Friday, August 15, 2025
E-PAPER
spot_img
Homeప్రధాన వార్తలుభారీ వర్షాలు.. ఉప్పొంగుతున్న చెరువులు

భారీ వర్షాలు.. ఉప్పొంగుతున్న చెరువులు

- Advertisement -

– జలాశయాల్లోకి పోటెత్తుతున్న వరద
– మత్తడి దుంకుతున్న చెరువులు, కుంటలు
– రహదారులపై నుంచి పారుతున్న నీరు
– ఏడుపాయల ఆలయం మూసివేత
– హిమాయత్‌సాగర్‌ రిజర్వాయర్‌ 10 గేట్లు ఎత్తివేత
– ఉధృతంగా మూసీ
– బ్రిడ్జిలపై నుంచి రాకపోకలు బంద్‌
నవతెలంగాణ-విలేకరులు

రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో జలాశయాలు నిండుకుండల్లా మారాయి. చెరువులు, కుంటలు మత్తడి పోస్తుండటంతో రోడ్ల పై నుంచి వరద పారుతోంది. గ్రామాలకు రాకపోకలు బంద్‌ అయ్యాయి. మహబూబ్‌నగర్‌లో జాతీయ రహదారి తెగిపోయింది. హైదరాబాద్‌లోనూ వరద నీరంతా జంట జలాశయాల్లోకి చేరుతోంది. హిమాయత్‌సాగర్‌ గేట్లను ఎత్తడంతో మూసీ నది ఉగ్రరూపం దాల్చింది. వరద ప్రవాహం పలుచోట్ల రాకపోకలకు ఆటంకంగా మారింది. సింగూరు నుంచి నీరు విడుదల చేయడంతో ఏడుపాయల వనదుర్గా ఆలయం వద్ద వరద పోటెత్తింది. దాంతో ఆలయాన్ని తాత్కాలికంగా మూసేశారు. మూడ్రోజుల పాటు వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ ప్రకటించడంతో అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమైంది.

జంట జలాశయాలు
హిమాయత్‌సాగర్‌, ఉస్మాన్‌సాగర్‌కు భారీగా వరద నీరు వస్తుండటంతో గురువారం హిమాయత్‌సాగర్‌ రిజర్వాయర్‌ 10 గేట్లను జలమండలి అధికారులు ఎత్తారు. 10 గేట్లను నాలుగు అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రస్తుతం హిమాయత్‌సాగర్‌కు 19000 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రాగా.. 12046 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో ఉంది. మరోవైపు ఉస్మాన్‌సాగర్‌ (గండిపేట్‌) రిజర్వాయర్‌కు 2800 క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. రిజర్వాయర్‌ మొత్తం సామర్థ్యం 3.9 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 2.919 టీఎంసీలు ఉంది. పూర్తి స్థాయి నీటి మట్టం 1790 అడుగులు కాగా.. ప్రస్తుతం 1785.50 అడుగులు ఉంది. జలాశయాల గేట్లు ఎత్తినందున పరివాహక ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని, హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల పరిపాలనా యంత్రాంగాలు, హైడ్రా, జీహెచ్‌ఎంసీ, పోలీసు అధికారులతో సమన్వయంతో వ్యవహరించాలని జలమండలి అధికారులను జలమండలి ఎండీ అశోక్‌రెడ్డి ఆదేశించారు.

ఉధృతంగా ప్రవహిస్తున్న మూసీ నది
మూసీ నదికి వరద పోటెత్తుతోంది. పురానాపూల్‌ వద్ద మూసీ ఉధృతంగా ప్రవహిస్తోంది. జియాగూడ బైపాస్‌ రోడ్డుపై వరద నీరు వస్తుండటంతో పురానాపూల్‌ నుంచి లంగర్‌హౌజ్‌ వైపునకు రాకపోకలు బంద్‌ అయ్యాయి. మలక్‌పేట్‌లోని మూసారాంబాగ్‌ బ్రిడ్జి పై నుంచి రాకపోకలు నిలిచాయి. జీహెచ్‌ఎంసీ అధికారులు మూసీ తీరవాసులను అప్రమత్తం చేశారు. బేగంబజార్‌ వద్ద పురాతన భవనం కూలింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షానికి వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. హిమాయత్‌సాగర్‌తోపాటు కోట్‌పల్లి, సర్పన్‌పల్లి ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు చేరింది. ధారూర్‌ మండలం గురుదొడ్లలో చెరువుకు గండి పడి పంట పొలాలు నీట మునిగి పైర్లు కొట్టుకుపోయాయి. దాదాపుగా 50 ఎకరాల పంట నష్టం జరిగింది. వికారాబాద్‌ జిల్లా దోమలో 118.5 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదైంది. తాండూర్‌లో పత్తి పంట నీటమునిగింది. వికారాబాద్‌ జిల్లా వ్యాప్తంగా కలెక్టర్‌ ప్రతీక్‌జైన్‌, ఎస్పీ నారాయణరెడ్డి పర్యటించి, పరిస్థితిని సమీక్షించారు.బుధవారం రాత్రి మహబూబ్‌నగర్‌ జిల్లా మొత్తంగా 81.9 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. చెరువులు, కుంటలు మత్తడి దుంకుతున్నాయి. వనపర్తి జిల్లా పాన్‌గల్‌ మండల పరిధిలోని నల్లకుంట చెరువు అలుగు పారడంతో రేమద్దుల- కేతెపల్లి రోడ్డుపైకి భారీగా వరద వచ్చింది. నాగర్‌కర్నూల్‌ పరిధిలో దుందుభి నదికి భారీగా వరద చేరడంతో నీటిమట్టం ప్రమాదకర స్థాయికి చేరింది. పంట పొలాలు మునిగిపోయాయి. మహబూబ్‌నగర్‌ జిల్లా గండీడ్‌ మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాల మైదానం ముంపునకు గురైంది. నాగర్‌కర్నూల్‌ జిల్లా వంగూరు మండల కేంద్రంలో తహసీల్దార్‌, ఎంపీడీవో, పోలీస్టేషన్‌, ఎస్సీ, బీసీ వసతి గృహాలు వరద నీటిలో చిక్కుకున్నాయి.

జలదిగ్బంధంలో ఏడుపాయల
సంగారెడ్డి జిల్లాలోని సింగూరు ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో ప్రాజెక్టులోనికి 5000 క్యూసెక్కుల వరద నీరు వస్తున్నట్టు అధికారులు చెప్పారు. ప్రాజెక్టు నుంచి దిగువకు నీటిని వదలడంతో మెదక్‌ జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పాపన్నపేట మండలం ఏడుపాయల వనదుర్గ మాత ఆలయం జలదిగ్బంధంలో చిక్కుకుంది. ఆలయం ముందున్న నదీ పాయ ఉధృతంగా ప్రవహిస్తోంది. ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. ఘణపురం ఆనకట్ట పూర్తిగా నిండి పొంగిపొర్లుతోంది. మంజీరా నది పాయలు పరవళ్లు తొక్కుతున్నాయి. భారీ వర్షాలతో నల్లగొండ జిల్లా వేములపల్లి మండల పరిధిలోని లక్ష్మీదేవి గూడెం సమీపంలో కాజ్వే మీదుగా వరద ప్రవాహం పెరగడంతో సూర్యాపేట నుంచి మిర్యాలగూడకు బస్సుల రాకపోకలు నిలిచిపోయాయి.

సాధారణ స్థాయిలోనే మున్నేరు
ఖమ్మం జిల్లాలోని ప్రభుత్వ, ప్రయివేటు విద్యాసంస్థలకు గురువారం సెలవు ప్రకటించారు. పలుచోట్ల వాగులు వంకలు ఉప్పొంగి రహదారులపై రాకపోకలు నిలిచిపోయాయి. పాలేరు రిజర్వాయర్‌లోకి గరిష్ట నీటిమట్టానికి మించి నీరు చేరుతోంది. రిజర్వాయర్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 23 అడుగులు కాగా, ప్రస్తుతం 23.45 అడుగుల నీరు ఉంది. 9990 క్యూసెక్కుల వరద నీరు వస్తుండగా అంతే మొత్తం బయటకు వదులుతున్నారు. వైరా రిజర్వాయర్‌ నీటిమట్టం 18.3 అడుగులకుగాను 18.9 అడుగుల వరకు నిల్వ ఉంది. 1840 క్యూసెక్కుల నీరు నిలకడగా వచ్చి చేరుతుండగా ఆ నీటినంతా విడుదల చేస్తున్నారు. చెరువులు అలుగుబారుతున్నాయి. ఆకేరు, మున్నేరు పరివాహక ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిసినా మున్నేరులో ప్రవాహ ఉధృతి తక్కువగానే ఉండటంతో ముంపు ప్రాంతం ఊరట చెందింది. మున్నేరులో 16 అడుగులకు నీరు చేరితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు.

అమర్‌ రాజా కంపెనీ బస్సుకు త్రుటిలో తప్పిన ప్రమాదం
మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రానికి సమీపంలోని దగ్గర గల ఐటీ పార్క్‌కు ఆనుకొని ఉన్న జాతీయ రహదారి44 మీదుగా భారీగా వరద నీరు పారడంతో గురువారం ఉదయం అకస్మాత్తుగా తెగిపోయింది. అమర రాజా కంపెనీ బస్సు ఉద్యోగులను తీసుకొని వెళ్తుండగా రోడ్డు తెగిపోవడంతో ముందుభాగం వరదలోకి దిగింది. డ్రైవర్‌ అప్రమత్తతతో ఎవరికీ ఎలాంటి ఇబ్బందీ కలగలేదు. ఉద్యోగుల అత్యవసర డోర్‌ వెంట బయటకు వచ్చారు. క్రేన్‌ సహాయంతో బస్సును తీశారు. నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఉమామహేశ్వరం కొండపై నుంచి ఉధృతంగా నీరు కిందికి పారుతోంది. బండ రాళ్లు రోడ్డుపై పడుతున్నాయి. దీంతో మూడ్రోజులపాటు ఉమామహేశ్వరం దర్శనం బంద్‌ చేసినట్టు డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad