నవతెలంగాణ-హైదరాబాద్: పార్లమెంటు ఉభయ సభల్లో పెహల్గామ్ దాడి, ఆపరేషన్ సింధూర్‌పై చర్చ జరగాలని ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి. ఈ నేపథ్యంలో పెహల్గామ్ దాడికి పాల్పడిన ఉగ్రవాదులు అసలు పాకిస్తాన్ నుంచే వచ్చారని మీరెందుకు అనుకుంటున్నారు? స్వదేశీ ఉగ్రవాదులే ఈ దాడికి పాల్పడి ఉండొచ్చు కదా అని బీజేపీ నేతలనుద్దేశించి కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ కేంద్ర ఆర్థికమంత్రి పి. చిదంబరం చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి.
జూలై 27 ఆదివారం క్వింట్ వార్తా సంస్థతో జరిగిన ఇంటర్వ్యూలో చిదంబరం మాట్లాడుతూ.. ‘పెహల్గామ్ ఉగ్రదాడికి పాల్పడినవారు ఎక్కడ ఉన్నారు? మీరెందుకు వారిని పట్టుకోలేదు? వీరు వారిని ఇప్పటివరకు ఎందుకు గుర్తించలేదు? దాడి జరిగిన తర్వాత ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చిన వారిని అరెస్టు చేసినట్లు ఓ వార్త వెలువడింది. ఆ తర్వాత ఏమైందనేది తెలియదు అని చిదంబరం ప్రశ్నించారు.
ఆపరేషన్ సింధూర్ ప్రధాని ప్రకటన చేయకపోవడంపై చిదంబరం విమర్శించారు. ‘ఇది నిఘా వైఫల్యం. 2008లో ముంబైలో ఉగ్రదాడి కూడా నిఘా వైఫ్యలమే. ఆ సమయంలో నేను హోం మంత్రిగా ఉన్నాను. ఈ దాడికి నిఘా వైఫల్యం కారణమని నేను క్షమాపణలు కోరాను.
పెహల్గామ్ దాడికి సంబంధించి ఇన్నివారాలుగా ఎన్‌ఐఎ ఏం చేసిందో వెల్లడించడానికి కేంద్ర ప్రబుత్వం ఇష్టపడలేదు. వారు ఉగ్రవాదులను గుర్తించారా? వారు ఎక్కడి నుంచి వచ్చారో? తెలియదు. నా ఉద్దేశం వారు స్వదేశీ ఉగ్రవాదులు కావొచ్చు. వాళ్లు పాకిస్తాన్ నుంచి వచ్చారనే ఎందుకు అనుకోవాలి? దానికి ఎలాంటి ఆధారాలు లేవు. కేంద్ర ప్రభుత్వం జరిగిన నష్టాలను కూడా దాచిపెడుతోంది అని చిదంబరం విమర్శించారు.
చిదంబరం వ్యాఖ్యలపై బిజెపి నేతలు తిప్పికొట్టారు. బిజెపి అధికార ప్రతినిధి అమిత్ మాలవీయా శత్రువును (పాకిస్తాన్)ను కాపాడడటానికే కాంగ్రెస్ ముందుంటుంది అని ఆయన అన్నారు.
కాంగ్రెస్ ఎంపి ఇమ్రాన్ మసూద్ చిదంబరం వ్యాఖ్యలను సమర్థించారు. పాకిస్తాన్ ఉగ్రవాదులే ఈ దాడి చేస్తే మన సరిహద్దు ప్రాంత భద్రత ప్రశ్నార్థకంగా ఉందా? సరిహద్దులు భద్రంగా లేవా? నిజంగా వారు సరిహద్దులు దాటివస్తే.. సెక్యూరిటీ ఏం చేస్తోంది? వారు ఎక్కడి నుండి వచ్చారు? ఎలా వెళ్లారు? అనే విషయాన్ని తెలుసుకునే హక్కు దేశ ప్రజలకుంది అని ఆయన అన్నారు.