పెరుగుతున్న ఆటిజం పిల్లల సంఖ్య
ప్రతి 50 మందిలో ఒకరు జననం
గర్భధారణకు ముందే నివారణ మేలు
పరిశోధనల్లో తేల్చిన బాధిత వైద్యులు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
పిల్లల సమగ్ర ఎదుగుదలకు అడ్డంకిగా మారే ఆటిజంతో జన్మించే పిల్లల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. గత కొన్ని దశాబ్దాలుగా ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పులు, ప్రధానంగా రసాయనిక ఆహారపు అలవాట్లు గర్భస్థ మహిళల శరీరంలో జన్యుమార్పులకు కారణమవుతున్నట్టు పరిశోధనలు తెలుపుతున్నాయి. దీంతో గర్భంలోని పిండ దశలోనే శిశువు ఆటిజం అవలక్షణాల బారిన పడుతున్నారు. వందేండ్ల క్రితం ప్రతి 10 వేల మందిలో ఒక శిశువు ఆటిజంతో జన్మిస్తే ప్రస్తుతం ప్రతి 50 మందిలో ఒకరు ఆటిజం లక్షణాలతో జన్మిస్తున్నట్టు వివిధ అధ్యయనాలు, గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఆటిజం సమస్య గతంలో ఎన్నడూ లేని విధంగా గత రెండు దశాబ్దాల్లో అనూహ్యంగా పెరిగినట్టు తెలుస్తున్నది.
ఆటిజం బారిన పడ్డ పిల్లలు వయస్సుకు తగ్గట్లు మానసిక పరిపక్వత లేకపోవడం, ఎవరితోనూ కలవకుండా ఒంటరిగా ఉండడం, నేరుగా కండ్లలోకి చూడలేకపోవడం, మాట్లాడలేకపోవడం, చేసిన పనులనే మళ్లీ మళ్లీ చేస్తుండడం, ఎలాంటి అనుభూతిని కూడా తెలపలేకపోవడం, గాయాలు తగిలినా తెలుసుకోలేకపోవడం, శబ్దాలను పట్టించుకోకపోవడం, సరిగ్గా మాట్లాడలేక పోవడం, కారణం లేకుండా ఏడ్వడం, పిలిచినా, ఎవర్నీ చూసినా పట్టించుకోకపోవడం వంటి లక్షణాలు కలిగి ఉంటారు. ఆటిజం సమస్యను తక్కువగా అంచనా వేయడం, సరైన అవగాహన లేకపోవడంతో గర్భధారణకు ముందు అవసరమైన పరీక్షలు చేయించుకోకపోవడం, తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం కూడా ఈ సమస్యతో జన్మించే పిల్లల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది.
ఆటిజంతో జన్మించిన పిల్లలకు పూర్తి స్థాయిలో చికిత్స అందుబాటులో లేదు. ఇలాంటి పిల్లల ప్రవర్తనను తల్లిదండ్రులు గుర్తించి వారిలో సామాజిక నైపుణ్యాలను పెంపొందించే కార్యక్రమాలు చేపట్టాలని వైద్యులు సూచిస్తుంటారు. ఈ క్రమంలో నైపుణ్యం కలిగిన శిక్షకుల ద్వారా కూడా కొంత మేరకు చికిత్సనందిస్తున్నారు. అయినప్పటికీ సాధారణ ఆరోగ్యంతో జన్మించే పిల్లలతో పోలిస్తే వీరు జీవితాంతం ఆటిజం సమస్యను మోయాల్సి వస్తున్నది. సమాజంలో ఆటిజంపై అవగాహన లేకపోవడమే ప్రధాన సమస్యగా మారింది. ఈ దిశగా ప్రభుత్వాల నుంచి కూడా తగినంత ప్రచారం లేదనే చెప్పాలి.
ఆటిజం బాధిత వైద్యుల పరిశోధనలు
పెరిగిన ఆటిజం డాక్టర్ల కుటుంబాలను సైతం ఆందోళనకు గురి చేస్తున్నది. పలువురు డాక్టర్ల పిల్లలు ఆటిజం బారిన పడటంతో వారి ఆలోచనల్లో మార్పును తీసుకొచ్చింది. కార్డియాలజీ, గైనకాలజీ, డెంటల్ తదితర ప్రత్యేక వైద్య కోర్సులను అభ్యసించిన ఆ డాక్టర్లు తమ పిల్లల కోసం ఆటిజం పరిశోధనలవైపు మళ్లారు. ప్రముఖ కార్డియాలజిస్టు డాక్టర్ చంద్రశేఖర్ తొడుపునూరి, అమెరికాకు చెందిన దంత వైద్యురాలు డాక్టర్ కళా రమ్య మారేపల్లి తదితర వైద్యులు తమ పిల్లలను ఆటిజం నుంచి బయటపడేసేందుకు ఏకమయ్యారు. ఆటిస్టిక్ సమస్యను ఎదుర్కొంటున్న బాలల గట్ బ్రెయిన్ యాక్సిన్ ను పరిష్కరించే ప్రధాన చికిత్స ఫీకల్ మైక్రోబయోటా ట్రాన్స్ ప్లాంటేషన్ థెరపీని దేశంలోని తొలిసారిగా హైదరాబాద్‌లో రెస్‌ప్లెస్ ఆటిజం రీసెర్చి ఇనిస్టిట్యూట్ ద్వారా అందిస్తున్నారు.
ఉచిత అవగాహనా కార్యక్రమం
రెస్‌ప్లెస్ ఆటిజం రీసెర్చి ఇనిస్టిట్యూట్ ఈ నెల 29 నుంచి నవంబర్ 15 వరకు ఉచిత అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. ఉచిత అసెస్‌మెంట్ ప్రోగ్రామ్‌ను అందిస్తోంది. మరిన్ని వివరాలు, రిజిస్ట్రేషన్ల కోసం 9100065552 నెంబర్ లో తల్లిదండ్రులు సంప్రదించవచ్చు.
ఆటిజం లేని తరం మా లక్ష్యం
ఆటిజం లేని తరం కోసం తమ పరిశోధనలు, ప్రయత్నాలు అని డాక్టర్ కళారమ్య మారేపల్లి తెలిపారు. ఆమె తన ఏడున్నర సంవత్సరాల బాబు కోసం అమెరికాలో డెంటల్ ప్రాక్టీస్ వదిలి హైదరాబాద్‌లో ఆటిజం పరిశోధనల్లో భాగస్వామిగా మారారు. గర్భిణిలకు డీటాక్స్ ఇస్తూ, నివారణ నమూనాతో చికిత్స అందిస్తున్నట్టు తెలిపారు. గర్భధారణ సమయంలో ప్లాస్టిక్‌లు, పురుగుమందులు, సౌందర్య సాధనాలు మొదలైనవి వినియోగించకుండా జాగ్రత్తలు తీసుకొని శరీరంలోకి విషపదార్థాలు ప్రవేశించకుండా నిరోధించేందుకు గర్భిణులు సేంద్రీయ ఆహారాన్ని మాత్రమే తినేలా ప్రోత్సహిస్తామని వెల్లడించారు.
డాక్టర్ కళారమ్య మారేపల్లి
మూలకారణాల్లోకి మా పరిశోధనలు
2017 నుంచి పరిశోధనలు చేశాం. డాక్టర్లుగా తమ పిల్లలే ఆటిజం బారిన పడటంతో మూల కారణాలను వెతికే దిశగా లోతైన పరిశోధన జరిపాం. విషరహిత గర్భధారణకు వీలు కల్పించే దిశగా పేగు-మెదడుకు సంబంధంపై పరిశీలించాం. చిన్నారుల పేగులకు పలు ఇబ్బందులు రావడం గమనించాం. పేగు మైక్రోబియోమ్‌కు సంబంధించిన సమస్యలకు చికిత్స అందించి వారి జీవన ప్రమాణం, ప్రవర్తన, నడవడి లక్షణాలు మార్చేందుకు ప్రయత్నించాం. ఫలితంగా పేగు (గట్) మైక్రోబయోమ్ మార్పిడిని ఆవిష్కరించాం.
పిల్లలతో పాటు పెద్దవారిలోనూ విషరహితమైన వ్యాధిని నియంత్రించే ప్రొటోకాల్స్ ద్వారా పేగు సంబంధిత సమస్యలకు పరిష్కారంతో పాటు తల్లుల గర్భధారణ సమయంలో ఆటిజం రావడానికి దారి తీస్తున్న బాహ్యకారకాలను నిరోధించవచ్చని నిర్ధారణకు వచ్చాం. ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చీ (ఐసీఎంఆర్) అనుమతితో పేగు (గట్) మైక్రోబయోమ్ మార్పిడి (జీఎంటీ -ఎఫ్‌ఎంటీ) పరిశోధనలో మొట్టమొదటి స్టూల్ బ్యాంక్‌ను ఏర్పాటు చేశాం. ఎఫ్‌ఎంటీలో దాత మలం నుంచి ఆరోగ్యకరమైన గట్ బ్యాక్టీరియా రోగి జీర్ణవ్యవస్థలోకి బదిలీ చేయడం ద్వారా సమతుల్యత కలిగిన గట్ మైక్రోబయోమ్‌ను పునరుద్ధరిస్తాం.
డాక్టర్ చంద్రశేఖర్ తొడుపునూరి



