నవతెలంగాణ-హైదరాబాద్: రెండేళ్లు బయట ప్రాంతాల్లో చదువుకోవడానికి వెళ్తే తప్పేంటని సీజేఐ బీఆర్ గవాయ్ ప్రశ్నిచారు. పదేళ్లు స్థానికంగా ఉండి.. రెండేళ్లు బయటికెళ్తే స్తానికత ఎలా కోల్పోతారు? అని సీజేఐ ప్రశ్నించారు. తెలంగాణ స్థానికత కోటా వ్యవహారంపై సుప్రీంకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. పదో తరగతి తర్వాత రెండేళ్లు బయట ఉంటే స్థానికత వర్తించదన్న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులపై పలువురు విద్యార్థులు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.
ఈ పిటిషన్‌లపై సుప్రీంకోర్టు సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించారు. ఇతర రాష్ట్రాల విద్యార్థులు స్థానిక కోటా కిందకు రారని, నాలుగు ఏళ్లు చదువు లేదా నివాసం ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం స్థానికత ఖరారు చేసిందని ప్రభుత్వ తరఫు న్యాయవాది వివరించారు. స్థానికత నిబంధనల కారణంగా విద్యార్థులకు హక్కులకు అన్యాయం జరగకూడదని సీజేఐ అభిప్రాయం వ్యక్తం చేశారు.