– పెట్రోల్ పోసి సజీవ దహనం.. ఆ తర్వాత తండ్రి ఆత్మహత్య
– లభ్యమైన చిన్నారుల మృతదేహలు
నవతెలంగాణ-కల్వకుర్తి టౌన్/ ఉప్పునుంతల/ వెల్దండ
భార్యతో గొడవ పడి ఆ కోపంలో ముగ్గురు పిల్లలను తీసుకుని ఇంట్లో నుంచి బైక్‌పై బయటకొచ్చిన ఓ వ్యక్తి.. ఆ పసి హృదయాలను కిరాతకంగా పెట్రోల్ పోసి సజీవ దహనం చేశాడు.. ఆ తర్వాత అతను పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. బుధవారం తండ్రి మృతదేహం లభ్యం కాగా.. అతని దగ్గర లభ్యమైన ఆధారాలతో ప్రకాశం జిల్లాలోని కుటుంబీకులకు పోలీసులు సమాచారం అందించారు. అయితే, తండ్రి వెంట ఉన్న ముగ్గురు పిల్లల ఆచూకీ లభ్యం కాకపోవడంతో తీవ్ర ఆందోళన చెందారు. పోలీసులు గాలించి ఆ పిల్లల మృతదేహాలను గుర్తించారు. ఈ ఘటన నాగర్‌కర్నూల్ జిల్లాలో తీవ్ర కలకలం సృష్టించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం పెద్దబోయపల్లి గ్రామానికి చెందిన గుత్తా వెంకటేశ్వర్లు ఫర్టిలైజర్ వ్యాపారం చేసేవాడు. గత నెల 30న వెంకటేశ్వర్లు భార్య దీపికతో గొడవపడి ముగ్గురు పిల్లలను తీసుకొని మోటార్ సైకిల్‌పై ఇంటి నుంచి బయటకొచ్చాడు. ఆ తర్వాత తిరిగి ఇంటికి రాకపోవడంతో దీపిక స్థానికంగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు విచారణ చేపట్టారు. బుధవారం తెల్లవారుజామున వెల్దండ మండలం పెద్దాపూర్ రెవెన్యూ శివారులో ఓ మృతదేహం లభ్యం కాగా.. అతని వద్ద లభించిన ఆధారాలతో ప్రకాశం జిల్లాకు చెందిన వెంకటేశ్వర్లుగా పోలీసులు గుర్తించారు. వెంటనే ఆ రాష్ట్ర పోలీసులకు సమాచారం అందించారు. అప్పటికే అతని భార్య ఫిర్యాదు చేసినందున.. వెంట ఉన్న పిల్లలు కనిపించకపోవడంతో విచారణ చేపట్టారు.
నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం హాజీపూర్ వద్ద ఓ హోటల్ తదితర ప్రాంతాల్లో ఉన్న సీసీ ఫుటేజీలను పరిశీలించారు. వెంకటేశ్వర్లు ఇంటి నుంచి బయలుదేరి శ్రీశైలం మీదుగా అచ్చంపేట, కల్వకుర్తి ప్రాంతానికి చేరుకున్నాడు. మధ్యలోనే ఇద్దరు చిన్నారులను పెట్రోల్ పోసి సజీవ దహనం చేశాడు. మరో చిన్నారిని ఇంకోచోట పెట్రోల్ పోసి కాల్చేసినట్టు ప్రాథమిక దర్యాప్తులో పోలీసులు తేల్చారు. ఉప్పునుంతల మండలం సూర్యతండా సమీపంలోని శివారు ప్రాంతంలో లభ్యమైన రెండు మృతదేహాలు వెంకటేశ్వర్లు చిన్న కుమార్తె వర్షిణి(6), కుమారుడు శివ వర్మ(4)గా నిర్ధారించారు. కల్వకుర్తి మండలం తాండ్ర గ్రామం మస్కటి ఐస్‌క్రీమ్ పార్లర్ సమీపంలో పెద్ద కుమార్తె మోక్షిత(8) మృతదేహాన్ని వంగూరు పోలీసులు కనుగొన్నారు. పిల్లల శరీరాలు పూర్తిగా కాలిపోయి, గుర్తుపట్టలేని విధంగా మాంసం ముద్దలుగా మారాయి. సంఘటనా స్థలాలను పరిశీలించిన అచ్చంపేట, వెల్దండ పోలీసులు కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. అయితే, వెంకటేశ్వర్లు భార్యతో గొడవల వల్లే ఈ దారుణానికి పాల్పడ్డాడా? మరేదైనా కారణాలు ఉన్నాయా? అన్న కోణాల్లో పోలీసులు విచారణ చేస్తున్నారు.
ముగ్గురు పిల్లలను చంపేశాడు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES