నేతన్న భరోసా, చేనేత రుణమాఫి, పథకాలు ఏలాంటి షరతులు లేకుండా అమలు చెయ్యాలి
వృత్తిరక్షణ, వృత్తిదారుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలి
నవతెలంగాణ – భువనగిరి
వ్యసాయం తరువాత దేశంలో అత్యంత నైపుణ్యం కలిగిన చేనేత పరిశ్రమ మోడీ ప్రభుత్వ విదానాలతో పూర్తిగా నిర్వీర్యం అయిందని, పనులులేక చేనేత కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండీ జాహంగీర్ అన్నారు. శనివారం ఆయన నవతెలంగాణతో మాట్లాడారు. గతంలో చేనేత కార్మికులకు ఉన్న ఐసీఐసీ లోంబార్డ్, హెల్త్ఇన్సరెన్స్, హౌజ్ కం వర్క్ షెడ్, చేనేత సబ్సిడీ లాంటి అనేక సంక్షేమ పథకాలతో పాటు చేనేత సంక్షేమబోర్డును రద్దు చేసి, ఎన్నడూ లేనివిధంగా నూలు, రంగులు ముడి సరుకులపై నేసిన బట్టలపై జిఎస్టి పేరుతో పన్నులు వేసి, పదకొండేండ్ల బీజేపీ ప్రభుత్వ పాలనలో చేనేత రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసిందని విమర్శించ్చారు.
చేనేత సంక్షేమ బోర్డును పునరుద్దరించి, నేసిన బట్టలను ప్రభుత్వమే కొనుగోలు చెయ్యాలని కోరారు. ఇల్లులేని నిరుపేద చేనేత కార్మికులకు ఇంటి స్థలంతో పాటు, కేంద్రం రూ. 10 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం రూ. 5 లక్షలతో హౌజ్ కం వర్క్ షెడ్ నిర్మించి ఇవ్వాలన్నారు. జియోట్యాగ్ కలిగిన ప్రతి చేనేత కార్మికునికి నేతన్న భరోసా, చేనేత రుణమాఫి ఏలాంటి షరతులు లేకుండా లక్ష రుణమాఫి అమలు చెయ్యాలని కోరారు. వృత్తిరక్షణ, వృత్తిదారుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు చెప్పట్టాలని డిమాండ్ చేశారు.