నవతెలంగాణ – హైదరాబాద్: తీవ్ర విషాదం నింపిన సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచి కంపెనీ బాధితులకు ఇచ్చిన మాట ప్రకారం కోటి పరిహారం ఇవ్వకుంటే కలెక్టరేట్ కార్యాలయం ఎదుటే టెంట్ వేసి ఆందోళనకు దిగుతామని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.బాధితులకు న్యాయం జరిగేవరకు టెంట్ తీయమని బాధితుల పక్షాన బీఆర్ఎస్ పోరాటం చేస్తుందన్నారు. సిగాచీ బాధితులకు న్యాయం చేయాలంటూ బాధిత కుటుంబాలతో ఇవాళ హరీశ్ రావు సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయానికి ర్యాలీగా వెళ్లి అడిషనల్ కలెక్టర్ ను కలిశారు.
ఘటనలో మృతి చెందిన వారి డెడ్ బాడీలు అప్పగించడంలో, పరిహారం అందించడంలో వైఫల్యంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన హరీశ్ రావు.. సిగాచి ఘటన జరిగి నెల రోజులు కావొస్తున్నదని సీఎం వచ్చి కోటి రూపాయల ఎక్స్ గ్రేషియా ప్రకటించినా ఒక్కరికి అందలేదన్నారు. అంతిమ కార్యక్రమాలు జరిపేందుకు శవాలు కూడా ఇవ్వని దుస్థితి ఉందని చివరకు బూడిదను తీసుకువెళ్లి గోదావరిలో కలుపుకున్నమని బాధితులు కన్నీరు పెట్టుకుంటున్నారని మండిపడ్డారు.
నెల గడిచినా ఎంత మంది చనిపోయారు, ఎంత మంది క్షతగాత్రులు అధికారికంగా వెల్లడించలేదని హరీశ్ రావు విమర్శించారు. చనిపోయిన వారి పేర్లు, ఎవరెవరికి ఎంత ఇచ్చారు, క్షతగాత్రులకు ఎంత ఇచ్చారు అనేది ఈ ప్రభుత్వం ఎందుకు దాచి పెడుతున్నదని ప్రశ్నించారు. సిగాచీ పరిశ్రమ యాజమాన్యం నిర్లక్ష్యం ఉందని ఓ మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదులో స్పష్టంగా ఉందని ఎఫ్ఐఆర్ కూడా అయ్యిందని మరి ఎందుకు రేవంత్ రెడ్డి యాజమాన్యాన్ని కాపాడుతున్నారని నిలదీశారు. ఎందుకు యాజమాన్యంతో కుమ్మక్కు అయ్యావు, కంపెనీతో ఉన్న లాలూచి ఏమిటి? అని ముఖ్యమంత్రిని ప్రశ్నించారు.
శవాలు ఇవ్వకుండా 8 మంది మిస్సింగ్ అంటూ ఎందుకు వేధిస్తున్నారని మండిపడ్డారు. ఎక్స్ గ్రేషియా, డెత్ సర్టిఫికేట్ ఎప్పుడు ఇస్తారు అని బాధితులు అడిగితే, ఎస్ ఎల్ బీ సీ ఘటనలో శవాలు కూడా రాలేదు, మీకు బూడిదైనా దొరికింది అని అత్యంత అమానవీయంగా మాట్లాడుతున్నారని చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తీవ్రంగా గాయపడ్డవారికి సీఎం పది లక్షలు ఇస్తామని చెబితే, 50వేలు ఇచ్చి చేతులు దులుపుకున్నారని తీవ్రంగా గాయపడిన వారికి 50లక్షలు ఇచ్చి, నెల నెలా వేతనం ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఏపీలో 2024 ఆగస్టు 20 న అనకాపల్లిలో ఓ కంపెనీ ప్రమాదం జరిగి 17 మంది మరణిస్తే, కొందరికి గాయాలు అయితే మూడు రోజుల్లో కోటి రూపాయలు, తీవ్రంగా గాయపడితే 50లక్షలు, తక్కువగా గాయ పడితే 25లక్షలు ఇచ్చారని గుర్తు చేశారు. ఢిల్లీ వెళ్లడం రావడం తప్ప ఏనాడైనా బాధతో ఒక రివ్యూ అయిన చేసావా అని సీఎంను ప్రశ్నించారు.