నవతెలంగాణ-హైదరాబాద్ : ఝార్ఖండ్‌లోని అటవీ ప్రాంతంలో భారీగా నగదును భద్రతా సిబ్బంది గుర్తించారు. సింగ్భూమ్ జిల్లాలోని నక్సల్స్ ప్రభావిత కారైకేలా ప్రాంతంలో బంకర్ లాంటి ఒక నిర్మాణంలో దాదాపు రూ.35 లక్షలను పోలీసులు గుర్తించారు.
సీఆర్పీఎఫ్, ఝార్ఖండ్ జాగ్వార్, జిల్లా సాయుధ పోలీసులు పక్కా సమాచారంతో అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్ చేపట్టారు. అటవీ ప్రాంతంలో తనిఖీలు నిర్వహిస్తున్న క్రమంలో భద్రతా సిబ్బంది బంకర్ లాంటి నిర్మాణాన్ని గుర్తించారు.
అనంతరం దానిని తవ్వి చూడగా, రెండు స్టీల్ డబ్బాలలో నగదు ఉండటాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. స్టీల్ డబ్బాల్లో ఉన్న రూ.34.99 లక్షల నగదును సీజ్ చేసినట్లు ఎస్పీ రాకేశ్ రంజన్ మీడియాకు తెలిపారు.
ఈ నగదును మావోయిస్టులు దాచి ఉంటారని అనుమానిస్తున్నామని ఆయన అన్నారు. ఆయుధాలు, మందుగుండు సామాగ్రి, పేలుడు పదార్థాల కొనుగోలు కోసం ఈ డబ్బును బంకర్ లాంటి నిర్మాణంలో దాచి ఉంచినట్లు భావిస్తున్నామన్నారు. అయితే, ఈ నగదు ఎక్కడి నుంచి వచ్చిందనే దానిపై దర్యాప్తు చేస్తున్నామని ఎస్పీ తెలిపారు.