Saturday, August 30, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంఅసెంబ్లీ సమావేశాలకు భారీ బందోబస్తు

అసెంబ్లీ సమావేశాలకు భారీ బందోబస్తు

- Advertisement -

– సెక్యూరిటీ ఏర్పాట్లను పర్యవేక్షించిన అదనపు సీపీ

నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు శనివారం నుంచి ప్రారంభమవుతుండటంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను పోలీసు అధికారులు చేశారు. అసెంబ్లీ ప్రధాన గేట్ల వద్ద సాయుధ చెక్‌పోస్ట్‌లను ఏర్పాటు చేయటంతో పాటు అసెంబ్లీ ప్రధాన గేట్లు, లాబీ వద్ద మెటల్‌ డిటెక్టర్లను ఏర్పాటు చేశారు. అసెంబ్లీలోకి ప్రవేశించే మార్గంలో ప్రతి ఒక్కరినీ క్షుణ్ణంగా సోదా చేసి లోనికి వదిలేలా భద్రతా అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. మరోవైపు ప్రధాన కూడళ్లు మొదలుకొని అసెంబ్లీ లాబీ లోపల కూడా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. దాదాపు రెండు వేల మంది పోలీసులతో అసెంబ్లీ వద్ద సెక్యూరిటీ ఏర్పాట్లను చేశారు. అలాగే అసెంబ్లీ నుంచి కిలోమీటరు దూరం వరకు నిషేదాజ్ఞలను విధిస్తూ నగర పోలీసు కమిషనర్‌ సి.వి ఆనంద్‌ ఆదేశాలు జారీ చేశారు. అలాగే అసెంబ్లీ వైపునకు వచ్చే అన్ని చౌరస్తాలలో సాయుధ పోలీసు పికెట్లను ఏర్పాటు చేశారు. ప్రతిపక్షాలు, యువజన సంఘాలు, ఇతర సంఘాలు తమ డిమాండ్ల సాధన కోసం ఛలో అసెంబ్లీకి కార్యక్రమాలను చేపట్టే అవకాశమున్నందున పలు ముందు జాగ్రత్త చర్యలను తీసుకున్నారు. కాగా అసెంబ్లీ వద్ద సెక్యూరిటీ ఏర్పాట్లను నగర అదనపు పోలీసు కమిషనర్‌ విక్రమ్‌సింగ్‌ మాన్‌, నగర ట్రాఫిక్‌ అదనపు కమిషనర్‌ జోయెల్‌ డేవిస్‌లు స్వయంగా శుక్రవారం పర్యవేక్షించారు. అసెంబ్లీ వద్ద ఏర్పాటు చేయాల్సిన సెక్యూరిటీకి సంబంధించి స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌, శాసన మండలి చైర్మెన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డిలు పోలీసు ఉన్నతాధికారులతో సమావేశమై తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ముఖ్యంగా గణేశ్‌ ఉత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో సభ్యులు సభలోకి రావటానికి ఎలాంటి ట్రాఫిక్‌ సమస్యలు ఎదురుకాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను కోరారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad