ఆదివారం మధ్యాహ్నం నుంచి మ్యాచ్ ప్రారంభం
3గంటల ముందు నుంచే అనుమతి
2000మందితో భద్రత కట్టుదిట్టం
పోకిరీల ఆగడాలను అరికట్టేందుకు షీ టీమ్స్
ప్రజా రవాణాను ఉపయోగించుకోవాలి : ఉప్పల్ డీసీపీ సురేష్
నవతెలంగాణ-సిటీబ్యూరో
హైదరాబాద్ ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగే టాటా ఐపీఎల్ -2026 మ్యాచ్‌లో భాగంగా (ఈ నెల 5న రాత్రి జరిగే 19ఎడిషన్ మ్యాచ్‌లకు) పటిష్ట భద్రత ఏర్పాటు చేశామని ఉప్పల్ డీసీపీ సురేష్ తెలిపారు. ఉప్పల్ స్టేడియంలో గురువారం విలేకరుల సమావేశంలో డీసీపీ శ్రీనివాసులు, నర్సింహారెడ్డితోపాటు అదనపు డీసీపీ వెంకట్‌రమణ, ఏసీపీలతో కలిసి మాట్లాడారు. 2000 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. 430 సీసీ కెమెరాల నిఘా మధ్య టాటా ఐపీఎల్ మ్యాచ్‌లు నిర్వహణ కొనసాగుతుందని తెలిపారు. ఈ నెల 5 నుంచి 22 వరకు డే అండ్ నైట్ మ్యాచ్‌లు జరగనున్నాయన్నారు.
మెడికల్ టీమ్స్‌తోపాటు అంబులెన్స్, అగ్నిమాపక సిబ్బందిని సైతం అందుబాటులో ఉంచామన్నారు. 5న రాత్రి సన్ రైజర్స్ – లక్నో సూపర్‌జైయింట్స్ మధ్య మ్యాచ్ జరుగుతుందని, ఈసారి దాదాపు ఏడు మ్యాచ్‌లు జరగనున్నాయని వివరించారు. అక్టోపస్, ఆర్మ్‌డ్ రిజర్వుడ్, ట్రాఫిక్, సీసీఎస్, ఇంటెలిజెన్స్, ఎస్‌వోటీ, లా అండ్ ఆర్డ్‌తోపాటు ఇతర సెక్యురిటీ వింగ్‌లను రంగంలోకి దించామన్నారు. అదనంగా బాంబ్, డాగ్ స్వ్కాడ్స్‌లను ఉపయోగిస్తున్నామని తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం 3:30గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుందని, మ్యాచ్‌లకు 3గంటల ముందు రావాలని కోరారు. ప్రత్యేకంగా స్టేడియంలో జాయింట్ కమాండ్ కంట్రోల్ రూంను ఏర్పాటు చేశామన్నారు. ప్రతి ఒక్కరిపైనా నిఘా ఉంటుందన్నారు.
పోకిరీల ఆగడాలను అరికట్టేందుకు షీ టీమ్స్‌ను రంగంలోకి దించుతున్నామన్నారు. వివిధ ప్రాంతాల్లో ఫ్రీ పార్కింగ్ ఏర్పాటు చేశామన్నారు. ఆటగాళ్లకు, వీవీఐపీలతోపాటు ప్రేక్షకులకు వేర్వేరుగా ప్రవేశ ద్వారాలు ఏర్పాటు చేశామని తెలిపారు. పాసులు కలిగిన వారు పోలీసుల సూచనల మేరకు పార్కింగ్ ప్రాంతాల్లో వాహనాలను పార్క్ చేయాలన్నారు. పార్కింగ్ రుసుం వసూళ్లు చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఐపీఎల్ మ్యాచ్‌లో బ్లాక్ టికెట్ విక్రయించే వారిపై ప్రత్యేక నిఘా పెట్టామన్నారు. టికెట్లు కలర్ జిరాక్స్ తీసుకొస్తే చర్యల తప్పవన్నారు. వాహనాలపై వచ్చే వారికి ఫ్రీ పార్కింగ్ అందుబాటులో ఉంటుందన్నారు. ఎవరైనా బ్లాక్‌లో టికెట్లు, పార్కింగ్ ఫీజ్ వసూలు చేసినట్టు తెలిస్తే వెంటనే డయల్ 100 లేదా రాచకొండ వాట్సప్‌లో సమాచారం ఇవ్వాలని డీసీపీ సూచించారు.
ల్యాప్‌టాప్‌లు, కెమెరాలు, అగ్గిపెట్టెలకు అనుమతి లేదు
మొబైల్ ఫోన్లు, బ్లూటూత్స్‌లకు మినహా ఎలక్ట్రానిక్ వస్తువులను స్టేడియం లోపలకు అనుమతించబోమని డీసీపీ తెలిపారు. ఇయర్ ఫోన్లను అనుమతిస్తామన్నారు. మహిళలు పెద్ద సైజు పర్సులకు అనుమతి లేదన్నారు. ల్యాప్‌టాప్‌లు, కెమెరాలు, అగ్గిపెట్టెలు, బ్యాగ్‌లు, పెన్నులు, సెంట్ బాటిళ్లు, శిరస్త్రానాలు, మంచినీళ్ల సీసాలు స్టేడియం లోపలకు అనుమతించేదిలేదని తెలిపారు. ఐపీఎల్ మ్యాచ్‌ల కు వచ్చే ప్రేక్షకులు, అభిమానులు సొంత వాహనాల్లో కాకుండా మెట్రో, బస్సులను (ప్రజారవాణాను) ఉపయోగించాలన్నారు.



