Saturday, December 13, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంపోలవరం-నల్లమల్ల సాగర్‌పై ఎలా ముందు కెళ్దాం?

పోలవరం-నల్లమల్ల సాగర్‌పై ఎలా ముందు కెళ్దాం?

- Advertisement -

నేడు ఢిల్లీలో మంత్రి ఉత్తమ్‌ అత్యున్నత సమావేశం
న్యాయవాదులు, సాంకేతిక నిపుణులతో భేటీ
ఏపీపై సుప్రీంలో అభ్యంతరాలు దాఖలు
తెలంగాణకు జరిగే నష్టంపై చర్చ


నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
పోలవరం-బనకచర్ల స్థానంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిపాదించిన పోలవరం-నల్లమల్ల సాగర్‌తో తెలంగాణకు నష్టం జరగనున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వంపై సుప్రీంకోర్టులో అభ్యంతరాలు దాఖలు చేసేందుకు సిద్ధమైంది. ఈ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో తెలంగాణ తరఫున వాదించాలని సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ మను సింఘ్విని రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థించింది. ఈ విషయమై ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో నేడు మధ్యాహ్నం 12 గంటలకు సన్నాహక సమావేశం జరగనుంది. సింఘ్వితో పాటు నీటిపారుదల నిపుణులతో ఇరిగేషన్‌ శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి సమావేశమవుతారు. ప్రాజెక్ట్‌పై లోతుగా చర్చించి ఎలా ముందుకెళ్లాలో నిర్ణయం తీసుకోనున్న నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది.

రూటు మార్చిన ఏపీ..
పోలవరం-బనకచర్ల ప్రాజెక్టు స్థానంలో పోలవరం-నల్లమల సాగర్‌ ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తాజాగా తెరపైకి తెచ్చింది. ఈ కొత్త ప్రాజెక్టులో భాగంగా పోలవరం నుంచి బొల్లాపల్లి జలాశయానికి గోదావరి నీళ్లు తీసుకెళ్లి అక్కడి నుంచి వెలిగొండ ప్రాజెక్టులో భాగమైన నల్లమల సాగర్‌ జలాశయానికి తరలిస్తారు. డీపీఆర్‌ తయారీకి నవంబర్‌ 27న టెండర్లకు ఆహ్వానించారు. మొదటి దశలో… పోలవరం జలాశయం నుంచి వరద జలాలను కృష్ణా నదికి మళ్లిస్తారు. ఇందుకోసం పోలవరం కుడి కాలువ సామర్థ్యం 17,500 క్యూసెక్కుల నుంచి 38,000 క్యూసెక్కులకు పెంచుతారు. రెండో దశలో… కృష్ణా నది నుంచి నాగార్జున సాగర్‌ కుడి కాల్వలో 80వ కిలోమీటర్‌ వద్ద నీటిని కలుపుతారు. సాగర్‌ కుడికాలువ నుంచి నీటిని లిఫ్ట్‌ చేసి పల్నాడు జిల్లా బొల్లాపల్లి వద్ద కొండల్లో నిర్మించే రిజర్వాయర్‌లో150 టీఎంసీలను నిల్వ చేస్తారు. మూడో దశలో … బొల్లాపల్లి రిజర్వాయర్‌ నుంచి నల్లమల అరణ్యం మీదుగా కర్నూలు జిల్లా బనకచర్ల రెగ్యులేటర్‌కు నీళ్లు తరలిస్తారు. ఇందుకోసం నల్లమల అడవుల్లో 26.8 కిలోమీటర్ల మేర సొరంగం తవ్వుతారు.

మూడో దశలో మార్పు…
బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించి మొదటి రెండు దశలను యధాతథంగానే ఉంచి.. మూడో దశలోనే మార్పులు చేస్తారు. పల్నాడు జిల్లాలోని బొల్లాపల్లి జలాశయం నుంచి కర్నూలు జిల్లాలోని బనకచర్ల వరకు కాకుండా బొల్లాపల్లి నుంచి ప్రకాశం జిల్లాలో ఉన్న నల్లమలసాగర్‌ జలాశయం వరకు మాత్రమే నీళ్లను తరలిస్తారు.

తెలంగాణకు జల విఘాతం
ఏపీ ప్రభుత్వం కొత్తగా ప్రతిపాదిస్తున్న పోలవరం- నల్లమలసాగర్‌ ప్రాజెక్ట్‌ రాష్ట్రాల మధ్య జలాల పంపిణీ హక్కులు, నిబంధనలకు పూర్తి వ్యతిరేకమేనని తెలంగాణ నీటి పారుదల రంగ నిపుణులు చెబుతున్నారు. ఏ రాష్ట్రమైనా నికర జలాల ఆధారంగా ప్రాజెక్ట్‌లు కడతారనీ, వరద జలాలపై ప్రాజెక్ట్‌లు కట్టడం దేశంలోనే మొదటి సారని అంటున్నారు. ఆ జలాల్లో కూడా పక్క రాష్ట్రాలకు వాటాలు ఉంటాయనీ, వాటి లెక్కలు తేలక ముందే ఎలా ముందుకెళ్లారని తెలంగాణ వాదిస్తోంది. వర్షాలు కురవని ఏడాది నీటిని ఎక్కడి నుంచి తరలిస్తారనే ప్రశ్నకు ఏపీ వద్ద సమాధానం లేదు. రెండు రాష్ట్రాలు వాడుకునే నికర జలాల్లోంచే నీటిని తరలిస్తారనీ, ఫలితంగా భవిష్యత్‌లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుందని అంటున్నారు. ఈ క్రమంలో కొత్తగా ప్రతిపాదించిన ఈ ప్రాజెక్ట్‌ నిర్మాణాన్ని అడ్డుకునేందుకు కేంద్రంపై ఒత్తిడి తీసుకు రావడం, న్యాయ స్థానాన్ని ఆశ్రయించడం అనే రెండంచెల విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎంచుకుంది.

ఏంటీ వివాదం..
గోదావరినదిలో ఏటా సగటున 1,000 టీఎంసీలకుపైగా వరద నీరు సముద్రంలో కలిసిపోతోంది. ఏపీ చెబుతున్న లెక్కల ప్రకారం వర్షాకాలంలో 129 రోజులు వరద పోటెత్తుతుంది. ఇరు రాష్ట్రాలు వాడుకోకుండా సముద్రంలో వృధాగా కలుస్తున్న వరదనీటిలో 200 టీఎంసీలను మళ్లించేందుకు పోలవరం-బనకచర్ల ప్రాజెక్ట్‌ను ప్రతిపాదించామని ఏపీ అంటోంది. రూ.80,112 కోట్లతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టుతో రాయలసీమకు తాగునీటితోపాటు కొత్తగా 3 లక్షల హెక్టార్ల ఆయకట్టుకు నీరందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సాగర్‌ కుడి కాలువ, వెలిగొండ, గాలేరు నగరి, కేసీ కెనాల్‌, తెలుగు గంగా కింద 22 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించాలని నిర్ణయించారు. ఈ ప్రాజెక్టుపై తెలంగాణతో పాటు పక్క రాష్ట్రాలు కూడా కేంద్రానికి ఫిర్యాదులు చేశాయి. దాంతో గోదావరిలో వరద జలాల లెక్క తేల్చేందుకు సమగ్ర అధ్యయనం చేయాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి సీడబ్ల్యూసీ సూచించింది.

పోలవరం వద్ద 129 రోజుల పాటు వరద ప్రవాహం కొనసాగుతుందా అనే దానిపై కూడా వివరాలు కోరింది. బనకచర్ల ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు జారీ చేయాలని ఏపీ ప్రభుత్వం చేసిన అభ్యర్థనను.. కేంద్ర అటవీ, పర్యావరణ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖకు చెందిన నిపుణుల మదింపు కమిటీ.. తిరస్కరించింది. ఈ ప్రాజెక్టు అంతర్రాష్ట్ర అంశాలకు సంబంధించిందనీ, పర్యావరణ అనుమతులను తాము నిర్ధారించలేమని కమిటీ పేర్కొంది. పర్యావరణ అనుమతులు ఇవ్వాలంటే కేంద్ర జలసంఘం ఈ ప్రాజెక్టును పరిశీలించాలని నిపుణుల కమిటీ అభిప్రాయం వ్యక్తం చేసింది. గోదావరి నదీ జలాల వివాద పరిష్కార ట్రిబ్యునల్‌ అవార్డును ఇది ఉల్లంఘించకుండా చూసుకోవాలని సూచించింది. దీంతో ప్రాజెక్ట్‌ డీపీఆర్‌ కోసం గతంలో పిలిచిన టెండర్లను ఏపీ రద్దు చేసింది. పోలవరం-బనకచర్ల ప్రాజెక్ట్‌ స్థానంలో కొత్తగా పోలవరం-నల్లమల్ల సాగర్‌ను ప్రతిపాదించి డీపీఆర్‌ కోసం తాజాగా టెండర్లను కూడా పిలిచింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -