Thursday, September 11, 2025
E-PAPER
spot_img
Homeఎడిట్ పేజిఎన్నాళ్లీ వివాదాలు..?

ఎన్నాళ్లీ వివాదాలు..?

- Advertisement -

విమర్శలు.. వివాదాలు.. వైఫల్యాలు.. ఈ మూడింటినీ కలిపితే టీజీపీఎస్సీ అవుతుందేమో. అలా అనుకునేంతగా ఆ కమిషన్‌ తీరు కొనసాగుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో ఏపీపీఎస్సీ అయినా, ఇప్పుడు తెలంగాణలో టీజీపీఎస్సీ అయినా ఇదే ఒరవడి కొనసాగుతోంది. ఫలితంగా లక్షలాది మంది అభ్యర్థుల భవిష్యత్తు అగమ్య గోచరమవుతోంది. గ్రూప్‌-1 పోస్టుల భర్తీకి సంబంధించి టీజీపీఎస్సీ జారీ చేసిన నోటిఫికేషన్‌ను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లపై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం మంగళవారం వెలువరించిన తీర్పు… ఆ కమిషన్‌ పనితీరును మరో సారి ప్రశ్నార్థకం చేసింది. మెయిన్స్‌ పరీక్షా పత్రాలను తిరిగి మూల్యాంకనం చేయాలంటూ ఈ సందర్భంగా కోర్టు ఆదేశించింది. ఇప్పటికే ప్రకటించిన తుది మార్కుల జాబితాతో పాటు జనరల్‌ ర్యాంకింగ్‌ లిస్టులను రద్దు చేయటంతో అభ్యర్థుల ఆందోళన తారాస్థాయికి చేరింది. మెయిన్స్‌ అభ్యర్థుల పేపర్లను మూల్యాంకనం చేసి, అర్హుల జాబితాలను ప్రకటించాలంటూ న్యాయ స్థానం ఆదేశించటంతో వారు రోడ్డెక్కి తమ తీవ్ర నిరసనను వ్యక్తం చేశారు.
వాస్తవానికి టీజీపీఎస్సీ ఇలా వివాదాల్లో చిక్కుకోవటం కొత్తేమీ కాదు. తెలంగాణ వచ్చాక బీఆర్‌ఎస్‌ హయాంలోనూ ఆ కమిషన్‌ పని విధానంపైన తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. అప్పట్లో టీజీపీఎస్సీ తప్పిదాల వల్ల రెండుసార్లు ప్రిలిమ్స్‌ రద్దు కావటంలో నిరుద్యోగ యువత తీవ్రంగా నష్టపోయింది. ఇప్పుడు కాంగ్రెస్‌ హయాంలో గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షకు సంబంధించి కూడా ఇలాంటి విమర్శలనే అది మూటగట్టుకోవటం గమనార్హం. హాల్‌ టిక్కెట్ల పంపిణీ నుంచి మూల్యాంకనం వరకూ అన్నీ వివాదాస్పద నిర్ణయాలే తీసుకున్నారనే ఆరోపణలను కమిషన్‌ ఎదుర్కొంటోంది. నిబంధనలు, సూత్రాలను అది పూర్తిగా ఉల్లంఘించింది. మూల్యాంకనానికి సంబంధించిన వివరాలను పరిశీలిస్తే… సోషియాలజీ, ఎన్విరాన్‌మెంటల్‌ సైన్సు సబ్జెక్టులకు ప్రత్యేక ప్రొఫెసర్లు, తెలంగాణ తొలి, మలిదశ ఉద్యమాలపై ప్రత్యేక అవగాహన ఉన్నవారు, జనరల్‌ అంశాలపై పట్టున్న వారు ప్యానెల్‌లో లేనే లేరన్నది అభ్యర్థుల వాదన. అదీగాక చాలాకాలం క్రితమే ఉద్యోగవిరమణ చేసిన రీడర్లు, ప్రొఫెసర్లను ప్యానెల్‌లో చేర్చుకోవటం శోచనీయం. పైగా అనేకమంది ఉన్నత విద్యావంతులు, కార్పొరేట్‌ ఉద్యోగాలకు రాజీనామా చేసిన వారు సైతం రాసిన ఈ పరీక్షలకు, వారికి వచ్చిన మార్కులకు నక్కకు, నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. వారిలో చాలామందికి పదిలోపే మార్కులు రావటం గమనార్హం. ఈ పరిణామాలన్నీ అంతిమంగా లక్షలాది రూపాయలు పోసి, కోచింగ్‌ సెంటర్లలో ప్రిపేర్‌ అయిన నిరుద్యోగుల ఆశలను వమ్ముచేశాయి. పారదర్శకంగా నియమాకాలు చేపట్టాల్సిన టీజీపీఎస్సీ, దానికి భిన్నంగా వివాదాలకు కేంద్ర బిందువుగా మారటం ఇక్కడ కొసమెరుపు.

కాగా ఇక్కడ కేవలం టీజీపీఎస్సీని మాత్రమే తప్పుబట్టటానికి లేదు. గత బీఆర్‌ఎస్‌ సర్కారు చేసిన తప్పులను సరిచేసి…టీజీపీఎస్సీని యూపీఎస్సీ తరహాలో సరిదిద్దుతామంటూ కాంగ్రెస్‌ పార్టీ, ఆ ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అనేకసార్లు నిరుద్యోగులకు హామీనిచ్చారు. ఈ క్రమంలో గతాను భవాలను దృష్టిలో ఉంచుకుని, టీజీపీఎస్సీ పనితీరును ఎప్పటికప్పుడు సమీక్షించి, లోపాలను సరిదిద్దాల్సిన ప్రభుత్వం ఆ పనిచేయలేదు. మూల్యాంకనానికి నిపుణులైన ప్రొఫెసర్లను నియమించటం, తెలుగు, ఇంగ్లీషు పేపర్లను అదే మాద్యమాలకు సంబంధించిన వారితో మూల్యాంకనం చేయించటమనే నిబంధనలకు తిలోదకాలిస్తున్నా సర్కారు చూస్తూ ఊరుకుందే తప్ప, టీజీపీఎస్సీకి సరైన దిశా నిర్దేశం చేసి, గాడిన పెట్టలేదు. ఫలితంగా చరిత్ర మళ్లీ పునరావృతమైంది. అభ్యర్థులకు జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
ఈ నేపథ్యంలో ఇప్పటికైనా కాంగ్రెస్‌ ప్రభుత్వం కండ్లు తెరవాలి. గ్రూప్‌-1 పరీక్షల్లో అవకతవకలపై తక్షణమే విచారణకు ఆదేశించి, తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. సబ్జెక్టు నిపుణులతోనే జవాబు పత్రాల మూల్యా ంకనం చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలి. తద్వారా పోస్టుల భర్తీకి ఎలాంటి అడ్డంకులు లేకుండా నియామకాలను పారదర్శకంగా చేపట్టాలి. తద్వారా అత్యున్నత స్థాయి కమిషన్‌గా టీజీపీఎస్సీని తీర్చిదిద్దాలి. లేదంటే నిరుద్యోగ యువత ప్రభుత్వాన్ని, కమిషన్‌ను క్షమించదుగాక క్షమించదు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad