Thursday, November 13, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంచేనేత సంక్షేమ పథకాలు మన హక్కు

చేనేత సంక్షేమ పథకాలు మన హక్కు

- Advertisement -

కలిసికట్టుగా పోరాడితేనే మనుగడ సాధ్యం
20న నిర్వహించే చేనేత మహాధర్నాను జయప్రదం చేయాలి :తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు చెరుపల్లి, అధ్యక్షులు శాంతికుమార్‌

నవతెలంగాణ – జోగులాంబ గద్వాల
చేనేత కార్మికులకు అందాల్సిన సంక్షేమ పథకాల కోసం కలిసికట్టుగా పోరాడి సాధించుకోవాలని, అది మన హక్కు అని తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు చెరుపల్లి సీతారాములు, అధ్యక్షులు వనం శాంతికుమార్‌ అన్నారు. విభిన్న మతాలకు, కులాలకు అతీతంగా రాజోలి చేనేత కేంద్రంగా ఉన్నదని చెప్పారు. బుధవారం జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండల కేంద్రంలో చేనేత సహకార సంఘం అధ్యక్షులు దోత్రి శ్రీనివాసులు ఆధ్వర్యంలో నిర్వహించిన చేనేత రుణమాఫీ మహార్యాలీని ప్రారంభించారు. రాజోలి చేనేత సహకార సంఘం నుంచి ప్రధాన వీధుల మీదుగా తహసీల్దార్‌ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి, అక్కడ నిరసన చేపట్టారు. తహసీల్దార్‌ రామ్మోహన్‌కు చేనేత సమస్యలపై వినతిపత్రం అందజేశారు. గ్రామంలోని మహాత్మా గాంధీ, డాక్టర్‌ బీఆర్‌.అంబేద్కర్‌ విగ్రహాలకు నూలు మాలలు వేసి నివాళులు అర్పించారు.

అనంతరం శ్రీకన్యకా పరమేశ్వర ఆలయం ఫంక్షన్‌ హాల్‌లో నిర్వహించిన సమావేశంలో చెరుపల్లి సీతారాములు మాట్లాడుతూ.. విభిన్న మతాలు, కులాలకు అతీతంగా రాజోలి చేనేత కేంద్రంగా ఉందని అన్నారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పట్టు చీరలకు చాలా ప్రాముఖ్యత ఉందని, ప్రభుత్వాలు మారుతున్నాయి తప్ప చేనేత కార్మికుల బతుకులు మారడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈనెల 20న నిర్వహించే మహాధర్నాలో అధిక సంఖ్యలో చేనేత కార్మికులు పాల్గొనాలని కోరారు. శాంతికుమార్‌ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ ప్రభుత్వం చేనేత రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి చేయడం లేదని అన్నారు. ఉపాధి లేక.. అప్పుల పాలైన చేనేత కార్మికులకు రూ.63 కోట్ల రుణమాఫీ చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందన్నారు. వీటన్నింటిపై ఈ నెల 20న హైదరాబాద్‌ లోని చేనేత, జౌళి శాఖ కమిషనర్‌ కార్యాలయం ఎదుట మహాధర్నా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ మహాధర్నాకు రాజోలి చేనేత కార్మికులు అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని, పోరాడితేనే తమ హక్కులు సాధించుకోగలమని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నరహరి, రాజోలి చేనేత సహకార సంఘం అధ్యక్షులు డి.శ్రీనివాసులు, ఉపాధ్యక్షులు మాబు, కాంగ్రెస్‌ మండల అధ్యక్షులు దస్తగిరి, సీపీఐ(ఎం) నాయకులు, చేనేత కార్మికులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -