Wednesday, September 17, 2025
E-PAPER
Homeరాష్ట్రీయం'హెచ్‌ఎస్‌ఆర్పీ' హైరానా!

‘హెచ్‌ఎస్‌ఆర్పీ’ హైరానా!

- Advertisement -

హై సెక్యూరిటీ నెంబర్‌ ప్లేట్‌ బిగించుకోవాలని ప్రచారం
ఈనెల 30వ తేదీ డైడ్‌లైన్‌ అంటూ.. ఫేక్‌ జీవో కలకలం!
నిజమేనని నమ్మి.. వివరాలు నమోదు చేసుకుంటున్న వాహనదారులు
ఇదే అదునుగా అందినకాడికి దోచుకుంటున్న హ్యాకర్లు
మోసపోయామని గుర్తించి ఆర్టీఏ అధికారులకు ఫిర్యాదు
ప్రభుత్వ ఆదేశాలు లేకపోవడంతో చేతులేత్తేస్తున్న రవాణాశాఖ


నవతెలంగాణ-సిటీబ్యూరో
వాహనాలకు హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్‌ నెంబర్‌ ప్లేట్లు తప్పనిసరంటూ జరుగుతున్న ప్రచారం వాహనదారులను హైరానాకు గురిచేస్తోంది. పాత, కొత్త అనే తేడాలేకుండా అన్ని వాహనాలకు హెచ్‌ఎస్‌ఆర్సీ ఉండాలని ప్రభుత్వం నిర్ణయించిందనీ, ఆ మేరకు జీవో జారీ అయినట్టు కొద్దినెలలుగా వివిధ మాధ్యమాల్లో పెద్దఎత్తున్న ప్రచారం జరుగుతోంది. అంతేగాక ఈనెల(సెప్టెంబరు) 30వ తేదీ తుదిగడువు విధించిందంటూ పేర్కొంది. ఆ వార్త నిజమేనని నమ్మిన రాష్ట్రంలోని చాలామంది వాహనదారులు హెచ్‌ఎస్‌ఆర్పీ పేరుతో కనిపించిన వెబ్‌సైట్‌లోకి వెళ్లి తమ వాహనాల వివరాలు నమోదు చేసి.. డబ్బులు చెల్లిస్తున్నారు. రోజులు గడిచిపోతున్నా వాహన నెంబర్‌ ప్లేట్‌ రాకపోవడంతో సదరు వాహనదారులు రవాణాశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇది హ్యాకర్ల పనిగా గుర్తించిన అధికారులు పోలీసులకు కంప్లైంట్‌ చేసి చేతులు దులుపుకున్నారు. ఈ విషయంలో రవాణాశాఖ ఉన్నతాధికారులు ఎలాంటి నష్ట నివారణా చర్యలు చేపట్టకపోవడం విస్మయానికి గురిచేస్తోంది. తమకు ఏ మాత్రం పట్టనట్టుగా వ్యవహరిస్తుండటంతో విమర్శలకు గురికావాల్సి వస్తుంది.

గ్రేటర్‌ పరిధిలో రవాణాశాఖకు 11 ఆర్టీఏ కార్యాలయాలు ఉండగా.. రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన, యూనిట్‌ ఆఫీస్‌లు కలిపి 54 ఉన్నాయి. ఇక్కడ నిత్యం వేల సంఖ్యలో వాహనాల రిజిస్ట్రేషన్లు జరుగుతుంటాయి. కాగా ప్రస్తుతం కొత్త వాహనాలకు షోరూంలోనే హైసెక్యూరిటీ నెంబర్‌ ప్లేట్లు బిగిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఏడాది ఏప్రిల్‌ 9న రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసినట్టుగా సృష్టించిన నకిలీ జీవో ఒకటి ప్రచారంలోకి వచ్చింది. సదరు జీవో ప్రకారం 2016 ఏప్రిల్‌కు ముందు తయారైన వాహనాలకు హైసెక్యూరిటీ నెంబర్‌ ప్లేట్లను బిగించాలనేది సారాంశం. వాస్తవానికి కొత్త నెంబర్‌ ప్లేట్లను బిగించుకోవాలనుకునే వాహనదారులు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఎస్‌ఐఏఎం.ఇన్‌ వెబ్‌సైట్‌లో వాహనం వివరాలను నమోదు చేసుకొని బుక్‌ చేసుకోవాలి. కానీ ఈ సైట్‌ మన రాష్ట్రంలో ఇంకా వినియోగంలోకి రాలేదని తెలిసింది. ఇది తెలియని చాలామంది వాహనదారులు హెచ్‌ఎస్‌ఆర్పీ కోసం అందులోకి వెళ్లి జేబులు గుల్ల చేసుకొని లబోదిబోమంటున్నారు.

ఇటీవల ఇద్దరు నిమ్స్‌ ఆస్పత్రికి చెందిన డాక్టర్లు తమ వాహనాలకు హెచ్‌ఎస్‌ఆర్పీ నంబర్‌ కోసమని సదరు సైట్‌లో వివరాలు నమోదు చేసి.. డబ్బులు చెల్లించారు. వారం రోజులు గడుస్తున్నా.. నెంబర్‌ ప్లేట్‌ ఇంటికి రాకపోవడంతో.. ఆర్టీఏ అధికారులను సంప్రదించారు. అధికారులు చెప్పిన సమాధానంతో అది నకిలీ జీవో అని నిర్ధారణకు వచ్చారు. చేసేదేమీ లేక వెనుదిరిగి వెళ్లిపోయారు. ఇలాంటివి రోజుకు అనేకం వస్తున్నాయి. ఇదిలావుంటే ఇదే అంశంపై మరో ప్రచారం ఇలా ఉంది. 2019 ముందు వాహనాలకు హెచ్‌ఎస్‌ఆర్పీ నెంబర్‌ ప్లేట్‌ బిగింపునకు సంబంధించిన జీవో రవాణాశాఖ సిద్ధం చేసి.. ముఖ్యమంత్రి ఆమోదానికి పంపించగా.. అందుకు సీఎం నిరాకరించినట్టు సమాచారం. అయితే అప్పటికే ఆ శాఖ అధికారుల్లో ఒకరు సదరు జీవోను లీక్‌ చేయడంతో అన్ని మాధ్యమాల్లో వైరల్‌ అయ్యింది. అధికారుల చేయి దాటిపోయింది. అయితే దీనిపై అధికారులు ఒక స్టేట్‌మెంట్‌ ఇవ్వకుండా సైలెంట్‌ అయిపోయారు. మరోవైపు వాహనదారులు ఈ విషయం తెలియక హెచ్‌ఎస్‌ఆర్పీ నెంబర్‌ ప్లేట్‌ కోసం డబ్బులు పోగొట్టుకుంటున్నారు. ఇప్పటికైనా రవాణాశాఖ ఈ విషయంపై వాహనదారులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

హెచ్‌ఎస్‌ఆర్పీ లేకపోతే..
హెచ్‌ఎస్‌ఆర్పీ నెంబర్‌ ప్లేట్‌ లేకపోతే వాహనం విక్రయించడం సాధ్యం కాదు. రవాణాశాఖ, పోలీసుల తనిఖీల్లో పట్టుబడితే కేసులు నమోదవుతాయి. బీమా, కాలుష్య ధ్రువపత్రాలు జారీచేయరు. రిజిస్ట్రేషన్‌ మార్పు జరగదు. అనుకోని ప్రమాదం జరిగినపుడు తగిన సహాయం పొందడం కష్టమవుతుంది. వాస్తవానికి హెచ్‌ఎస్‌ఆర్పీ విషయంలో ప్రభుత్వం ఇప్పటికైతే ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. కాబట్టి ఈనెల 30 తుది గడువు అంటూ జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని అధికారులు సూచిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాలు వచ్చేంత వరకు వాహనదారులు వేచి చూడాలని హైదరాబాద్‌ జాయింట్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్‌ సి.రమేష్‌ కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -