దీపావళి కార్బైడ్ గన్‌తో 14మంది చిన్నారులకు అంధత్వం
మరో 122 మందికి తీవ్రమైన నేత్ర సమస్యలు
భోపాల్ : మధ్యప్రదేశ్‌లో దీపావళి కార్బైడ్ గన్ వినియోగించిన చిన్నారులు అంధత్వానికి గురయ్యారు. బాణసంచా వ్యాపారులు అందుబాట్లోకి తీసుకొచ్చిన ఈ గన్ వినియోగించిన 14 మందికంటిచూపు కోల్పోయారు. వందల మంది ఆసుపత్రి పాలయ్యారు. వారిలో 122 మంది పిల్లలు తీవ్రమైన కంటి గాయాలతో చేరారని సంబంధిత ఆసుపత్రుల వైద్యులు తెలిపారు. బాధితులు, సంబంధిత వర్గాలు తెలిపిన సమాచారం ప్రకారం… ‘దేశీ ఫైర్ క్రాకర్ గన్’ పేరుతో కార్బైడ్ గన్‌ను తయారు చేసి, దీపావళి సందర్భంగా విక్రయించారు. రూ.150 నుండి రూ.200 ధరతో వీటి అమ్మకాలు సాగాయి. రీల్స్ చేసి, విస్తృతంగా ప్రచారం చేశారు. టిన్ పైపులు, గన్‌పౌడర్, కాల్షియం కార్బైడ్, అగ్గిపుల్లల మందుతో వీటిని తయారు చేశారు.
వీటి విక్రయాలు విదిష, భోపాల్, ఇండోర్, జబల్‌పూర్ తదితర ప్రాంతాల్లో ఎక్కువగా జరిగాయి. వీటిని వినియోగించిన వెంటనే చిన్నారుల చేతుల్లోనే బాంబుల మాదిరిగా పేలాయి. దీంతో, వారి ముఖం, కళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషయం వెలుగులోకి రావడంతో వీటి విక్రయాలపై నిషేధం విధిస్తున్నట్లు ఈ నెల 18న ప్రభుత్వం ప్రకటించి, చేతులు దులుపుకుంది. యథేచ్ఛగా వీటిని విక్రయిస్తున్నా అధికార యంత్రాంగం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఈ గన్స్ వినియోగంతో విదిష జిల్లా ఎక్కువగా ప్రభావితమైంది. మూడు రోజుల్లోనే భోపాల్, ఇండోర్, జబల్‌పూర్, గ్వాలియర్ ఆస్పత్రుల్లో కంటి వార్డులు చిన్నారులతో నిండిపోయాయి. భోపాల్‌లోని హమీడియా ఆస్పత్రిలోనే 72 గంటల్లో 26మంది పిల్లలు చేరారు.
శాశ్వత అంధత్వానికి గురయ్యే ప్రమాదం : సీఎంహెచ్‌ఓ
ఇది సాధారణ బొమ్మ తుపాకీ కాదని, ఇంప్రూవైజ్డ్ పేలుడు పదార్థమని హమీడియా ఆస్పత్రి సీఎంహెచ్‌ఓ డాక్టర్ మనీష్ శర్మ తెలిపారు. ఈ పరికరం కండ్లకు తీవ్రంగా హాని కలిగిస్తుందని, పేలుడు కారణంగా వెలువడే లోహపు శకలాలు రెటీనాకు ప్రమాదమని హెచ్చరించారు. ఇవి శాశ్వత అంధత్వానికి దారితీయవచ్చని అన్నారు. కొంతమంది ఐసియులో చికిత్స పొందుతున్నారని, చాలామందికి కంటిచూపు వచ్చే అవకాశం చాలా తక్కువని అన్నారు. వీటిని వినియోగించకుండా చూడాలని తల్లిదండ్రులను కోరారు. ఈ గన్‌లను అక్రమంగా విక్రయించిన ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు విదిష ఇన్‌స్పెక్టర్ తెలిపారు.
మధ్యప్రదేశ్‌లో ఘోరం
- Advertisement -
- Advertisement -



