Friday, December 12, 2025
E-PAPER

హస్తం హవా

- Advertisement -

తొలివిడత సర్పంచ్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ మద్దతుదారుల గెలుపు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్‌ పార్టీ హవా కొనసాగింది. అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో నెగ్గి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ మెజార్టీ సర్పంచ్‌ స్థానాలను గెలుచుకుంది. గురువారం జరిగిన పోలింగ్‌లో 3,834 సర్పంచి పదవులకు 12,960 మంది అభ్యర్థులు, 27,628 వార్డు సభ్యుల స్థానాలకు 65,455 మంది పోటీ పడ్డారు. తుది వార్తలు అందే సమయానిక కాంగ్రెస్‌ పార్టీ బలపర్చిన అభ్యర్థులు 2,270 స్థానాల్లో గెలుపొందారు. బీఆర్‌ఎస్‌ మద్దతిచ్చిన అభ్యర్థులు 1,147 స్థానాల్లో, బీజేపీ 185 చోట్ల, ఇతరులు 516జూ స్థానాల్లో విజయం సాధించారు. ఉమ్మడి నిజామాబాద్‌, నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులు గణనీయ సంఖ్యలో స్థానాలు గెలుపొందారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉండటంతో సహజంగానే ఓటర్లు కాంగ్రెస్‌ వైపు మొగ్గు చూపినట్టు తెలుస్తోంది. సిద్దిపేట జిల్లాల్లో బీఆర్‌ఎస్‌ మెజారిటీ స్థానాలు దక్కించుకుంది. అలాగే మరో మూడు జిల్లాల్లో కూడా ఆ పార్టీ కాంగ్రెస్‌కు గట్టి పోటీ ఇచ్చింది. మొదటి విడత ఫలితాల అంచనాల ప్రకారం, వచ్చే రెండు విడతల్లో పోటీ మరింత హౌరాహౌరీగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. ఏకగ్రీవం, నామినేషన్లు దాఖలు కాని పంచాయతీలను మినహాయిస్తే దాదాపు 50 శాతం స్థానాల్లో కాంగ్రెస్‌ బలపరిచిన అభ్యర్థులే గెలుపొందారు. పంచాయతీ ఎన్నికలను కాంగ్రెస్‌ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి పర్యవేక్షణలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, స్థానిక నాయకులను సమన్వయం చేస్తూ గ్రామ స్థాయి వరకు ప్రచార వ్యూహాలు రూపొందించి అమలు చేశారు. గ్రామీణ స్థాయిలో పార్టీని బలోపేతం చేసే క్రమంలో, ప్రజలను నేరుగా కలిసే పద్ధతి కాంగ్రెస్‌కు మరింత అనుకూలంగా మారిందని భావిస్తున్నారు. రెండు సంవత్సరాల ప్రజాపాలన సంక్షేమం- అభివృద్ధి పథకాలతో ప్రజలకు చేరువైందని, ప్రజా పాలన పట్ల ప్రజల సంతృప్తి పంచాయతీ ఎన్నికల్లో స్పష్టంగా ప్రతిఫలించిందని కాంగ్రెస్‌ నాయకత్వం భావిస్తోంది. రానున్న రెండు, మూడు విడతల్లో మరింత మెరుగైన ఫలితాలను రాబట్టాలని ఆ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసింది. గ్రామ స్థాయిలో బీఆర్‌ఎస్‌ బలంగానే ఉందనడానికి ఈ ఫలితాలు సాక్ష్యంగా నిలుస్తాయని ఆపార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. అదే సమయంలో బీజేపీ కూడా గతం కంటే బలాన్ని పెంచుకున్నట్టు తెలుస్తోంది. 2019లో మొత్తం 12,751 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగ్గా, అప్పటి అధికార టీఆర్‌ఎస్‌ (బీఆర్‌ఎస్‌) 7,774 పంచాయతీలను కైవసం చేసుకుంది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌ 2,709 గ్రామాలకే పరిమితమైంది. బీజేపీ 150 గ్రామ పంచాయతీల్లో నెగ్గింది. ఆ ఎన్నికల్లో ఇతరులు 2105 గ్రామపంచాయతీల్లో విజయం సాధించారు. ప్రస్తుతం తొలి విడత పోలింగ్‌ ఫలితాలు మాత్రమే వెల్లడయ్యాయి. మరో రెండు విడతల్లో పంచాయతీ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ ఫలితాల ప్రభావం ఆ ఎన్నికలపై ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. వార్డు సభ్యుల ఎన్నికల్లోనూ మెజారిటీ ఫలితాలు కాంగ్రెస్‌నే వరించాయి. వీటి తుది ఫలితాలు వెల్లడి కావల్సి ఉంది.

ప్రజల విశ్వాసానికి నిదర్శనం టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌
తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ మద్దతుదారులైన అభ్యర్థులు ఘనవిజయం సాధించటంపై టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన మొదటి విడత సర్పంచ్‌ ఎన్నికల్లో 90 శాతం కంటే ఎక్కువ స్థానాల్లో కాంగ్రెస్‌ అనుబంధ అభ్యర్థులే గెలవటం, తమ ప్రభుత్వం పట్ల విశ్వాసానికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. గ్రామీణ స్థాయిలో పార్టీని బలోపేతం చేసే క్రమంలో, ప్రజలను నేరుగా కలిసే పద్ధతి కాంగ్రెస్‌కు మరింత అనుకూలంగా మారిందని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -