పరిశ్రమల భూములను అపార్ట్‌మెంట్లు, విల్లాలుగా మార్చే కుట్ర
గజం రూ.1.50 లక్షలున్న భూమి రూ.4,000కే అప్పగింత : బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
అత్యాశకు పోతే డబ్బులు పోతాయని పారిశ్రామికులకు హెచ్చరిక
జీడిమెట్ల పారిశ్రామిక ప్రాంతంలో పర్యటన
నవతెలంగాణ – కుత్బుల్లాపూర్
హిల్ట్ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం రూ.5 లక్షల కోట్ల భారీ భూ కుంభకోణానికి పాల్పడుతోందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. హిల్ట్‌పై బీఆర్‌ఎస్ పోరుబాటలో భాగంగా గురువారం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ జీడిమెట్ల ఇండిస్టియల్ ఏరియాలో ఆ పార్టీ నాయకులతో కలిసి ఆయన పర్యటించారు. అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ఒకప్పుడు ప్రభుత్వాలు ప్రజలకు, పరిశ్రమల కోసం, ఉద్యోగ ఉపాధి కల్పన కోసం ఇచ్చిన భూములను.. ఈ ప్రభుత్వం ప్రయివేటు వ్యక్తులకు ధారాదత్తం చేస్తున్నదని కేటీఆర్ అన్నారు. పరిశ్రమలు వద్దంటూ.. అపార్ట్‌మెంట్లు, విల్లాలు, కమర్షియల్ కాంప్లెక్స్‌లు కట్టుకోవాలని పారిశ్రామిక భూములను ఇస్తోందని తెలిపారు.
మార్కెట్‌లో గజం భూమి రూ.లక్షా 50 వేలు పలుకుతుంటే, ప్రభుత్వం కేవలం రూ.4000కే ప్రయివేటు వ్యక్తులకు అప్పజెప్పుతోందన్నారు. ఈ భూములను వెనక్కి తీసుకుని ఇండ్లు, పాఠశాలలు, ఆస్పత్రులు నిర్మించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఈ కుంభకోణాన్ని ప్రజలకు వివరించేందుకే పారిశ్రా మిక వాడల్లో పర్యటిస్తున్నామని తెలిపారు. ఈ అంశాన్ని ఇక్కడితో వదిలిపెట్టబోమని.. ప్రజాసంఘాలు, ఇతర పార్టీలను కలుపుకొని ముందుకుపోతామని అన్నారు. అవసరమైతే ఇందుకోసం ఒక చట్టాన్ని తీసుకొస్తామని చెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డి భూ కుంభకోణంలో పారిశ్రామికవేత్తలు భాగస్వాములు కావద్దని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ఎవరైనా అత్యాశకు పోయి ప్రభుత్వానికి డబ్బులు కడితే, ఆ భూములతోపాటు డబ్బులు కూడా పోతాయన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఈ భారీ కుంభకోణాన్ని, దోపిడీని చూసి తట్టుకోలేక…ఓ తెలంగాణ బిడ్డ తమకు సమాచారం ఇచ్చారని చెప్పారు. తాము అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా సమాచారం లీకైందంటూ ప్రభుత్వం బాధపడుతోందన్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ తెచ్చిన గ్రిడ్ పాలసీ మాదిరిగానే పరిశ్రమలను ప్రోత్సహించే విధానాలను కొనసాగించాలని సూచించారు. ఫ్యూచర్ సిటీ పేరుతో ఫార్మాసిటీ భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని విమర్శించారు. అనంతరం జీడిమెట్ల పారిశ్రామికవాడలోని పలు పరిశ్రమలను కేటీఆర్ సందర్శించి కార్మికులతో, పారిశ్రామికవేత్తలతో చర్చించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కెపి.వివేకానంద్, ఎమ్మెల్సీలు శంభీపూర్ రాజు, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్ది, పార్లమెంటరీ ఇన్‌చార్జి రాగిడి లక్ష్మారెడ్డి, ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు ఉన్నారు.



