Thursday, October 23, 2025
E-PAPER
Homeఎడిట్ పేజిమూతపడిన ప్రభుత్వ బడులెన్ని?

మూతపడిన ప్రభుత్వ బడులెన్ని?

- Advertisement -

కొన్ని దశాబ్దాలుగా పాలకవర్గాలు తీసుకుంటూ వచ్చిన నిర్ణయాలతో ప్రభుత్వ విద్యారంగం కుదేలయ్యింది. సుమారుగా రెండేండ్లక్రితం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వ బడుల దశదిశ మార్చుతామని ప్రకటించింది. సాక్ష్యాత్తూ తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డినే ఈ విషయంలో పలు హామీలిచ్చారు. ఒక్క ప్రకటన కూడా ఆచరణ రూపం ధరించలేదు, సరికదా సంస్కరణ దిశగా అడుగైనా ముందుకు పడలేదు. సర్కార్‌ వచ్చీరాగానే విద్యా సంస్కరణకు మాజీ ఐఏఎస్‌ ఆకునూరి మురళి తదితరులతో విద్యా కమిషన్‌ వేసింది. ఆ కమీషన్‌ సకాలంలోనే ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ప్రభుత్వ పాఠశాలల సంస్కరణలో భాగంగా మండలానికి నాలుగు తెలంగాణా ఫౌండేషన్‌ స్కూల్స్‌, మూడు తెలంగాణా పబ్లిక్‌ పాఠశాలలు, అన్ని హంగులతో మండలానికి 50కోట్ల రూపాయల చొప్పున కేటాయించాలని పేర్కొంది.

ఏడాదికి వంద మండలాల చొప్పున ఐదు వేలకోట్ల రూపాయల ఖర్చుతో ఆరేండ్ల కాలపరిమితిలో 634 మండలాల విద్యా సంస్కరణకు 31,700 కోట్లరూపాయలు విడతల వారీ ప్రణాళిక సూచించింది. కమిటీ సూచనలు ఇప్పుడెవరూ ప్రస్తావించడం లేదు. దరిదాపు కమిటీ సిఫార్సులు బుట్టదాఖలు అయినట్లే? ఇక విద్యాకమిషన్‌ సూచనలు రాకముందే ”యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ స్కూల్స్‌ మా ప్రాధాన్యత, ఇంటర్నేషనల్‌ స్థాయి విద్య అందుబాటులోకి తెస్తాం” అంటూ 2024లోనే 58 పాఠశాలలు ప్రకటించి ఆదరా బాదరాగా ముఖ్యమంత్రి శంకుస్థాపన కూడా చేశారు. ఒక్కో పాఠశాలకు రూ.200 కోట్లతో 200 పాఠశాలలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. దీనికి 40వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని భారీ ప్రణాళికనే ప్రకటించారు. ఆర్థికస్థితి అస్తవ్యస్తమైన ఈదశలో వాటి నిర్మాణం పూర్తవడం అనుమానాస్పదమే!

ఇవన్నీ ఇలా ఉంటే ఇటీవల ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు కె.కేశవరావు నేతృత్వంలో నూతన విద్యావిధానం-2020 అమలు, విద్యాసంస్కరణలు కోసం విద్యాశాఖ ఉన్నత అధికారులను భాగ స్వామ్యం చేస్తూ మరో నూతన విద్యా సంస్కరణ కమిటీ వేశారు. ఎన్‌ఈపీ విధివిధానాలే బాగా లేవనే విమర్శలున్నా పట్టించుకోవడం లేదు. ఇక ఆకమిటీ సిఫార్సులేమిటో అవి ఎంతవరకు ప్రభుత్వ విద్యారంగాన్ని గాడిలో పెడుతాయో అర్థంకాని పరిస్థితి. కానీ గత రెండేండ్లుగా విద్యావ్యవస్థ మౌలిక పరిష్కారం ఒక్క అడుగు ముందుకు పడలేదు. ప్రభుత్వబడుల తిరోగమనం మాత్రం ఆగడంలేదు. ప్రభుత్వబడి సంస్కరణ సరే! ఉన్న బడుల్లో ఎన్ని మూతపడ్డాయి? మూత పడడానికి దగ్గరగా వచ్చిన పాఠశాలలెన్ని? ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలలేమి? రోజురోజుకూ నమోదు పడిపోవడం? అసమతుల్య బోధనా సిబ్బంది పంపకం? ప్రయివేటు పాఠశాలలో విచ్చలవిడి ఫీజు దోపిడీ నియంత్రణ లేకపోవడం? ఇత్యాది అంశాలు, సమస్యలు విద్యాశాఖను చూస్తున్న ముఖ్యమంత్రి ముందు ఉన్న ప్రస్తుత సవాళ్లు.

ప్రభుత్వ పాఠశాల ఉనికి కూడా ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. 2023-24 యుడైస్‌ నివేదికలో తెలంగాణ రాష్ట్రంలో19,734 ప్రాథమిక పాఠశాలలు ఉన్నట్లు తెలిపితే, తాజాగా ప్రభుత్వం మానిటరింగ్‌ కోసం ఇచ్చిన గణాంకాల్లో ఆసంఖ్య 16,474గా చూపబడింది. మాధ్యమిక పాఠశాలలు 3,237 చూపితే, తాజాగా 3,100గా చూపింది. ఇక ఉన్నత పాఠశాలలు 4,843 పాఠశా లలుంటే, తాజాగా 4,672 పాఠశాలలు పేర్కొంది. రెసిడెన్షియల్‌ పాఠశాలలు మినహాయిస్తే 2024యుడైస్‌లో 27, 814 పాఠశాలలు ఉనికిలో ఉంటే తాజాగా 24,156పాఠశాలలు మాత్రమే చూపు తుంది. అంటే ఈ కాలంలో 3, 658 పాఠశాలలు తగ్గించి చూపబడ్డాయి. వీటిలో 3,260 ప్రాథమిక, 137 మాధ్యమిక, 171 ఉన్నత పాఠశాలలు మూతవేసినట్లే కదా? ఇక తెలంగాణా విద్యాకమిషన్‌ రాష్ట్రంలో ఉన్న 19వేల పైచిలుకు ప్రాథమిక పాఠశాలల్లో 13వేల పాఠశాలల్లో 50మందికంటే తక్కువ పిల్లలున్నారని తెలిపింది.

ఇక మాధ్యమిక, ఉన్నత పాఠశాలల పరిస్థితి ఇంచుమించు ఇదే! అంటే ఇంకా మూడొంతుల పాఠశాలలు సంక్షోభదశలో ఉండి మూతకు దగ్గరగా ఉన్నట్లే కదా? అంతేకాదు అనేక ప్రభుత్వ బడుల్లో నమోదు ఉంటే తగిన సౌకర్యాలు, బోధనా సిబ్బంది లేదు.తగిన సౌకర్యాలు,బోధనా సిబ్బంది ఉన్న పాఠశాలలో నమోదు దారుణంగా పడిపోవడంతో పాటు, క్షీణదశకు చేరుకుంటున్నాయి. ప్రతియేటా ప్రజాధనం విద్యారంగంలో వేతనాల కోసం రూ.18వేల కోట్లు ఖర్చు పెడుతున్నాము. ఇట్లాంటి పరిస్థితిలో తెలంగాణ పాఠశాల సంస్కరణ తక్షణ అవసరం కాదా? మీనమేషాలు లెక్కిస్తున్నా కొద్దినష్టాలే కాని కుదురుకునే స్థితి లేదు. కనుక తెలంగాణా ప్రభుత్వం తక్షణం ఏదో ఒక నిర్ణయం ప్రభుత్వ పాఠశాలల విషయంలో తీసుకోవాల్సిన అవసరం ముందుకు వచ్చింది. ఆ నిర్ణయం కూడా సామాజికంగా వెనుకబడిన వర్గాల విద్యా అవసరాలు, వేగంగా మారుతున్న సాంకేతిక పరిజ్ఞానం, సామాజిక మార్పులు, భవిష్యత్తు దేశ అవసరాలు, ఎదురుకానున్న సవాళ్లను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ బడుల సంస్కరణ ఉండాలి.

కానీ, ఏదో తాత్కాలిక ఉపశమనంగా పైపై లేపనాలు పూయడం వలన కాలం డొలుపుకు పోవడం తప్ప, విద్యారంగం కుదుట పడే అవకాశం ఎంతమాత్రం లేదు? విద్యా గణాంకాలను అనుసరించి రాష్ట్రంలో ఉన్న ముప్పై వేల పాఠశాలలున్నాయి. సరాసరి ఒక్కో పాఠశాలకు ఎకరం స్థలం అనుకున్న 30వేల ఎకరాల విలువైన స్థలాలు ఉన్నాయి. గత 20ఏండ్లుగా సర్వశిక్షా అభియాన్‌ నిర్మించిన లక్ష కోట్ల పైగా విలువైన తరగతి గదులు, భవన సముదాయాలు ఉన్నాయి. వీటిలో కొన్నింటిని ఏదో రకంగా ఉపయోగించినా ప్రభుత్వ ఖర్చు తగ్గుతుంది. తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కేసీఆర్‌ కులాల వారీగా ప్రవేశపెట్టిన రెసిడెన్షియల్‌ స్కూల్లు చాలా బాగం అద్దె భవనాల్లో నడుస్తున్నాయి. తరచూ పుడ్‌ పాయిజనింగ్‌ కేసులు, విద్యార్థుల మానసిక, శారీరక వేధింపు సంఘటనలు బహిర్గతం అవుతున్నాయి, నిర్వాహణా లోపం కనిపిస్తుంది. ఈ రెసిడెన్షియల్‌ పాఠశాల వ్యవస్థీకరణ వలన ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో దారుణంగా నమోదు శాతం పడిపోయింది. ప్రభుత్వబడిలో అసమతుల్యత ఏర్పడింది.

విద్యాప్రమాణాల్లో కూడా తెలంగాణా స్థానం 31కి దిగజారింది. అలాంటి తప్పిదమే తిరిగి ప్రస్తుత ప్రభుత్వం ”యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ స్కూల్స్‌”పేరుతో చేయడంవలన మరో ఐదువేల ఎకరాల పంట భూముల సేకరణ, కోట్లాది రూపాయల నూతన భవనాల నిర్మాణం ఖర్చు తప్ప అదనంగా సాధించే ప్రయోజనమేమి ఉండదు? పైగా ప్రభుత్వ పాఠశాలల నమోదు మరింత పడిపోవడం, మరిన్ని పాఠశాలలు మూత దశకు చేరిపోవడం తప్ప మరో రకం ఫలితం రాదు. భవిష్యత్తులో ప్రభుత్వ పాఠశాల మూత అనే మాట రాకుండా ప్రజలకు విద్యా సంస్కరణ అందుబాటులోకి తేవాలి. సమూలమైన మార్పు ఏదైనా కొన్ని కఠోరమైన నిర్ణయాలతోనే సాధ్యమవుతుంది. కనుక ప్రభుత్వ బడులకు పూర్వ వైభవం రావాలంటే ముందు దానికి బడ్జెట్‌లో కొఠారి కమిషన్‌ సూచనల ప్రకారం నిధులు కేటాయించాలి. ఇది పెట్టుబడిగా కాకుండా భావిభారత విద్యార్థుల భవిష్యత్‌గా గుర్తించాలి. అప్పుడే ప్రభుత్వ విద్యావ్యవస్థ బలోపేతమవుతుంది.

ఎన్‌.తిర్మల్‌ 9441864514

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -