తాయి. కానీ సినిమా రంగంలో ఆమె తన ఉనికిని నిలుపుకున్న తీరు ఒక తిరుగుబాటుతనాన్ని మనకు చెప్పగానే చెబుతుంది.

హంసా… నటనకందని జీవితం
స్మితా పాటిల్‌కు జాతీయ పురస్కారాన్ని తెచ్చిపెట్టిన శ్యాం బెనెగల్‌ ‘భూమిక’ (1977) ‘సంగ్త్యే ఐకా’ ఆధారంగా తీశాడు. స్మిత , వాడ్కర్‌ పాత్రను సున్నితత్వంతో పోషించారు. ఈ చిత్రం స్త్రీల ఆత్మాశ్రయతను అన్వేషిస్తుంది. హంస ఆత్మశోధన ప్రయాణం సుడులతో, ఉచ్చులతో నిండి కనిపిస్తుంది. హంస బాల్యం, తాగుబోతు తండ్రి, చిరాకుపడే తల్లి (శుల్భా ఆర్య), కుట్రపూరిత ప్రియుడి (అమోల్‌ పాలేకర్‌) జ్ఞాపకాలతో దెబ్బతింటుంది. ఉష (స్మితా పాటిల్‌) పెద్దయ్యాక ఆ ప్రియుడు వివాహం తర్వాత ఆమె సంపాదనతో జీవిస్తూ ఊపిరాడనంతగా ఉక్కిరిబిక్కిరి చేసినప్పుడు, ఆమె స్వేచ్ఛ పొంది, వేర్వేరు పురుషుల కౌగిళ్లలో సాంత్వనను వెతుక్కుంటుంది. ఉష సందిగ్ధతలు విడ్డూరంగా ఉన్నాయి, ఎందుకంటే ఆమె రకరకాల పాత్రలు పోషించాల్సిన నటి అయినప్పటికీ, జీవితంలో తన పాత్ర ఏమిటో తెలియక గందరగోళానికి గురవుతుంది. బెనెగల్‌ ఉష సతమతమై ఉండవచ్చు, కానీ వాడ్కర్‌ స్వయంగా విజయం సాధించింది. ఈ రకంగా హంసా వాడేకర్‌ జీవితం నటనకు అందనంత గొప్పదిగా మనకు గోచరిస్తుంది.

– హెచ్‌ రమేష్‌ బాబు, గద్దర్‌ ఫిలిం అవార్డు గ్రహీత
7780736386

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -