Monday, July 28, 2025
E-PAPER
Homeజాతీయంవైద్య విద్యలో భారీ కుంభకోణం

వైద్య విద్యలో భారీ కుంభకోణం

- Advertisement -

– ముడుపులు, బూటకపు డిగ్రీలు, ఇన్‌స్పెక్షన్ల గురించి ముందస్తు , రహస్య సమాచారం పంపిణీ
– యూజీసీ మాజీ చైర్మెన్‌ సహా ఉన్నతాధికారులపై కేసు
– ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన సీబీఐ
ముంబయి :
వైద్య విద్యలో పెద్ద ఎత్తున జరిగిన అవినీతి కుంభకోణాన్ని సీబీఐ బట్టబయలు చేసింది. ఈ కుంభకోణంతో సంబంధమున్న పలువురు సీనియర్‌ అధికారులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. అనధికారికంగా రహస్య సమాచారాన్ని పంచుకోవడం, చట్టబద్ధమైన తనిఖీ ప్రక్రియలను తారుమారు చేయడం, తమకిష్టమైన ప్రయివేటుసంస్థలకు అనకూలంగా పనులు జరిగేలా చూసేందుకు విచ్చలవిడిగా ముడుపులు అందచేయడం వంటివి ఈ కుంభకోణంలో చోటు చేసుకున్నాయని సీబీఐ అధికారి ఒకరు వెల్లడించారు. ఈ అవినీతి కుంభకోణం చాలా లోతైన నేరపూరితమైన కుట్రతో కూడినదని తెలిపారు. ఇందులో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ (ఎంహెచ్‌ఎఫ్‌డబ్ల్యూ) సీనియర్‌ అధికారులు, జాతీయ మెడికల్‌ కమిషన్‌ (ఎన్‌ఎంసీ), దేశవ్యాప్తంగా పలు ప్రయివేట్‌ మెడికల్‌ కాలేజీల ప్రతినిధులు, యూజీసీ మాజీ చైర్మెన్‌లకు సంబంధముందని చెప్పారు.


అవినీతి నిరోధక చట్టంలోని 7,8,9,10,12 సెక్షన్ల కింద, భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్‌ 61(2) కింద సీబీఐ కేసు నమోదు చేసింది. దేశవ్యాప్తంగా డజన్ల సంఖ్యలో ప్రభుత్వ అధికారులు, ప్రయివేటు వ్యక్తులు, పారిశ్రామికాధిపతులు ఈ దర్యాప్తులో చిక్కుకున్నారు. ముడుపుల నుంచి క్రిమినల్‌ కుట్ర వరకు అధికార రహస్యాల చట్టాన్ని ఉల్లంఘించడం, ఫోర్జరీ సంతకాలు ఇలా పలు అభియోగాలు వారిపై నమోదయ్యాయి.


చట్టవిరుద్ధంగా అందుబాటులోకి మెడికల్‌ కాలేజీల తనిఖీల వివరాలు
న్యూఢిల్లీలో కొంతమంది ప్రభుత్వ అధికారుల బృందం మెడికల్‌ కాలేజీలకు సంబంధించిన తనిఖీలు, గుర్తింపు, పునరుద్ధరణ ప్రక్రియలకు సంబంధించిన విశ్వసనీయమైన, రహస్యమైన ఫైళ్ళను చట్టవిరుద్ధంగా అందుబాటులోకి తీసుకురావడానికి వెసులుబాటు కల్పించిందని సీబీఐ వెల్లడించింది. ఈ బృందంలో ఎన్‌ఎంసీ, ఆరోగ్య మంత్రిత్వ శాఖలకు చెందిన వారు వున్నారు. ఎఫ్‌ఐఆర్‌ నమోదైన వారిలో టాటా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌ (టీఐఎస్‌ఎస్‌) ఛాన్సలర్‌ డి.పి.సింగ్‌ వున్నారు. ఈయన గతంలో యూజీసీ చైర్మెన్‌గా కూడా పనిచేశారు.


కాలేజీల ఇనస్పెక్షన్‌ షెడ్యూళ్ళ వివరాలు, తనిఖీలకు వచ్చే వారి సమాచారం అంతా రహస్యంగా వుంచాలి. కానీ ఈ బృందం ముందుగానే కాలేజీ ప్రతినిధులకు వెల్లడించేవారు. దీంతో ఆయా వైద్య సంస్థలు అధికారిక ఇనస్పెక్షన్లల సందర్భంగా మోసపూరిత చర్యలకు పాల్పడేందుకు వీలు వుండేది. అంటే కాలేజీల్లో ఘోస్ట్‌ ఫ్యాకల్టీని మోహరించడం, బూటకపు రోగులను అడ్మిట్‌ చేసుకోవడం, బయోమెట్రిక్‌ అటెండెన్స్‌ వ్యవస్థలో అవకతవకలకు పాల్పడడం, తమ సంస్థలకు అనుకూంగా నివేదికలు ఇచ్చేలా తనిఖీలు చేసే బృందాలకు ముడుపులు ఇవ్వడం వంటివి జరిగేవని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు.
ప్రైవేటు కాలేజీల్లో పనిచేసే మధ్యవర్తులకు వారి వ్యక్తిగత మొబైల్స్‌కు పలు మంత్రిత్వ శాఖల మధ్య అంతర్గతంగా నడిచే ఫైళ్ళను ఫోటోలు తీసి పంపేవారు. రహస్య సమాచారంతో పాటు సీనియర్‌ అధికారుల వ్యాఖ్యలు కూడా చేరవేసేవారు. ఆరోగ్య మంత్రిత్వ శాఖకు చెందిన అధికారులే ఇందుకు పాల్పడేవారు.


హవాలా మార్గాల ద్వారా ముడుపులు
ఇలా లీకైన డేటాను అందుకున్న వారిలో గుర్‌గావ్‌కు చెందిన వీరేంద్ర కుమార్‌, న్యూఢిల్లీకి చెందిన మనీషా జోషి, ఇంకా ఇండోర్‌లోని ఇండెక్స్‌ మెడికల్‌ కాలేజీ చైర్మన్‌ సురేష్‌ సింగ్‌ బడోరియా, ఉదరుపూర్‌లోని గీతాంజలి యూనివర్శిటీ రిజిస్ట్రార్‌ మయూర్‌ రావల్‌ ఇలా పలువురు వున్నారని ఎఫ్‌ఐఆర్‌ పేర్కొంది. ఆ సమయంలో మెడికల్‌ అసెస్‌మెంట్‌ అండ్‌ రేటింగ్‌ బోర్డ్‌ (ఎంఎఆర్‌బి)కి పూర్తి స్థాయి సభ్యుడిగా వున్న జితూ లాల్‌ మీనాతో వీరేంద్ర కుమార్‌కు సంబంధాలుండేవని దర్యాప్తులో వెల్లడైంది. పైగా హవాలా మార్గాల ద్వారా ముడుపులను వసూలు చేయడంలో మధ్యవర్తిగా కూడా వుండేవారు. వివిధ కాలేజీ అడ్మినిస్ట్రేటర్ల నుండి కుమార్‌కు నిధులు బదిలీ అయ్యేవి. ఆతర్వాత వాటిని మీనాకు అందచేసేవారు. ఇలా అక్రమంగా అందిన నిధుల్లో కొంత మొత్తాన్ని తీసి రాజస్థాన్‌లో హనుమాన్‌ ఆలయం నిర్మించడానికి కూడా మీనా వాడారని అధికారులు తెలిపారు. ఆ ఆలయ ఖర్చే రూ.75లక్షలు. !


దక్షిణ భారతానికీ లింకు…
వీరేంద్ర కుమార్‌ కార్యకలాపాలు దక్షిణ భాతదేశానికీ విస్తరించాయని ఎఫ్‌ఐఆర్‌ పేర్కొంది. ఆంధ్రప్రదేశ్‌లోని కదిరికి చెందిన తన అసోసియేట్‌ బి.హరిప్రసాద్‌, ఆయన భాగస్వాములు అంకం రాంబాబు (హైదరాబాద్‌), కృష్ణ కిషోర్‌ (విశాఖపట్నం)లతో కలిసి డమ్మీ ఫ్యాకల్టీని ఏర్పాటు చేయడం, ముడుపులు తీసుకుని రెగ్యులేటరీ అప్రూవల్స్‌ జారీ చేయడం వంటి పనులు వీరేంద్ర కుమార్‌ చేసిపెట్టేవారు. గాయత్రి మెడికల్‌ కాలేజీ డైరెక్టర్‌ నుండి రూ.50లక్షలను కృష్ణకుమార్‌ వసూలు చేసి కుమార్‌కు పంపాడు. వరంగల్‌లోని ఫాదర్‌ కొలంబో ఇనిస్టిట్యూట్‌ఆఫ్‌ మెడికల్‌సైన్సెస్‌ వంటి సంస్థలూ ఈ నెట్‌వర్క్‌లో భాగమే. ఈ సంస్థ నుండి రూ.4కోట్లకు పైగా మొత్తాలు హరిప్రసాద్‌కు చెల్లించి, ఎన్‌ఎంసి నుండి తమకు అనుకూలంగా నివేదిక వచ్చేలా చూసుకున్నారు. మధ్యవర్తుల ద్వారా ఈ ముడుపుల చెల్లింపులు జరిగేవి.


క్లోనింగ్‌ చేసిన వేలిముద్రలతో బయోమెట్రిక్‌ తారుమారు
ఇండోర్‌లోని ఇండెక్స్‌ మెడికల్‌ కాలేజీలో ఎన్‌ఎంసి కనీసప్రమాణాలను అందుకోవడం కోసం ఘోస్ట్‌ ఫ్యాకల్టీని శాశ్వత ఉద్యోగిగా చూపించారు. పూర్తి స్థాయి ఫ్యాకల్టీ హాజరవుతోందని చెప్పడానికి గానూ క్లోనింగ్‌ చేసిన వేలి ముద్రలను ఉపయోగించి బయో మెట్రిక్‌ వ్యవస్థను కూడా తారుమారు చేశారు. అలాగే కాలేజీ చైర్మన్‌ సురేష్‌ సింగ్‌ బడోరియా మాల్వాంచల్‌ యూనివర్శిటీ (ఇండెక్స్‌ మెడికల్‌ కాలేజీ మాతృ సంస్థ) ద్వారా బూటకపు డిగ్రీ సర్టిఫికెట్లు, ఎక్సీపీరియన్స్‌ సర్టిఫికెట్లు జారీ చేశారు.
రారుపూర్‌లోని శ్రీ రావత్‌పురా సర్కార్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ అండ్‌రీసెర్చ్‌ (ఎస్‌ఆర్‌ఐఎంఎస్‌ఆర్‌)లో ఇటీవలే అంటే జూన్‌ 30న ఇనస్పెక్సన్‌ జరిగింది. దానికి వచ్చే నలుగురు సభ్యుల ఎన్‌ఎంసి బృంద వివరాలను తెలసుకోవడానికి రూ.25 నుండి రూ.30లక్షల వరకు ముడుపులు అందచేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -