రసవత్తరంగా పంచాయతీ పోరు
పార్టీలకు అతీతమైనా…వారిదే హవా
వేలంపాటల ద్వారా ఏకగ్రీవాలు
బీసీల చుట్టూ రాజకీయపార్టీలు
జనరల్ స్థానాల్లోనూ వారికే ప్రాధాన్యత
నామినేషన్లకు నేడే ఆఖరు
అభ్యర్థుల ఖర్చుపై ఎస్‌ఈసీ నజర్
గ్రామీణంలో సరికొత్త రాజకీయం
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
గ్రామీణంలో పంచాయతీపోరు రసవత్తరంగా సాగుతోంది. పార్టీలకు అతీతంగా జరగాల్సిన ఈ ఎన్నికలను రాజకీయపార్టీలు పరోక్ష మద్దతుతో నడిపిస్తున్నాయి. స్థానికంగా ఎక్కడికక్కడ తమ బలాబలాల్ని రుజువుచేసుకొనేందుకు ప్రధాన రాజకీయపార్టీలన్నీ చివరి వరకు వ్యూహరచన చేస్తూనే ఉన్నాయి. సహజంగా పంచాయతీ ఎన్నికల్లో అధికారపార్టీ మద్దతు ఉన్న అభ్యర్థులే ఎక్కువగా విజయం సాధిస్తూ ఉంటారు. గడచిన పదేండ్లలో ఇదే జరిగింది. కానీ రాష్ట్రంలో మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో అన్ని పార్టీలు క్షేత్రస్థాయిలో తమ పట్టును నిలుపుకొనేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నాయి.
నిన్న మొన్నటి వరకు అసెంబ్లీ, ఎంపీ, ఎమ్మెల్సీ, ఉప ఎన్నికల్లో బీఆర్‌ఎస్. బీజేపీ పరస్పరం సహకరించుకున్నాయని అధికార కాంగ్రెస్‌పార్టీ ఆరోపణలు చేస్తూ వచ్చింది. కానీ ప్రస్తుత పంచాయతీ ఎన్నికల్లో క్షేత్రస్థాయిలో బీఆర్‌ఎస్, బీజేపీలు వేర్వేరుగానే పోటీపడుతున్నాయి. తమ బలాబలాల్ని పెంచుకొనేందుకు తీవ్ర ప్రయత్నాలే చేస్తున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి ఇప్పుడు గ్రామస్థాయిలో ఎన్నికయ్యే సర్పంచ్‌లే ప్రధాన పాత్ర పోషించాల్సి ఉంటుంది. అధికార కాంగ్రెస్‌పార్టీ మద్దతు కోసం క్షేత్రస్థాయిలో అభ్యర్థులు తమ స్థాయిల్లో అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకొనేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. కొత్తగా డీసీసీలుగా ఎన్నికైన నాయకులకు ఈ పంచాయితీ ఎన్నికలు సవాలుగా నిలుస్తున్నాయి. వారితో పాటు స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు సహా అందరూ తమకు అనుకూలురైన అభ్యర్థులకు మద్దతు ఇచ్చి గెలిపించుకోవాలని తాపత్రయపడుతున్నారు. సీపీఐ(ఎం) బలపరిచే అభ్యర్థులు ఒంటరిగా పోటీచేసి, సత్తా చాటేందుకు ఉత్సాహంగా ఉన్నారు. సీపీఐ బలపరిచే అభ్యుర్థులు కూడా ఒంటరిగానే పోటీ చేస్తున్నారు.
అయితే ఈ రెండుపార్టీలు బలపరిచే అభ్యర్థులు ఒకే గ్రామంలో పోటీచేయరాదని రాజకీయ నిర్ణయం తీసుకున్నారు. దీనితో వామపక్షపార్టీలు బలపరిచే అభ్యర్థుల విజయావకాశాలు మెరుగుపడుతున్నాయి. పంచాయతీ ఎన్నికల్లో అన్ని ప్రధాన పార్టీలు బీసీలకే తొలి ప్రాధాన్యత ఇస్తున్నాయి. జనరల్ స్థానాల్లోనూ బీసీలను పెద్దసంఖ్యలో నిలపాలని భావిస్తున్నాయి. పార్టీలతో సంబంధం లేకున్నా, రాజకీయ పార్టీలే దగ్గరుండి ఈ ఎన్నికలను శాసిస్తుండటం గమనార్హం. అలాగే సాధ్యమైనన్ని గ్రామాలను ఏకగ్రీవాలు చేసేందుకు పార్టీలు శాయశక్తులా కృషి చేస్తున్నాయి. కొన్ని చోట్ల సర్పంచ్ పదవుల ఏకగ్రీవానికి వేలంపాటలు కూడా నిర్వహిస్తుస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.
బీఆర్‌ఎస్ హయాంలోనూ పంచాయతీల ఏకగ్రీవాలకు తొలి ప్రాధాన్యత ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా అదే తరహాలో ఎత్తుగడలు వేస్తోంది. మరోవైపు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) గ్రామీణంలో పోటీని ప్రశాంతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. నామినేషన్ల దాఖలుకు శనివారం ఆఖరు రోజు. ఈ నేపథ్యంలో నామినేషన్లు పెద్దసంఖ్యలో దాఖలవుతాయని ఎస్‌ఈసీ భావిస్తున్నది. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులకు ఇచ్చే ఫ్రీ సింబల్స్‌ను శుక్రవారం ఎస్‌ఈసీ విడుదల చేసింది. పోటీలో ఉండే అభ్యర్థుల ఎన్నికల వ్యయాన్ని కూడా ఖరారు చేసింది. ఈ ఎన్నికల్లో ‘నోటా’ కూడా ఉంటుందని ఎస్‌ఈసీ తెలిపింది. సర్పంచ్‌లు, వార్డు సభ్యుల ఎన్నికల కోలాహలంతో గ్రామీణంలో సరికొత్త రాజకీయ ఉత్సాహం కనిపిస్తోంది.



