Saturday, November 15, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుజూబ్లీలో హస్తం హవా

జూబ్లీలో హస్తం హవా

- Advertisement -

ఉప పోరులో కాంగ్రెస్‌ అభ్యర్థి నవీన్‌యాదవ్‌ గెలుపు
24,729 ఓట్ల మెజారిటీ
ప్రతిరౌండ్‌లోనూ ఆధిక్యం ప్రదర్శించిన కాంగ్రెస్‌
బీఆర్‌ఎస్‌ అభ్యర్థి మాగంటి సునీత ఓటమి
డిపాజిట్‌ కోల్పోయిన బీజేపీ
నాలుగో స్థానంలో నోటా

నవతెలంగాణ-సిటీబ్యూరో
హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌ శాసనసభ నియోజకవర్గ ఉపఎన్నికలో కాంగ్రెస్‌ అభ్యర్థి నవీన్‌ యాదవ్‌ ఘన విజయం సాధించారు. మొదటి రౌండ్‌ నుంచి ఆధిక్యాన్ని ప్రదర్శించి విజయాన్ని సొంతం చేసుకున్నారు. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి మాగంటి సునీతపై 24,729 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచి ప్రతి రౌండ్‌లోనూ కాంగ్రెస్‌ అభ్యర్థి ఆధిక్యం కొనసాగింది. కాగా, ఈ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి దీపక్‌ రెడ్డి డిపాజిట్‌ కోల్పోయారు. శుక్రవారం యూసుఫ్‌గూడ లోని కోట్ల విజయభాస్కర్‌రెడ్డి ఇండోర్‌ స్టేడియంలో ఉదయం ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచి నవీన్‌ యాదవ్‌ ఆధిక్యంలో కొనసాగారు. మొత్తం 10 రౌండ్ల లెక్కింపు ముగిసేసరికి ఆయనకు 98,988 ఓట్లు రాగా, మాగంటి సునీతకు 74,259 ఓట్లు పోలయ్యాయి. బీజేపీ అభ్యర్థి దీపక్‌ రెడ్డికి 17,061 ఓట్లు వచ్చాయి.

ప్రతి రౌండ్‌లోనూ కాంగ్రెస్‌ ఆధిక్యం
ఓట్ల లెక్కింపులో తొలి రౌండ్‌ నుంచి చివరి రౌండ్‌ వరకు కాంగ్రెస్‌ అభ్యర్థి నవీన్‌ యాదవ్‌ తన ఆధిక్యాన్ని నిలబెట్టుకున్నారు. మొదటి రౌండ్‌లో కాంగ్రెస్‌కు 8,911 ఓట్లు, బీఆర్‌ఎస్‌కు 8,864 ఓట్లు లభించడంతో.. 47 ఓట్ల స్వల్ప ఆధిక్యంతో కాంగ్రెస్‌ తన ప్రస్థానాన్ని ప్రారంభించింది. రెండో రౌండ్‌లో కాంగ్రెస్‌ 9,691 ఓట్లు సాధించగా, బీఆర్‌ఎస్‌ 8,609 ఓట్లు పొందింది. ఐదో రౌండ్‌ ముగిసేసరికి కాంగ్రెస్‌ ఆధిక్యం 12,859 ఓట్లకు చేరింది. ఆరో రౌండ్‌ నుంచి తొమ్మిదో రౌండ్‌ ముగిసే సమయానికి కాంగ్రెస్‌ ఆధిక్యం 23,921 ఓట్లకు పెరిగింది. మధ్యలో కొన్ని రౌండ్లలో బీఆర్‌ఎస్‌ పుంజుకున్న ప్పటికీ కాంగ్రెస్‌ తన ఆధిక్యాన్ని నిలబెట్టుకుంటూ విజయం దిశగా సాగింది. కౌంటింగ్‌ పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కింపుతో ప్రారంభం కాగా, అందులోనూ కాంగ్రెస్‌కే ఎక్కువ ఓట్లు లభించాయి. మొత్తం 101 పోస్టల్‌ ఓట్లు పోలవ్వగా, 96 చెల్లిన ఓట్లలో కాంగ్రెస్‌కు 43, బీఆర్‌ఎస్‌కు 25, బీజేపీకి 20 ఓట్లు వచ్చాయి.

బీఆర్‌ఎస్‌ గట్టి పోటీ.. బీజేపీకి నిరాశ
బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్‌ మరణంతో ఖాళీ అయిన జూబ్లీహిల్స్‌ స్థానాన్ని దక్కించుకునేందుకు ఆ పార్టీ తీవ్రంగానే శ్రమించింది. జూబ్లీహిల్స్‌ సిట్టింగ్‌ స్థానాన్ని నిలబెట్టుకోవాలని గట్టి ప్రయత్నమే చేసింది. ఓటర్లు కాంగ్రెస్‌ వైపు మొగ్గు చూపారు. ప్రతి రౌండూ ముగిసేసరికి బీఆర్‌ఎస్‌ అభ్యర్థి మాగంటి సునీత వెనుకంజలోనే ఉన్నారు. సానుభూతి ఏమాత్రం పని చేయలేదు. ఈ ఎన్నికలో ప్రభావం చూపుతామని భావించిన బీజేపీకి తీవ్ర నిరాశే ఎదురైంది. కేంద్ర మంత్రులు తిరిగినా ఓటర్లు బీజేపీ వైపు మొగ్గు చూపలేదు. ఆ పార్టీ అభ్యర్థి డిపాజిట్‌ కోల్పోయారు. ఈ గెలుపుతో కాంగ్రెస్‌ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి.

నోటాకు 1863 ఓట్లు
ఈ ఎన్నికలో ప్రధాన పార్టీలతో పాటు పలు చిన్న పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. మొత్తం 58 మంది అభ్యర్థులు బరిలో ఉండటం గమనార్హం. అయితే, ఏ అభ్యర్థికీ ఓటు వేయని వారి సంఖ్య కూడా గణనీయంగానే ఉంది. నోటాకు 1,863 ఓట్లు రావడం, ప్రధాన పార్టీల తర్వాత నాలుగో స్థానంలో నిలవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇతర అభ్యర్థులకు వెయ్యి కంటే తక్కువ ఓట్లు వచ్చినట్టు ఎన్నికల కమిషన్‌ వెల్లండించిన గణాంకాల ప్రకారం తెలుస్తోంది. మొత్తానికి ఈ ఉపఎన్నిక ఫలితం రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్‌ పార్టీకి మరింత బలాన్ని చేకూర్చినట్టయింది. సిట్టింగ్‌ స్థానాన్ని కోల్పోవడం బీఆర్‌ఎస్‌కు ఎదురుదెబ్బగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

బీఆర్‌ఎస్‌లో నిరాశ..కాంగ్రెస్‌లో ఉత్సాహం
జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఓటమితో కేడర్‌లో నిరాశ నెలకొంది. అధికార పార్టీ కంటే ప్రచారంలో ముందున్నా ఓట్లు తక్కువగా రావడాన్ని తట్టుకోలేకపోతున్నారు. ప్రభుత్వ వ్యతిరేకతను అన్ని రకాలుగా ప్రచారం చేసినా కాంగ్రెస్‌ పార్టీకి ఎక్కువ ఓట్లు రావడం.. మెజార్టీ కూడా భారీగా రావడం పట్ల బీఆర్‌ఎస్‌ నేతలు దిగులు చెందుతున్నారు. ఈ ఓటమి భవిష్యత్‌లో జరగబోయే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఏరకంగా ప్రభావం చూపించబోతుందోనని ఆందోళన చెందుతున్నారు. ఈ గెలుపు కాంగ్రెస్‌ పార్టీలో జోష్‌ పెంచింది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పాగా వేయొచ్చన్న ఉత్సాహంలో కాంగ్రెస్‌ నేతలు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -