Monday, October 20, 2025
E-PAPER
Homeజాతీయంబీహార్‌ పాలిటిక్స్‌లో వారసులు

బీహార్‌ పాలిటిక్స్‌లో వారసులు

- Advertisement -

అన్ని పార్టీలది అదే పంథా
పాట్నా : ఏ రాష్ట్రం చూసినా ఏమున్నది గర్వ కారణమన్నట్టుగా ఎన్నికలు మారాయి. ఏ ఎన్నిక వచ్చినా చాలు రాజకీయ నాయకులు వారసత్వ రాజకీయాలకు తెరలేపుతూ తమ వారసులు లేదా కుటుంబ సభ్యులను పోటీలో నిలుపుతున్నారు. త్వరలో అసెంబ్లీ పోల్స్‌ జరగనున్న బీహార్‌లో ఈ ప్రభావం కాస్త ఎక్కువే. అందుకు ఏ రాజకీయ పార్టీ అతీతం కాదనే చెప్పాలి. కండబలం, ధనబలం కలిగిన నేతల వారసులకు అసెంబ్లీ టికెట్లను అన్నీ పార్టీలు ఇచ్చాయి. బీహార్‌లోని ప్రధాన పార్టీలకు కుటుంబ రాజకీయాలే ముఖ్య ఆధారంగా నిలుస్తున్నాయి. ప్రముఖ రాజకీయ కుటుంబాల వారసులు ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఆ క్రమంలో బీహార్‌ ఎన్నికల బరిలోకి దిగుతున్న రాజకీయ వారసులు ఎవరు? ఈ విషయం గురించి ప్రధాన రాజకీయ పార్టీలు ఏం అంటున్నాయి? తదితర విషయాలు తెలుసుకుందాం.

రాఘోపుర్‌ నుంచి తేజస్వీ, తారాపుర్‌ నుంచి సామ్రాట్‌ చౌదరి
రాఘోపుర్‌ నుంచి ఆర్జేడీ తరఫున తేజస్వి యాదవ్‌ (రాష్ట్రీయ జనతాదళ్‌ చీఫ్‌ లాలూ ప్రసాద్‌ చిన్న కుమారుడు, రాజకీయ వారసుడు), తారాపుర్‌ నుంచి బీజేపీకి చెందిన సామ్రాట్‌ చౌదరి (మాజీ మంత్రి శకుని చౌదరి కుమారుడు), రఘునాథ్‌ పుర్‌ నుంచి ఆర్‌జేడీకి చెందిన ఒసామా షాహాబ్‌ (గ్యాంగ్‌స్టర్‌ నుంచి రాజకీయ నాయకుడిగా మారిన మహ్మద్‌ షాబుద్దీన్‌ కుమారుడు) బరిలోకి దిగారు. ససారం నుంచి రాష్ట్రీయ లోక్‌ మోర్చాకు చెందిన స్నేహలత (ఆర్‌ఎల్‌ఎం అధినేత ఉపేంద్ర కుష్వాహా భార్య), ఝంఝార్‌ పుర్‌ నుంచి బీజేపీ తరఫున నీతీశ్‌ మిశ్రా (మాజీ సీఎం జగన్నాథ్‌ మిశ్రా కుమారుడు), ఇమామ్‌ గంజ్‌ నుంచి హెచ్‌ఏఎం తరఫున దీపా మాంఝీ (కేంద్రమంత్రి జితన్‌ రామ మాంఘీ కోడలు) పోటీలో ఉన్నారు.

జన్‌ సురాజ్‌ పార్టీ తరఫున మోర్వా నుంచి జాగృతి ఠాకూర్‌ (లెజెండరీ సోషలిస్ట్‌ నాయకుడు కర్పూరి ఠాకూర్‌ మనవరాలు) పోటీలో ఉన్నారు. జేడీయూ తరఫున గైఘాట్‌ నుంచి కోమల్‌ సింగ్‌ (ఎల్‌జేపీ ఎంపీ వీణాదేవి కుమార్తె) ఎన్నికల బరిలోకి దిగారు. నబీనగర్‌ నుంచి చేతన్‌ ఆనంద్‌ (ఎంపీ లవ్లీ ఆనంద్‌ కుమారుడు) తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. బీజేపీ తరఫున బంకిపుర్‌ నుంచి నితిన్‌ నబిన్‌ (దివంగత నేత నబిన్‌ కిషోర్‌ సిన్హా కుమారుడు) బరిలో దిగారు. దిఘా నుంచి సంజీవ్‌ చౌరాసియా (బీజేపీ సీనియర్‌ నేత గంగా ప్రసాద్‌ చౌరాసియా కుమారుడు) పోటీలో ఉన్నారు. ఆర్‌జేడీ తరఫున షాపుర్‌ నుంచి రాహుల్‌ తివారీ (సీనియర్‌ నాయకుడు శివానంద్‌ తివారీ కుమారుడు) తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఈ స్థానం నుంచి బీజేపీ తరఫున రాకేశ్‌ ఓజా (సీనియర్‌ నేత విశేశ్వర్‌ ఓజా కుమారుడు), మొకామా నుంచి వీణా దేవి (ఆర్‌జేడీ నేత సూరజ్‌ భాన్‌ సింగ్‌ భార్య), లాల్‌ గంజ్‌ నుంచి శివాని శుక్లా (ఆర్‌జేడీ నేత మున్నా శుక్లా కుమార్తె) పోటీ చేస్తున్నారు.

సైద్ధాంతిక, రాజ్యాంగ విలువలను పట్టించుకోని పార్టీలు
రాజకీయ నేతల వారసులు, కుటుంబ సభ్యులు పాలిటిక్స్‌లోని ప్రవేశించే విధానాన్ని చూస్తే, ఇప్పుడు అన్ని పార్టీలు సైద్ధాంతిక నిబద్ధతలు, రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్య సూత్రాల గురించి పెద్దగా పట్టించుకోవడంలేదని తెలుస్తోందని పాట్నాలోని ఏఎన్‌ సిన్హా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ స్టడీస్‌కు చెందిన అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ వికాశ్‌ అభిప్రాయపడ్డారు. ‘తమవారు రాజకీయాల్లో స్థిరపడి ఉంటారు కాబట్టి వారసులు ఈజీగా పాలిటిక్స్‌లోకి వచ్చేస్తున్నారు. వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా ప్రజలు తమ గొంతుకను వినిపించాలి. 77 ఏండ్లుగా బీహార్‌లో విద్యకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం వల్ల కూడా ఇది జరుగుతోంది’ అని ఆయన పేర్కొన్నారు.

‘రాజకీయ నేతల వారసులు రాజకీయాల్లోకి ప్రవేశించే విషయంలో బీహార్‌లోని ఏ పార్టీ కూడా నైతిక ఆధిపత్యాన్ని ప్రకటించలేదు. బీహార్‌లో గ్రామీణ జనాభా విద్యాస్థాయి చాలా తక్కువగా ఉంది. తాజా కుల సర్వే ప్రకారం, బీహార్‌ జనాభాలో 14.71 శాతం మంది మాత్రమే పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యారు. వారికి రాజకీయంగా అవగాహన లేదు. అందుకే రాజకీయ పార్టీలు తక్కువ విద్యావంతులైన ఓటర్లను సద్వినియోగం చేసుకుని వారసత్వ రాజకీయాలను ప్రోత్సహిస్తున్నాయి’ అని వికాస్‌ అభిప్రాయపడ్డారు.

ఆర్‌జేడీ ఏమందంటే?
ప్రస్తుత కాలంలో ఏదైనా రాజకీయ పార్టీకి చెందిన సాధారణ కార్యకర్త ఎన్నికల్లో పోటీ చేయడం గురించి ఆలోచించలేడనేది వాస్తవమని ఆర్‌జేడీ అధికార ప్రతినిధి మత్యుంజరు తివారీ తెలిపారు. అదే సమయంలో, ఎన్నికల్లో గ్లామర్‌ అంతర్భాగంగా మారడంతో సాధారణ కార్యకర్తలకు పార్టీలు ప్రాధాన్యత ఇవ్వడం లేదన్నారు. ఎన్నికల ఖర్చు పెరిగిపోవడంతో సాధారణ కార్యకర్తకు పోటీ అనేది అసమానంగా మారిపోయిందన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -