Tuesday, July 8, 2025
E-PAPER
Homeఎడిట్ పేజిన‌డుస్తున్న చ‌రిత్ర జులై29

న‌డుస్తున్న చ‌రిత్ర జులై29

- Advertisement -

దక్షిణాఫ్రికా బొగ్గు గనుల్లో బానిసలుగా పనిచేసేందుకు అనేకమంది భారతీయులను కార్మికులుగా తరలించింది బ్రిటిష్‌ ప్రభుత్వం ఆనాడు. అప్పటికే ఆ దేశంలో గాంధీజీ, ఆయన పోరాట పద్ధతులు ప్రాచుర్యం పొంది వున్నాయి. గాంధీజీ పిలుపుపై ఆరు వేల మంది బొగ్గు గని కార్మికులు 1913లో సమ్మె చేశారు. చార్ల్స్‌టౌన్‌ నగరానికి మహిళా కార్మికులు ప్రదర్శన తీశారు. దారిలో ఒకామె చేతిలోని చంటిబిడ్డ దుమ్మూధూళికి చనిపోతాడు. మరొక మహిళా కార్మికురాలు ఒక చిన్న కాలువ దాటుతూండగా ఆమె బిడ్డ చేతి నుండి జారి కింద ప్రవాహంలో పడి కొట్టుకుపోతాడు. అయినా ఆ తల్లులు ప్రస్థానం ఆపరు. ”పోయిన వారు ఎలానూ తిరిగిరారు. దాని గురించి ఏడుస్తూ కూచుంటే ఏం ఉపయోగం? బతికున్న వారి కోసం మన పోరు కొనసాగించాలి” అన్నారట! ఆ తల్లులది ఎంత గుండె నిబ్బరం? ఏమి ధీరత్వం? వారి త్యాగనిరతిని చూసి గాంధీజీ ఆశ్చర్యపోయారని గాంధీ జీవిత చరిత్ర రాసిన దీన్‌నాథ్‌ టెండూల్కర్‌ పేర్కొన్నారు.
ఒక సిద్ధాంతం ప్రజల్ని ఆవహిస్తే అది భౌతిక శక్తిగా మారుతుందన్న మార్క్స్‌ మాట 1913లో ఎంత నిజమో, 2025 జులైలోనూ అంతేనిజం. లేబర్‌కోడ్‌లు రద్దు కావల్సిందేనన్న మాట నేడు కార్మికుల నోళ్లల్లో తారకమంత్ర మైంది. భారతదేశ కార్మికులను అది ఆవహించింది. అందుకే వందలు, వేలల్లో కాదు, లక్షలు, కోట్లలో కార్మికులు కదులుతున్నారు. కార్మికోద్యమ ఉనికే ప్రమాదంలో పడ్డప్పుడు యావత్‌ కార్మికులకూ శిగమొచ్చి ఊగరా? పారిస్‌లోని అతి పురాతన సోర్బోని విశ్వవిద్యాలయం గోడలపై రాసున్న నినాదం. ”మాంసాహారం ఆరగించే పువ్వు ఈ సమాజం” అనే విషయం అర్థమయ్యే కొద్దీ కార్మికుల్లో కదలిక ద్విగుణీకృతమవుతోంది.


పెట్టుబడి వేట!
అడవిలో లేడిపిల్ల దానంతటదే చావలే! పులి చంపితేనే చచ్చింది. నేటి మన దేశ పెట్టుబడిదారీ విధానం 1845లో ఏంగెల్స్‌ రాసిన ప్రామాణిక గ్రంథం ”ఇంగ్లండ్‌లో కార్మికుల స్థితిగతులు”లో చెప్పినట్లే సారాంశంలో ఉండటం ఏమంత ఆశ్చర్యం కల్గించదు. అది పెట్టుబడి నైజం! పెట్టుబడి ఆకలి తీరలేదనడానికి పాశమైలారం ‘సిగాచి’ కర్మాగార ఘటనే నిదర్శనం. దానికి కారణం లేబర్‌ కోడ్‌లే. ఈ విషయం సంగారెడ్డి జిల్లానే కాదు, యావత్‌ తెలంగాణ కార్మికులు అర్థం చేసుకున్నారు.
ఆక్యుపేషనల్‌ సేఫ్టీ, హెల్త్‌ అండ్‌ వర్కింగ్‌ కండిషన్స్‌ (ఓఎస్‌హెచ్‌అండ్‌డబ్ల్యూసి) కోడ్‌లో ఐదువందల మంది కార్మికులున్న పరిశ్రమల్లోనే అంబులెన్స్‌ సౌకర్యం కల్పించాలని ఉంది. అది లేకపోవటంవల్లే సగంకాలిన తోటి కార్మికులను సిగాచి కంపెనీ డ్యూటీ బస్‌లో ఆస్పత్రులకు తరలించాల్సిన దౌర్భాగ్యం ఆ కార్మికులకు ఏర్పడింది. సమయానికి అంబులెన్స్‌లుండి, వాటిలో అవసరమైన ఎక్విప్‌మెంట్‌ ఉండి, శిక్షణ పొందిన సిబ్బంది ఉండిఉంటే ఇంకొన్ని ప్రాణాలైనా నిలిచేవేమోననిపిస్తుంది. నూటయాభైకి పైగా కెమికల్‌, ఫార్మా కంపెనీ లున్న పాశమైలారం క్లస్టర్‌లో నిర్దిష్ట సంఖ్యలో అంబులెన్స్‌లు ఉండటం అత్యవసరం అనే అంశం ఇప్పటికైనా పాలకులకు అర్థం కావాలి.


సిగాచితోపాటు ఏ కంపెనీలో ప్రమాదాలు జరిగి కార్మికులు మరణిస్తున్నా వారంతా బీహార్‌, యూపీ, ఒడిషా, బెంగాల్‌, జార్ఖండ్‌ రాష్ట్రాలకు చెందిన వారే. ఇవన్నీ బీజేపీ పాలిత, లేదా అది అధికారంలోకి రావాలనుకునే రాష్ట్రాలే. ఓఎస్‌హెచ్‌ కోడ్‌ పుణ్యాన 1979 అంత:రాష్ట్ర వలస కార్మికుల చట్టం రద్దయిపోయింది. మరి ఈ వలస కార్మికులకు దిక్కేంటి? కార్పొరేట్ల ప్రయోజనాలే బీజేపీకి ముద్దు. దాని ముందు వలస కార్మికుల జీవితాలొక లెక్కా?
పనిగంటలు పెంచడం, అధునాతన యంత్రాలతో పని తీవ్రత కలిగించడం ఈ రెండూ అదనపు విలువ గుంజడంలో కీలకమైనవి. ఇది నేడు నిరాఘాటంగా జరిగిపోతోంది. అందుకే 1845 ఏంగెల్స్‌ పుస్తకంతో పోల్చింది. దీనికితోడు వివిధ పేర్లతో పిలిచే తాత్కాలిక కార్మి కుల సంఖ్య పెరిగిపోయింది. దాంతో పీఎఫ్‌, ఇఎస్‌ఐ కంట్రిబ్యూషన్లు మిగిలిపోతున్నాయి యజమానులకు. 2014లోనే అప్రంటిస్‌ చట్టాన్ని సవరించింది బీజేపీ. ఏ సంక్షేమ చట్టాలూ వర్తించని అప్రంటీస్‌లు, ఫిక్స్‌డ్‌ టర్మ్‌ ఎంప్లా యీస్‌ నిండిపోతున్నారు అనేక పరిశ్రమల్లో. ఇంకా ఆటోమొబైల్‌ పరిశ్రమల్లో రోబోట్‌లతో పనిచేయించుకోవడం పెరిగింది.
మరో కీలక విషయమేమంటే 2020లో దేశమంతా కరోనా కల్లోలంలో ఉంటే ప్రతిపక్షాన్ని బయటికి నెట్టేసి పార్లమెంటులో లేబర్‌ కోడ్‌లు ఆమోదించుకుంది బీజేపీ. పహల్గాం దాడితో దేశం అట్టుడుకుతూంటే ఈ కోడ్‌లను నోటిఫై చేయాలని రాష్ట్రాలను ఒత్తిడి చేస్తున్నది. పైన పేర్కొన్నవన్నీ దాని ఫలితమే.


కోడ్‌ల అమలులో..
నక్క జిత్తులు అనే మాటని పాపం ఆ నక్కలు అంగీకరిస్తాయో లేదో తెలియదుగానీ అటు అందరిముందు శిరస్సువంచి నమ స్కారం చేసి ఉపసంహరించుకున్న రైతు నల్లచట్టాలను దొడ్డిదారిలో మళ్లీ తెచ్చే ప్రయత్నం చేస్తున్న మోడీ సర్కార్‌ను ‘నక్క జిత్తులు’ అనడంలో తప్పులేదనుకుంటా! లేబర్‌ కోడ్‌లను మాత్రం ‘దొడ్డిదారి’ అని అనలేం. సాఫ్‌సీదాగా రాష్ట్రాల దారిలో అమలుకు పూనుకుంది. లెఫ్ట్‌ పాలిత కేరళ ప్రభుత్వం తప్ప మిగతా అన్ని రాష్ట్రాలు అమలుకు సిద్ధమౌతున్నాయి.
ఈ విధానాన్ని దేశంలో అమల్లోకి తెచ్చిందే కాంగ్రెస్‌. కాబట్టి కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాలు సిద్ధంగానే ఉంటాయి. కర్నాటకలో ఫ్యాక్టరీల చట్టం సవరించి పని గంటలు పన్నెండుకి పెంచారు. మూడు నెలలకు ఓవర్‌టైమ్‌ చేయాల్సిన పరిమితిని 145 గంటలకు పెంచారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ‘షాప్స్‌’యాక్ట్‌ పరిధి నుండి ఐటి, ఐటి ఎనేబుల్డ్‌ సర్వీసెస్‌ ”ప్రస్తుతానికి” నాలుగేండ్లు మిన హాయిం చింది. ఇపుడు పనిగంటలే పెంచేశారు. ఇలాంటి సంస్కరణలకు ఆద్యుడిగా తనికితానే చెప్పుకునే చంద్రబాబు ఏపీలో పనిగంటలు పెంచారు. గరిష్టంగా ఐదు గంటలకు విశ్రాంతి విరామం ఉండాలన్న దాన్ని ఆరుగంటలు చేశారు. అంటే ఎంత క్లిష్టమైన పనైనా కార్మికులు ఆరుగంటలు ఏకబిగిన చేయాలన్నమాట.


31 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు మహిళల్ని రాత్రిషిఫ్టుల్లో అనుమతించాయి. త్రైమాసిక ఓవర్‌టైం సీలింగ్‌ 75 గంటల నుండి 125 గంటలకు పెంచడానికి పన్నెండు రాష్ట్రాలు ఆమోదించాయి. ఫ్యాక్టరీ చట్టాన్ని సవరించి ఫ్యాక్టరీ నిర్వచనాన్ని కరెంటుతో నడిచేవి పదిమంది నుండి ఇరవైమంది కార్మికులకు, కరెంటుతో నడవనివి ఇరవై నుండి నలభైకి పంతొమ్మిది రాష్ట్రాల్లో పెంచడానికి ఆమోదం పొందాయి. ఎంప్లాయిమెంట్‌ స్టాండింగ్‌ ఆర్డర్స్‌ చట్టాన్ని సవరించి ఫిక్స్‌డ్‌టర్మ్‌ ఎంప్లాయిమెంట్‌ను ఇరవై ఐదు రాష్ట్రాలు ఆమోదించాయి. ఐ.డి.యాక్ట్‌ని సవరించి ఫ్యాక్టరీల లేఆఫ్‌కు, మూసివేతకు, కార్మికుల తొలగింపుకు ఉండే పరిమితిని వంద నుండి 300లకు ఇరవై రాష్ట్రాలు పెంచేశాయి. ఇవన్నీ లేబర్‌ కోడ్‌ల అమలు జరగకుండానేనని మరిచి పోవద్దు. కేరళ ఎల్‌డీఎఫ్‌ ప్రభుత్వం దీనికి భిన్నంగా నిలబడింది. లేబర్‌ కోడ్‌లను ఏ రూపంలోనూ అమలు చేయనని కరాఖండిగా తేల్చిచెప్పింది.


ఓఎస్‌హెచ్‌ కోడ్‌లో యాజమా న్యాలు తేలిగ్గా తప్పించుకు పోగలిగేలా అనేక క్లాజులున్నాయి. ఐదువందల మంది కంటే తక్కువ కార్మికులున్న ఫ్యాక్టరీ, భవన నిర్మాణ పని కేంద్రాల్లో భద్రతా అధికారిని నియమించనక్కర్లేదు. 250 అంతకు తక్కువ మంది కార్మికులున్న చోట (సంక్షేమ) వెల్ఫేర్‌ ఆఫీసర్‌ని నియమించనక్కర్లేదు. అనేక యూనియన్లు కూడా పరిగణనలోకి తీసుకోని విషయం సోషల్‌ సెక్యూరిటీ కోడ్‌లోని అధికరణలు. కీలకమైంది బీడీ, ఇనుప ఖనిజం మైన్స్‌, తెలంగాణలో విస్తారంగా ఉన్న సున్నపురాయి, డోలమైట్‌ గనుల్లో సెస్‌ వసూలు చేసే అంశాన్ని ప్రభుత్వం తొలగించింది. 2017లోనే జీఎస్టీ రావడంతో భవన నిర్మాణ కార్మికుల సెస్‌ వసూళ్లు ఆగిపోయాయి. ఇప్పటిదాకా బీడీ కార్మికులకు ఇండ్లు, వారి పిల్లలకు స్కూల్‌ యూనిఫామ్స్‌ మొదలైనవి ప్రమాదంలో పడతాయి. బీడీ కార్మికులకు ఇండ్లనీ మరొకటనీ బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ వంటి పార్టీలు తామేదో చేస్తున్నామని చెప్పేది లక్షలు, కోట్లలో వసూలైన ఈ సెస్సు నుండేనని మరిచిపోవద్దు.
అన్నింటికంటే ముందే, 2019లో బీజేపీ రెండవసారి అధికారంలోకి రాగానే వేజ్‌కోడ్‌ బిల్‌పాస్‌ అయింది. దాంతో కనీస వేతనం హారతి కర్పూరంలా కరిగిపోతున్నది. ప్రతీ కోడ్‌కి కార్పొరేట్‌ ప్రయోజనం ఉన్నట్లే ఈ వేజ్‌ కోడ్‌ ప్రయోజనం కనీస వేతన లెక్కింపు విధానాన్ని విధ్వంసం చేయటం, 1957లో జరిగిన పదిహేనవ ఇండియన్‌ లేబర్‌ కాన్ఫరెన్స్‌ ఆమోదించిన డా. ఆక్ట్రాయిడ్‌ ఫార్ములా, ఆ తర్వాత 1992లో భారత అత్యున్నత న్యాయస్థానం రాప్టకాస్‌బ్రెట్‌ కేసులో ”పిల్లల చదువులు, వైద్య ఖర్చులు, పండుగలు, ఇతర ఆచార వ్యవహారాల కోసం” అదనంగా ఇరవై ఐదు శాతం కలిపి ఇవ్వాలన్న తీర్పుకు అనుగుణంగా లెక్కించే పద్ధతి వేతనాల లెక్కింపుకు ఆధారంగా ఉండింది. ఇప్పుడీ వేజ్‌ కోడ్‌లో నేషనల్‌ ఫ్లోర్‌ లెవెల్‌ మినిమమ్‌ వేజ్‌ అనేమాట వాడారు. దీనికి పునాదేమిటో తెలియదు. 2017-18లో ఇది రోజుకి రూ.176గా ఉంది. అంటే నెలకు రూ.5286 మాత్రమే. ఇంతకుపైగానే రాష్ట్రాలు కనీస వేతనాలు నిర్ణయించాలని మోడీ సర్కార్‌ రాష్ట్రాలకు చెప్పింది. తమతమ రాష్ట్రాలకు పెట్టుబడులు ఆకర్షించే పనిలో రాష్ట్రాలున్నాయి. చౌకగా కార్మికశక్తి అందుబాటులో ఉంటుందని అందరూ చెప్తున్నారు. రోజుకి రూ.177 అయినా రూ.180 అయినా కేంద్రం నిర్ణయించిన రూ.176 కంటే ఎక్కువేకదా! ఇప్పటికే ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం వేజ్‌ కోడ్‌కు తయారు చేసిన రూల్స్‌ ప్రకారం కనీస వేతనం నిర్ణయించే ప్రమాణమే పోయింది.


వెరసి, కనీస వేతన నిర్ణయ పద్ధతి, సంఘం పెట్టుకునే హక్కు, సమిష్టి బేరసారాలాడే హక్కు, సమ్మె చేసే హక్కు ప్రమాదంలో పడ్డాయి. పీఎఫ్‌, ఇఎస్‌ఐ వంటి సంక్షేమ చట్టాలన్నింటికీ ఎసరొచ్చింది. దశాబ్దాల కార్మికోద్యమ ఫలితాలు కరిమింగిన వెలగ పండులా మిగలాల్సిందేనా? దాన్ని కార్మికోద్యమం అంగీకరించదనే విషయం మొన్న చెన్నైలో శామ్‌సంగ్‌ కార్మికులు నిరూపించారు. ఆ కార్మికుల ఐక్యత బహుళజాతి గుత్త సంస్థను మోకాళ్లపై కూచోపెట్టింది. యూనియన్‌ రిజిస్ట్రేషన్‌ సాధించింది. చర్చలు చేసింది. యాజమాన్యంతో ఒప్పందంపై సంతకాలు చేసింది. ఈ కోవలోకి చెందిందే గుజరాత్‌లోని జేకే పేపర్స్‌ కార్మికుల 31 రోజుల సమ్మె. కొన్ని ప్రధాన డిమాండ్లు సాధించుకుని విజయవంతం అయ్యింది.
నీవెనుకున్నది పెద్దకోటగోడ.
దాని ముందున్నది అగాధం లాంటి కందకం!
దాన్లో ప్రవహించేది నరకంలోని ‘వైతరిణీ’
పారిపోయేందుకు చిన్నసందూ లేదు.
దూరేందుకు అవకాశమూ లేదు!
”రేపటికోసం నువ్వు పారిపోదల్చుకున్నా
ఫాయిదా లేదు” అంటాడు దళిత కవి పోవార్‌.
అందుకే శ్రీశ్రీ చెప్పిన ”కమ్మరి కొలిమి, కుమ్మరి చక్రం
జాలరి పగ్గం, సాలెల మగ్గం
శరీర కష్టం స్ఫురింపచేసే
గొడ్డలి, రంపం, కొడవలి, నాగలి
సహస్రవృత్తులూ కదంతొక్కాలి
”త్రాచువలెనూ, రేచులవలెనూ”
జులై 9లోకి దూకవలెను. అదే మన విధి.
పెట్టుబడిపై విరుచుకుబడటమే మన కర్తవ్యం.
ఆర్‌ సుధాభాస్కర్‌

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -