నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రెండు దశాబ్దాల క్రితం తప్పిపోయిన ఉద్యోగి కుటుంబానికి సదరు ఉద్యోగి పదవీ విరమణ బెనిఫిట్స్ అమలు చేయాలనీ, అతని కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం కల్పించాలని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నగేశ్ భీమపాక ఇండియన్ బ్యాంక్ అధికారులను ఆదేశించారు. 1991లో బ్యాంకులో చేరి 2004లో అసిస్టెంట్ మేనేజర్‌గా పదోన్నతి పొందిన వి.ఫ్రాన్సిస్ ఢిల్లీకి బదిలీపై వెళ్లారు. ఏడు నెలల తర్వాత అతను కనిపించలేదు. పోలీసులు దర్యాప్తు చేసి కనబడలేదని రిపోర్టు ఇచ్చారు. దీనిపై అతని భార్య దాఖలు చేసిన రిట్ పిటిషన్‌కు హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఢిల్లీకి బదిలీ తర్వాత కేవలం ఏడు నెలలు పని చేసిన తర్వాత ఆయన కనిపించకుండా పోయారు. 2008లో తప్పి పోయినట్టు ఫిర్యాదు అందినప్పటికీ, 2010లో ఆయన జాడ తెలియడం లేదని పోలీసులు నిర్ధారించి నివేదిక ఇచ్చారు. దీంతో బ్యాంకు ఫ్రాన్సిస్‌కు తప్పనిసరి రిటైర్‌మెంట్ ఇచ్చినట్టుగా ప్రకటించింది. 2012లో చట్టపరమైన వారసుడు సర్టిఫికెట్ పొందిన తర్వాత, పిటిషనర్ పదవీ విరమణ ప్రయోజనాలు, కారుణ్య నియామకం కోసం దరఖాస్తు చేసుకుంటే బ్యాంకు పట్టించుకోలేదు. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్‌లోని సెక్షన్ 108 ప్రకారం, ఏడేండ్లుకుపైగా తప్పిపోయిన వ్యక్తిని చనిపోయినట్టు భావిస్తారని, కాబట్టి భార్యకు బెనిఫిట్స్ చెల్లించాలనీ, వారి పిల్లల్లో అర్హులైన ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని బ్యాంకుకు జస్టిస్ భీమపాక నగేశ్ ఆదేశిస్తూ తీర్పు చెప్పారు. భార్య క్యాన్సర్ రోగి అనీ, ఆమె పిల్లల్లో ఒకరికి కారుణ్య నియామకం చేయాలని ఆదేశించారు. పిటిషనర్ వినతిపత్రంపై అధికారులు స్పందించకపోవడంతో బ్యాంకుకు రూ.50 వేలు జరిమానా విధించారు.
కారుణ్య నియామకం చేయండి ఇండియన్ బ్యాంక్ అధికారులకు హైకోర్టు ఆదేశం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES