Saturday, November 1, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్భారీ వర్షంతో ఆస్తి  ప్రాణ నష్టం 

భారీ వర్షంతో ఆస్తి  ప్రాణ నష్టం 

- Advertisement -

– నష్టపోయిన రైతుకు ఎకరానికి పదివేలు చెల్లిస్తాం  
– హుస్నాబాద్ లో వరద ఇబ్బంది లేకుండా చూస్తాం 
– రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ 
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్ 
: హుస్నాబాద్ నియోజకవర్గంలో అతి భారీ వర్షం సంభవించి ప్రజలకు అపార ప్రాణ, ఆస్తి నష్టం కలిగించిందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.  ఇటీవల జిల్లాలో కురిసిన వర్షానికి నష్టపోయిన వరద బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ఎవరు అధైర్య పడవద్దని అన్నారు. పంట పొలాలలో కోసేందుకు సిద్ధంగా ఉన్న వరి, పత్తి పంట కాకుండా హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో అమ్మడం కోసం తీసుకువచ్చిన వరిధాన్యంలో 90 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పూర్తిగా కొట్టుకు పోయిందన్నారు.  వేలాది మెట్రిక్ టన్నుల వరిధాన్యం అకాల వర్షానికి తడిచి రైతులకు అపార నష్టాన్ని కలిగించిందని అన్నారు.

ఈ అపారనష్టం పై వెంటనే స్పందించి స్వయంగా నేను జిల్లా కలెక్టర్ కె. హైమావతి హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలోని మండలాలు , మార్కెట్ యార్డ్ ను క్షేత్రస్థాయిలో పరిశీలించినట్లు చెప్పినారు. నష్టపోయిన రైతులకు ప్రభుత్వం తరఫున ఆదుకునేందుకు తక్షణమే చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. అక్కన్నపేట మండలం మోత్కులపల్లి వద్ద వరదలో గల్లంతయి మృత్యువాత పడ్డ ముగ్గురి కుటుంబాలను,  అధిక వర్షాలతో మృత్యువాత పడ్డ ఎనిమిది పశువుల యజమానులను ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని అన్నారు. గత నెల 31న  సీఎం రేవంత్ రెడ్డి తో కలిసి ఏరియల్ సర్వే ద్వారా హుస్నాబాద్ నియోజకవర్గం పరిధిలో పంట నష్ట తీవ్రతను, చెడిపోయిన రహదారులను, కల్వర్టులను పరిశీలించినట్లు పేర్కొన్నారు.

హుస్నాబాద్ పట్టణంలో అధిక వర్షాలతో ప్రధాన రహదారితోపాటు వివిధ కాలనీలలో నిలిచిన వరద నీటితో ప్రజలు పడ్డ ఇబ్బందులు భవిష్యత్తులో కలగకుండా చూస్తామన్నారు. హుస్నాబాద్ పట్టణంలో మురుగునీరు, వరదనీరు డ్రైనేజీ వ్యవస్థ, రోడ్ల నిర్మాణానికి రూ.80 కోట్ల రూపాయల తో డిపిఆర్ ను రూపొందించడం జరిగిందని అన్నారు. సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా అధిక వర్షాలతో 3491 మంది రైతులకు సంబంధించిన 4844 ఎకరాల్లో వరి, 393 రైతులకు సంబంధించిన 588 ఎకరాల్లో పత్తి, 32 రైతులకు సంబంధించి 51 ఎకరాల్లో మొక్కజొన్న పంటలకు నష్టం కలిగిందన్నారు.

హుస్నాబాద్ నియోజకవర్గం పరిధిలోని హుస్నాబాద్, కోహెడ, అక్కన్నపేట మండలాల్లో 2565 మంది రైతులకు సంబంధించిన 3454 ఎకరాలలో వరి, 24 మంది రైతులకు సంబంధించిన 37 ఎకరాల మొక్కజొన్న, 290 మంది రైతులకు సంబంధించిన 454 ఎకరాల పత్తి పంట నష్టంను ప్రాథమికంగా గుర్తించడం జరిగిందని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించిన విధంగా ఎకరానికి పదివేల రూపాయల చొప్పున నష్టపరిహారం చెల్లించడం జరుగుతుందని అన్నారు. వాటితోపాటు అధిక వర్షాలతో దెబ్బతిన్న పంచాయతీరాజ్, ఆర్ అండ్ బి రోడ్లను, కల్వర్ట్లను గుర్తించి వాటి పునరుద్ధరణ పనులతో పాటు భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బంది కలగకుండా శాశ్వత నిర్మాణాలను చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. హుస్నాబాద్ మార్కెట్ యార్డులో తడిసిన  230 మెట్రిక్ టన్నులకు పైగా వరిధాన్యం మద్దతు ధరతో సేకరించి రైస్ మిల్లులకు తరలించడం జరిగిందని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -