తెలంగాణ విశిష్ట సాహిత్య పురస్కారానికి డాక్టర్ సంగిశెట్టి శ్రీనివాస్ ఎంపిక
తెలంగాణ భాషలో కథల పోటీ, వచన కవితల పోటీ విజేతలకు బహుమతుల ప్రధానం
నవతెలంగాణ – కంఠేశ్వర్
డిసెంబర్ 4వ తేదీన నవ్య భారతి గ్లోబల్ స్కూల్లో హరిదా సరస్వతీ రాజ్ సాహిత్యోత్సవం నిర్వహిస్తున్నట్లు హరిదా రచయితల సంఘం అధ్యక్షుడు ఘనపురం దేవేందర్ తెలిపారు. కేర్ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం సంస్థ తరఫున ప్రదానం చేసే సరస్వతీ రాజ్ హరిదా తెలంగాణ విశిష్ట సాహిత్య పురస్కారాన్ని ప్రముఖ కవి, రచయిత, విమర్శకులు, చరిత్రకారులు, వక్త, బీసీ ఉద్యమకారులు డాక్టర్ సంగిశెట్టి శ్రీనివాస్ కు ప్రదానం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ భాషలో నిర్వహించిన కథల పోటీ విజేత డాక్టర్ కాలువ మల్లయ్య, వచన కవితల పోటీ విజేత చిందం రమేశ్ లకు ఉత్తమ కథా రచయిత, ఉత్తమ వచన కవితా రచయిత పురస్కారాలతో పాటు పదివేల నగదు బహుమతిని అందజేయనున్నట్లు ఆయన వివరించారు.
అలాగే కథల పోటీలలో 9 మంది రచయితలు బి కళా గోపాల్, దుద్దంపూడి అనసూయ, పువ్వాడ శారద, దేవరపాగ జ్ఞానేశ్వర్, నామని సుజనా దేవి, రాధా హిమబిందు, బండారి రాజ్ కుమార్, మంజీత కుమార్ లకు ప్రోత్సాహక బహుమతులను, వెయ్యి రూపాయల పారితోషకాన్ని, వచన కవితా పోటీలలో 9 మంది సాహితి వేత్తలు కటుకోజ్వల రమేష్, ఐలేని గిరి, మరింగంటి శ్రీకాంత్, డాక్టర్ సబ్బని లక్ష్మీనారాయణ, దుద్దంపూడి అనసూయ, అన్నవరం దేవేందర్, దారం గంగాధర్, బి కళా గోపాల్, చొప్పదండి సుధాకర్లకు వెయ్యి రూపాయలు నగదు బహుమతిని, జ్ఞాపికను ప్రోత్సాహక బహుమతులను అందజేయనున్నట్లు ఆయన వివరించారు. అలాగే జిల్లా స్థాయిలో సాహిత్య సేవ చేస్తున్న వారికి “హరిదా సరస్వతీ రాజ్ జిల్లా స్థాయి సాహిత్య పురస్కారాలను” అందజేస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రముఖ సినీ గేయ రచయిత వరికుప్పల యాదగిరి, తెలంగాణ రచయితల సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ నాళేశ్వరం శంకరం, ప్రసిద్ధ కవులు డాక్టర్ చమన్ సింగ్, అనిల్ ప్రసాద్ లు హాజరవుతున్నట్లు ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ కవులు పంచరెడ్డి శంకర్, నరాల సుధాకర్, బీసీ నాయకులు కొయ్యాడ శంకర్ పాల్గొన్నారు. ఈ సాహిత్యోత్సవంలో ఉమ్మడి జిల్లా సాహితీ వేత్తలు, సాహిత్య అభిమానులు, తెలంగాణ ఉద్యమకారులు, అందరు పాల్గొనాలని వారు కోరారు.



