రుణమాఫీ చేయాలి : మాజీ ఎమ్మెల్యే చెరుపల్లి సీతారాములు
చేనేత సమస్యలపై ఈనెల 20న మహాధర్నా.. కరపత్రం విడుదల
నవతెలంగాణ – ముషీరాబాద్
చేనేత సమస్యలు పరిష్కరించి వెంటనే రుణమాఫీ చేయాలని మాజీ ఎమ్మెల్యే చెరుపల్లి సీతారాములు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రుణమాఫీ, చేనేత సమస్యలు పరిష్కరించాలని చేనేత కార్మిక సంఘం ఆధ్వర్యంలో 20వ తేదీన రాష్ట్ర కమిషనర్ కార్యాలయం ముందు జరిగే మహాధర్నాను జయప్రదం చెయ్యాలని పిలుపునిస్తూ బుధవారం హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చెరుపల్లి సీతారాములు మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి చేనేతలకు రుణమాఫీ ప్రకటించి ఏడాది దాటినా అమలు కాలేదన్నారు. చేనేత సహకార సంఘాలకు 12 ఏండ్ల నుంచి ఎన్నికలు లేవని, వెంటనే ఎన్నికలు నిర్వహిస్తే కార్మికులకు ఉపాధి లభిస్తుందన్నారు.
సంఘాల క్యాష్ క్రెడిట్ లోను రద్దు చేయాలని, నిల్వ ఉన్న వస్త్రాలను కొనుగోలు చేయాలని కోరారు. ఏండ్ల నుంచి సహకార సంఘాలను 51 జీవో విచారణ పేరుతో వేధిస్తున్నారని అన్నారు. చేనేత పథకాలు విషయంలో ఎలాంటి కొర్రీలు పెట్టకుండా అమలు చేయాలన్నారు. పోచంపల్లి చేనేత వస్త్రాలకు పేటెంటు ఉన్నా సూరత్‌లో డూప్లికేట్ తయారు చేసి పది వేల రూపాయల చీర ఐదు వందలకే అమ్ముతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఈ డూప్లికేట్‌ను అరికట్టాలన్నారు. చేనేతపై జీరో జీఎస్టీ అంటే.. చేనేత పట్టు చీర రూ.2500 దాటితే 18శాతం జీఎస్టీ విధిస్తున్నదని, జీఎస్టీ రద్దుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. పవర్ లూమ్ రంగం పోటీకి తట్టుకునే విధంగా చేనేతకు సబ్సిడీలు ఇచ్చి ఆదుకోవాలన్నారు.
కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ రద్దు చేయకపోతే రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని సీఎం హామీ ఇచ్చారని, ఆ హామీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. రద్దు చేసిన సంక్షేమ పథకాల పునరుద్దరణకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. సిరిసిల్లలో వర్క్ టూ ఓనర్ పథకం పూర్తి చేసి పవర్ లూమ్ కార్మికులకు అందించాలని అన్నారు. పవర్ లూమ్ కార్మికులకు, అనుబంధ కార్మికులకు యారన్ సబ్సిడీ అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అధ్యక్షులు వనం శాంతి కుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంజి మురళీధర్, గీత కార్మిక సంఘం అధ్యక్షులు రమణ, మత్స్యకారుల సంఘం అధ్యక్షులు లెల్లెల బాలకృష్ణ, కార్యదర్శి ముషం నరహరి, రంగారెడ్డి జిల్లా చేనేత కార్మిక సంఘం అధ్యక్షులు చెరుకు స్వామి, రాజోలి చేనేత కార్మికులు అబ్దుల్ వాహిద్, షేక్ షావలి పాల్గొన్నారు.
చేనేత సమస్యలు పరిష్కరించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



