Tuesday, August 19, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంభారీ వర్షాలు.. స్కూళ్లు, కాలేజీలు బంద్

భారీ వర్షాలు.. స్కూళ్లు, కాలేజీలు బంద్

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: ముంబై నగరాన్ని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోత వానలతో మహానగరం స్తంభించిపోయింది. అనేక ప్రాంతాలు నీట మునిగి జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ (ఐఎండీ) నేడు రెడ్ అలర్ట్ జారీ చేయడంతో బృహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) అప్రమత్తమైంది. నగరంలోని అన్ని పాఠశాలలు, కళాశాలలకు మంగళవారం సెలవు ప్రకటించింది.

నిన్న కురిసిన వర్షాలకు ముంబైలోని పలు లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. రోడ్లపై నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కొన్నిచోట్ల చెట్లు కూలిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విమానాశ్రయానికి వెళ్లే దారుల్లో నీరు చేరడంతో, ప్రయాణికులు ముందుగానే బయలుదేరాలని ఇండిగో ఎయిర్‌లైన్స్ సూచించింది.

ఈ వర్షాల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు ఏడుగురు మరణించినట్లు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ముంబైలో జరిగిన వేర్వేరు విషాద ఘటనలు తీవ్ర ఆవేదనకు గురిచేశాయి. గోద్రెజ్ బాగ్ అపార్ట్‌మెంట్‌లో గోడ కూలి సతీష్ టిర్కే (35) అనే వాచ్‌మన్‌ మృతి చెందాడు. వాల్మీకి నగర్‌లో ఓ వ్యక్తి డ్రైనేజీలో కొట్టుకుపోగా, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గాలిస్తున్నాయి. మరో దారుణ ఘటనలో, పాఠశాల నుంచి కుమారుడిని తీసుకుని వస్తున్న యులోజియస్ సెల్వరాజ్ (40) అనే మహిళ, ఆమె ఏడేళ్ల కుమారుడు ఆంటోనీ బెస్ట్ బస్సు ఢీకొని ప్రాణాలు కోల్పోయారు.

కేవలం 81 గంటల వ్యవధిలోనే ముంబైలో 550 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇది దాదాపు ఆగస్టు నెల సగటు వర్షపాతంతో సమానం కావడం గమనార్హం. నగరానికి తాగునీరు అందించే ఏడు సరస్సులలో ఒకటైన విరార్ సరస్సు సోమవారం మధ్యాహ్నం నిండి పొంగిపొర్లింది. రత్నగిరి, రాయగడ్, హింగోలి జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయని, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం ఫడ్నవీస్ ఆదేశించారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad