– ‘సిగాచి’ని సందర్శించిన ఎన్డీఎంఏ బృందం
– సహాయక చర్యలపై ఆరా.. చేపట్టాల్సిన చర్యలపై సమీక్ష
– పరిశ్రమ యాజమాన్యంపై బృందం ఆగ్రహం
– 44కు చేరిన మృతుల సంఖ్య.. ఇంకా లభించని 8 మంది ఆచూకీ
నవతెలంగాణ-మెదక్ ప్రాంతీయ ప్రతినిధి
దేశంలోనే ఎంతో ప్రమాదకరమైన సంఘటన జరిగిన పాశమైలారం సిగాచి కెమికల్ పరిశ్రమను పరిశీలించేందుకు నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (ఎన్‌డీఎంఏ) బృందం మంగళవారం సంగారెడ్డి జిల్లాకు వచ్చింది. సిగాచి పరిశ్రమలో జరిగిన ప్రమాద స్థలిని బృందం క్షుణంగా పరిశీలించింది. ప్రమాదం జరగడానికి గల కారణాలపై నిశితంగా అధ్యయనం చేసింది. మూడున్నర గంటల పాటు కంపెనీలో శిథిలాలను బృందం సభ్యులు పరిశీలించారు. ఈ సందర్భంగా కొన్ని శాంపిల్స్‌ను సేకరించారు. ఈ ప్రమాదం ఎందుకు జరిగింది..? కారణాలేంటీ..? భవిష్యత్‌లో ప్రమాదాలు జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వంటి విషయాలపై ఎన్డీఎంఏ బృందం సమగ్రమైన అధ్యయనం చేసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నివేదిక సమర్పించనుంది. రాష్ట్ర డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అధికారులు, కలెక్టర్ ప్రావీణ్య, ఎస్పీ పంకజ్‌తో కలిసి ప్రమాద జరిగిన పరిసర ప్రాంతాన్ని బృందం పరిశీలించింది. ఎన్డీఎంఏ పరిశీలన బృందానికి జిల్లా అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సంఘటన జరిగిన తీరును వివరించారు. ప్రమాదం జరిగిన తర్వాత చేపట్టిన సహాయక చర్యలను తెలియజేశారు. ఈ సందర్భంగా సిగాచి యాజమాన్యం తీరు పట్ల ఎన్డీఎంఏ బృందం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్యం, పరిశ్రమ నిర్వహణలో తగిన జాగ్రత్తలు పాటించడంలో లోపం జరిగినట్టుగా తెలుస్తోంది. పరిశ్రమలో జరిగిన ప్రమాద తప్పిదాలను నిగ్గుతేల్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చీఫ్ సెక్రెటరీ రామకృష్ణారావు నేతృత్వంలో ఎక్స్‌పర్ట్ హైలెవల్ కమిటీ, వెంకటేశ్వరావు అధ్యక్షతన నిపుణుల కమిటీ వేసింది. ఆ రెండు కమిటీలు ఇప్పటికే ప్రమాద స్థలాన్ని పరిశీలించాయి. ఇది అతిపెద్ద ప్రమాదం కావడంతో కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా జాతీయ విపత్తుల నివారణ సంస్థ నుంచి పరిశీలన బృందం వచ్చి అధ్యయనం చేసింది.
44కు చేరిన మృతులు.. లభించని 8 మంది ఆచూకీ
సిగాచి పరిశ్రమలో డ్రయ్యర్, రియాక్టర్ పేలిన ప్రమాదంలో ఇప్పటి వరకు 42 మంది మరణించారు. మంగళవారం మరో ఇద్దరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మరణించారు. మదీనాగూడలోని పనీషియా ఆస్పత్రిలో కార్మికులు ఆరీఫ్, పటాన్‌చెరులోని ధృవ ఆస్పత్రిలో అఖిలేశ్ చికిత్స పొందారు. వీరి మృతితో మొత్తం మృతుల సంఖ్య 44కు చేరింది. ప్రమాదంలో చిక్కుకొని ఇంత వరకు ఆచూకీ లభించని వారు మరో 8 మంది ఉన్నారు. గత నెల 30వ తేదీన ప్రమాదం జరిగిన నాటి నుంచి ఇప్పటి వరకు వారి ఆచూకీ లభించకపోవడంతో సదరు కార్మికులు చనిపోయి ఉండి ఉంటారని భావిస్తున్నారు. అయితే వారి ఆనవాళ్లు లభించకపోవడంతో బంధువులు శోకాతప్త హృదయాలతో ఎదురు చూస్తున్నారు. శిథిలాల్లోంచి ఏ చిన్న శరీర అవశేషాలైనా లభిస్తాయన్న ఆశతో బంధువులు కంపెనీ పరిసరాల్లోనే పడిగాపులు కాస్తున్నారు.