- Advertisement -
సముద్రాన్ని ఎప్పుడైనా ప్రేమించావా
ఉప్పగా ఉంటుందని నచ్చదు కదూ !?
పోనీ
అలల్ని ఎప్పుడైనా కౌగిలించుకున్నావా ?
ఓహో
కరిగిపోతాయని వదిలేసుంటావు !
మరి
వాళ్లంతా తీరంలో ఎందుకు తిరుగుతున్నారూ?
ఉదయించే రాత్రికి వాళ్లేదో చెప్పాలనుకుంటున్నారు
కలల్ని,కన్నీటిని వేరు చేసే శక్తి
సముద్రానికుంది కాబట్టే
నీరు ఉప్పగా ఉంటుందేమో !
ఏండ్ల నాటి నాగరికతను
గాలి నీకు పరిచయం చేస్తుంది
తీరంలోని ఓడలు
ఓడిపోయిన ప్రేమ కథల్ని చెబుతాయి
నిర్జీవ జ్ఞాపకాలతో
అలల ఆహ్వానానికి ఈసారి వెళ్ళినప్పుడు
నీ అస్తిత్వానికి గుర్తుగా
గుప్పెడు ఇసుక
నాకోసం తెస్తావు కదూ !?
– గడ్డం లింగస్వామి, 9010081146
- Advertisement -