నవతెలంగాణ-హైదరాబాద్: దేశరాజధాని ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతం మంగళవారం భారీ వర్షాలతో అతలాకుతలమైంది. నోయిడా, ఘాజియాబాద్, గురుగ్రామ్, ఫరీదాబాద్ వంటి నగరాల్లో రహదారులు జలమయమయ్యాయి. వాహనాల రాకపోకలు తీవ్రం అంతరాయం ఏర్పడింది. అయితే, ఆగస్టు 17 వరకు ఆయా ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎమ్‌డీ) పేర్కొంది.
ఈ వర్షాకాలంలో దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ సాధారణ వర్షపాతం నమోదైనట్టు ఐఎమ్‌డీ తెలిపింది. జూన్ 1 నుండి ఆగస్టు 10 వరకు దేశం మొత్తం 539 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని వివరించింది. ఇది దీర్ఘకాల సగటు కంటే 1 శాతం అధికం. అయితే, కొన్ని రాష్ట్రాల్లో అతివృష్టి మరికొన్ని చోట్ల అనావృష్టి ఉన్నచట్టు కూడా ఐఎమ్‌డీ పేర్కొంది. 25 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో సాధారణ వర్షపాతం, 5 ప్రాంతాల్లో వర్షపాతం సాధారణం కంటే తక్కువగా ఉన్నట్టు పేర్కొంది. 5 ప్రాంతాల్లో అధిక వర్షపాతం, లడాఖ్‌లో భారీ వర్షపాతం నమోదైంది.
ప్రభుత్వాలు మరియు స్థానిక సంస్థలు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని, అధికారుల సూచనలు పాటించాలని కోరుతున్నాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో నివసించే వారు అత్యవసర నంబర్లను ఉపయోగించి సహాయం పొందవచ్చు. వర్షాల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని, ప్రయాణాలు, బహిరంగ కార్యకలాపాల్లో జాగ్రత్తలు తీసుకోవడం అత్యవసరం.