నవతెలంగాణ-హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్సీ పదవీకి జాగృతి అధ్యక్షురాలు కవిత రాజీనామా చేశారు.పదవుల కోసం తన పోరాటం కాదని తెలిపారు. పార్టీలో తనపై కుట్రలు చేశారు. పార్టీకి నష్టం చేస్తుందని ఎమ్మెల్సీ కవితపై కేసీఆర్ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆమె జాగృతి కార్యాలయంలో మీడియా సమావేశం పెట్టి స్పందించారు. హారీష్ రావు కుట్రలతో అనేక మంది పార్టీని వీడారు. ఈటల రాజేందర్, విజయశాంతి, రఘనందన్ రావులతో పాటు అనేక మంది బీఆర్ ఎస్ కు దూరంకావడానికి కారణం హారిష్ రావు అని కవిత సంచలన ఆరోపణ చేశారు. ఆరు అడుగుల బుల్లెట్ తో పార్టీ నేతలకు గాయాలు అవుతున్నాయని మండిపడ్డారు.
హారీష్ రావు, సంతోష్ కుమార్ పై జాగృతి అధ్యక్షురాలు కవిత మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీలో హారీష్ రావు, సంతోష్ కుమార్ మేకవన్నె పులులు అని ఎద్దేవా చేశారు. వాళ్ల కుట్రల కారణంగానే తనపై వేటు వేశారని, తాను కర్మ సిద్దాంతాన్ని నమ్ముతానని, భవిష్యత్ లో వాళ్లు ఇంతకు ఇంత అనుభవిస్తారని మీడియా సమావేశంలో శాపనార్థాలు పెట్టారు. తన తండ్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని తాను అంగీకరిస్తానని చెప్పారు.
దుబ్బాక ఉప ఎన్నికల్లో, హుజురాబాద్ బై పోల్ లో బీఆర్ఎస్ ఓడిపోవడానికి కారణం హారీష్ రావు అని చెప్పారు. హరీష్ రావు కుట్రల ఫలితంగానే పలు ఎన్నికల్లో పార్టీకి ఘోర పరాభవం ఎదురైందని ఆరోపించింది. తనపై లేనిపోని ఆరోపణలు చేసి తన తండ్రికి, పార్టీకి దూరం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరు అడుగుల బుల్లెట్‌తో పార్టీకే నష్టం చేకూరిందని, తన వాయిస్ ను కూడా వినకుండా ఈ నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు.
టీఆర్ఎస్ నుంచి బీఆర్‌ఎస్ మార్పు వరకు పార్టీ కోసం తాను చాలా కష్టపడ్డానని, క్లిష్ట సమయంలో పార్టీకి తాను తొడ్పాటు అందించానని గుర్తు చేశారు. పార్టీ అంతర్గత విషయాలపై లేఖ రాస్తే, ఆ లేఖను బహిర్గతం చేశారని, వాళ్లపై చర్యలు తీసుకోవాలని తాను ఫిర్యాదు చేసినా..వాళ్లపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. తాను కుటుంబ గొడవతో మీడియాకు ముందుకు రాలేదని, పొలిటికల్ ఎజెండాతో పోరాటం చేస్తున్నానని చెప్పారు. తాను భవిష్యత్ లో ఏ పార్టీలో కూడా చేరనని, జాగృతి కార్యకర్తలతో చర్చించి తన కార్యచరణను ప్రకటిస్తానని స్పష్టం చేశారు.