చిన్నారుల ‘ఊపిరి’పై కాలుష్య ప్రభావం
ఢిల్లీలో ఇండియాగేట్ వద్ద నిరసనలు
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో కాలుష్య తీవ్రతతో గాలి నాణ్యత రోజు రోజుకూ దిగజారుతోంది. బీజేపీ ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవడం లేదని ఆరోపిస్తూ ఢిల్లీ వాసులు ఆందోళనకు దిగారు. వివిధ వర్గాల ప్రజలు, తల్లిదండ్రులు, పర్యావరణ కార్యకర్తలు ఇండియా గేట్ వద్ద భారీ నిరసన చేపట్టారు. చిన్నారులతో కలిసి అనేక మంది మహిళలు హాజరై.. ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ”ప్రజా ప్రతినిధులతో సమావేశం కావాలని కోరుతున్నాం. ముఖ్యమంత్రి అపాయింట్‌మెంట్ కోరినప్పటికీ నిరాకరించారు. కాలుష్య తీవ్రత వల్ల చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అందుకే తల్లిదండ్రులు భారీ స్థాయిలో వీధుల్లోకి వచ్చి నిరసన చేపట్టారు” అని పర్యావరణవేత్త భావ్రీన్ ఖండారీ పేర్కొన్నారు.
ప్రతి ముగ్గురు చిన్నారుల్లో ఒకరి ఊపిరితిత్తులు దెబ్బతింటున్నాయని, స్వచ్ఛమైన గాలిలో పెరిగే పిల్లలతో పోలిస్తే వీరి జీవితకాలం దాదాపు పదేండ్లు తక్కువగా ఉంటోందని ఆవేదన వ్యక్తం చేశారు.స్వచ్ఛమైన గాలిని అందించడంలో ప్రభుత్వం విఫలమైందని మరో నిరసనకారుడు ఆరోపించారు. మాజీ సీఎం షీలా దీక్షిత్ హయాంలో ఢిల్లీ ‘గ్రీన్ క్యాపిటల్’గా ఉండేదని, ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరాల్లో చేరిందన్నారు. రాజకీయ నాయకులు మాత్రం బాధ్యత వహించకుండా ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటున్నారని దుయ్యబట్టారు. ఈ క్రమంలో ఎలాంటి అనుమతులు లేకుండా ఇండియా గేట్ వద్ద నిరసనలకు దిగారని పేర్కొంటూ పలువురు నిరసనకారులను అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు.



