Friday, January 9, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుబాగున్నారా అమ్మా..!

బాగున్నారా అమ్మా..!

- Advertisement -

మంత్రులు సీతక్క, కొండా సురేఖకు కేసీఆర్‌ ఆత్మీయ స్వాగతం
ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో ఆయనకు మేడారం జాతర ఆహ్వానపత్రిక అందజేత…అమ్మవారి పట్టువస్త్రాలు కూడా..


నవతెలంగాణ-మర్కుక్‌
దేశంలోనే ప్రఖ్యాతిగాంచిన మేడారం జాతరను ఈ ఏడాది కూడా అంగరంగా వైభవంగా నిర్వహిస్తున్నామని, ఈ జాతరకు విచ్చేయాలని మాజీ సీఎం కేసీఆర్‌కు మంత్రులు సీతక్క, కొండా సురేఖ గురువారం జాతర ఆహ్వాన పత్రికను అందజేశారు. సిద్దిపేట జిల్లా మర్కుక్‌ మండలం ఎర్రవల్లిలోని కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌లో ఆయన్ను వారు మర్యాదపూర్వకంగా కలిశారు. దాంతో పాటు ప్రసాదాలు, అమ్మవార్ల పట్టు వస్త్రాలను అందజేశారు. ఈ సందర్భంగా తన ఇంటికి వచ్చిన మహిళా మంత్రులను కేసీఆర్‌ ఆత్మీయంగా పలకరించారు. సంప్రదాయబద్ధంగా వారికి చీరలు పెట్టి సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. ఎలాంటి రాజకీయాలకు ఆస్కారం లేకుండా జరిగే ఈ జాతరకు రావాలని కేసీఆర్‌, ఆయన సతీమణీ శోభమ్మకు ఆహ్వానపత్రాన్ని అందజేశామన్నారు.

జాతరకు విచ్చేసేందుకు వారు సానుకూలంగా స్పందించారని, ఏదో ఒక రోజు హెలికాప్టర్‌ ద్వారా రావడానికి ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. దేశ విదేశాల నుంచి సమ్మక్క-సారలమ్మ జాతరకు భక్తులు వస్తుంటారన్నారు. 1996లోనే ప్రభుత్వం మేడారం జాతరను రాష్ట్ర పండుగగా గుర్తించిందన్నారు. రెండేండ్లకొకసారి వచ్చే ఈ జాతరకు.. ఈ యేడు సీఎం రేవంత్‌రెడ్డి దాదాపు రూ.200కోట్లు వెచ్చించి శాశ్వత అభివృద్ధి పనులను చేపట్టారని తెలిపారు. కాగా మంత్రుల వెంట కాంగ్రెస్‌ సిద్దిపేట జిల్లా అధ్యక్షురాలు తూంకుంట ఆంక్షారెడ్డి, మర్కుక్‌ మండలాధ్యక్షులు తాండ కనకయ్య గౌడ్‌, దామరకుంట సర్పంచ్‌ పత్తి నర్సింలు యాదవ్‌, వరదరాజుపూర్‌ సర్పంచ్‌ మాడమైన కిష్టయ్య, కాంగ్రెస్‌ నాయకులు తదితరులున్నారు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -