నవతెలంగాణ-హైదరాబాద్: లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీపై దాఖలైన క్రిమినల్ పరువునష్టం కేసులో విచారణను సుప్రీంకోర్టు సోమవారం నిలిపివేసింది. భారత్ జోడోయాత్ర సందర్భంగా సరిహద్దుల్లో భారత్, చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణల గురించి మీడియాతో రాహుల్‌గాంధీ చేసిన వ్యాఖ్యలపై లక్నో కోర్టులో క్రిమినల్ పరువునష్టం కేసు దాఖలైన సంగతి తెలిసిందే.
భారత భూభాగంలో చైనా 2,000కిలోమీటర్లు ఆక్రమించిందని మీకు ఎలా తెలుసు మీరు అక్కడ ఉన్నారా, అందుకు సాక్ష్యంగా మీదగ్గర ఏదైనా విశ్వసనీయమైన ఆధారం ఉందా మీరు నిజమైన భారతీయులైతే ఇటువంటి వ్యాఖ్యలు చేయరు అని జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ ఎ.జి.మాసిహ్‌లతో కూడిన ధర్మాసనం రాహుల్ గాంధీని ప్రశ్నించారు. రాహుల్ వ్యాఖ్యలు ప్రజా ప్రయోజనాల దృష్ట్యా సమాచారాన్ని బహిర్గతం చేయడానికేనని సీనియర్ న్యాయవాది ఎ.ఎం.సింఘ్వీ, న్యాయవాది ప్రసన్న ఎస్.లు కోర్టుకు తెలిపారు.
సోషల్ మీడియలో తన అభిప్రాయాలను ఎందుకు వ్యక్తం చేశారని, పార్లమెంటులో మాట్లాడాలని ధర్మాసనం పేర్కొంది. పార్లమెంటులో సమస్యలను లేవనెత్తాలని తెలిపింది. యుపి ప్రభుత్వానికి, రిటైర్డ్ బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బిఆర్ ఒ) అధికారి ఉదయ్ శంకర్ శ్రీవాస్తవకి నోటీసులు జారీ చేసింది.
వివిధ కోర్టుల్లో రాహుల్‌పై 20కి పైగా ప్రసంగ సంబంధిత క్రిమినల్ కేసులు ఉన్నాయని, ఆయనను కేసులతో అణచివేయాలని అనేక మంది చూస్తున్నారని సింఘ్వీ పేర్కొన్నారు. ఈ చర్యలన్నీ చట్టవిరద్ధమైనవి తప్ప మరోకటి కాదని, ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వ విధానాలు మరియు వైఖరులపై వ్యతిరేకతను వ్యక్తం చేయకుండా ఆయన నోరు నొక్కేందుకు యత్నిస్తున్నారని పేర్కొన్నారు.