నవతెలంగాణ-హైదరాబాద్ : ప్రియుడితో మాట్లాడుతోందని అక్కను దారుణంగా చంపాడు తమ్ముడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం పెంజర్లలో సోమవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. పెంజర్లకు చెందిన మేస్త్రీ దేశాల రాఘవేందర్, సునీత దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. పెద్దకుమార్తె రుచిత (21) డిగ్రీ పూర్తి చేసి ఎంబీఏ అడ్మిషన్ కోసం ఎదురుచూస్తోంది. అదే గ్రామానికి చెందిన యువకుడితో ప్రేమ వ్యవహారం నడుస్తోంది. ఈ విషయంపై కుటుంబంలో గొడవలు జరిగేవి. పెద్దల సమక్షంలో పంచాయితీ వరకు వెళ్లగా ఇకపై మాట్లాడుకోబోమని వారు చెప్పడంతో సమస్య సద్దుమణిగింది.
కొంతకాలం నుంచి మళ్లీ ఫోన్ సంభాషణలు మొదలయ్యాయి. దీనిపై సోదరుడు రోహిత్(20) రుచితను మందలిస్తూ వస్తున్నాడు. సోమవారం తల్లిదండ్రులు పనులకు వెళ్లగా ఇంట్లో రుచిత, రోహిత్ మాత్రమే ఉన్నారు. ఈ సమయంలో ప్రేమికుడితో అక్క ఫోన్‌లో మాట్లాడటాన్ని గమనించిన రోహిత్ ఆమెతో గొడవకు దిగాడు. కోపంలో మెడకు వైరు బిగించి ఊపిరాడకుండా చేయడంతో రుచిత చనిపోయింది. బంధువులకు ఫోన్ చేసి అక్క స్పృహ కోల్పోయిందని సమాచారమిచ్చాడు. వారు వచ్చి పరిశీలించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.