కాలం ఎంత మారుతున్నా స్త్రీ,పురుషుల మధ్య రోజురోజుకు
అసమానతలు పెరుగుతూనే ఉన్నాయి. మానవ సంబంధాలన్నీ
మృగ్యమైపోతున్నాయి. ప్రభుత్వాలతో పాటు పౌర సమాజం
కూడా దీన్ని గుర్తించాలి. మన రాష్ట్ర మహిళలు గతంలో కరువైన
రక్షణ ఇప్పుడైనా లభిస్తుందనుకున్నారు. కానీ జరుగుతున్న వరుస
దాడులతో ఆందోళనకు గురవుతున్నారు. కనుక రాష్ట్ర సర్కారు
కూడా మహాలక్ష్మి పథకమంటూ గొప్పలు చెప్పుకుంటూ
కూర్చోకుండా మహిళల రక్షణ పట్ల దృష్టిపెట్టాలి. కఠిన చట్టాలు చేయడంతో పాటు వాటి అమలుకు కృషి చేయాలి.
ఓ భర్త ఐదు నెలల గర్భిణిగా ఉన్న తన భార్యను ముక్కలు ముక్కలు చేసి అత్యంత కిరాతకంగా చంపేశాడు. తల్లిదండ్రులు కేవలం ఆమె మొండానికి మాత్రమే అంత్యక్రియలు చేశారు. ఆమె శరీర భాగాలకోసం ఇంకా వెదుకుతూనే ఉన్నారు. మరోచోట ఆరునెలల గర్భిణి అయిన భార్యపై కత్తితో దాడిచేశాడు. మరో ప్రబుద్ధుడు భార్యను హత్యచేసి అనంతరం పెట్రోల్ పోసి తగలపెట్టాడు. ఇవన్నీ వారం రోజుల వ్యవధిలో రాష్ట్రంలో జరిగిన వరుస దారుణ ఘటనలు. వీరంతా ప్రేమించిన వ్యక్తి చేయి పట్టి నిండు నూరేండ్లు సంతోషంగా బతకాలని నమ్మి వచ్చిన వారు. నయవంచనకు గురై విగతజీవులయ్యారు. ‘మాయమైపోతున్నడమ్మా మనిషన్న వాడూ… మచ్చుకైనా లేడు చూడూ మానవత్వం ఉన్నవాడూ’ అన్న కవి మాటలు ఎంత అక్షర సత్యమో కదా!
మనుషులు ఎందుకిలా తమలో సహజంగా ఉండాల్సిన మానత్వాన్ని కోల్పోతున్నారు. అదనపు కట్నం కోసం ఒకరు, భార్యపై అనుమానంతో మరొకరు.. ఈ వరుస ఘటనలు చూస్తుంటే ‘మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే’ అని ఎన్నో ఏండ్ల కిందట మార్క్స్ అన్న మాటలు గుర్తుకు రాక మానవు. ఇలాంటి సంఘటనలు కన్నా, విన్నా హృదయం ద్రవించడం సర్వసాధారణం. ఇక ఆ దాడికి గురైంది మన ఇంట్లో అమ్మాయే అయితే ఆ బాధను ఊహించుకోగలమా! తలచు కుంటేనే గుండె మెలిపెట్టేస్తోంది.
రోజురోజుకు మనుషుల్లో మానవత్వం సన్నగిల్లుతుంది. ప్రేమ, ఆప్యాయత, నిజాయితీ, విలువలు, మానవ సంబంధాలు కనుమరుగై వాటి స్థానంలో ఈర్ష్యా, అసూయ వచ్చి చేరుతున్నాయి. మనుషుల మధ్య కృత్రిమత్వం పెరిగిపోతోంది. ప్రస్తుతం చాలా మంది ఆస్తులు, డబ్బుల కోసం కుటుంబ బంధాలను కూడా పక్కన పెట్టేస్తున్నారు. అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు, భార్యాభర్తల మధ్య అనురాగం, ప్రేమ కనుమరుగై పోతున్నాయి. మేము, మనం అనుకోవల్సిన చోట నాది, నేను అనే స్వార్థం ముందుకు వస్తుంది. ఇందుకు తల్లీ, చెల్లి, అక్క, భార్య ఎవ్వరూ అతీతం కాదు. సం బంధాలు బలహీనపడి వ్యక్తుల మధ్య దూరం పెరిగిపోతోంది. అహంకారం పెరిగి చివరకు హింసకు పాల్పడు తున్నారు. ఇలాంటి హింసకు బలైపోతుంది మాత్రం మహిళలే. మరి వీటికి అంతం ఎప్పుడనే ప్రశ్న ప్రతిఒక్కరినీ కలచివేస్తోంది.
దేశంలో ప్రతి నాలుగు నిమిషాలకు ఒక మహిళ హింసకు గురౌతుంది. రక్షణ కల్పించాల్సిన పోలీసులు, న్యాయస్థానాలే మహిళలను అవమానపరిచే విధంగా మాట్లాడుతున్న సంఘటనలైతే కోకొల్లలు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ముగ్గురు మహిళల్లో ఒకరు ఏదో ఒకరూపంలో హింసను ఎదుర్కొంటున్నారని, భారత్‌లో కూడా ఇదే కొనసాగు తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. మన రాష్ట్రంలోనూ పరిస్థితి అందుకు భిన్నంగా ఏమీ లేదు. ప్రపంచ బ్యాంకు ఓ అధ్యయనం ప్రకారం నేటికీ గ్రామీణ భారతంలో 95శాతం వరకట్న కేసులు నమోదవుతున్నాయి. అంటే దేశంలో మహిళల రక్షణ అనేది ఎంతటి ఆందోళనకరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
కాలం ఎంత మారుతున్నా స్త్రీ,పురుషుల మధ్య రోజురోజుకూ అసమానతలు పెరుగుతూనే ఉన్నాయి. మానవ సంబంధాలన్నీ మృగ్యమైపోతున్నాయి. ప్రభుత్వాలతో పాటు పౌర సమాజం కూడా దీన్ని గుర్తించాలి. మన రాష్ట్ర మహిళలు గతంలో కరువైన రక్షణ ఇప్పుడైనా లభిస్తుందనుకున్నారు. కానీ జరుగుతున్న వరుస దాడులతో ఆందోళనకు గురవుతున్నారు. కనుక రాష్ట్ర సర్కారు కూడా మహాలక్ష్మి పథకమంటూ గొప్పలు చెప్పుకుంటూ కూర్చోకుండా మహిళల రక్షణ పట్ల దృష్టిపెట్టాలి. కఠిన చట్టాలు చేయడంతో పాటు వాటి అమలుకు కృషి చేయాలి.
మరీ ముఖ్యంగా మనుషుల మధ్య సంబంధాలను విచ్ఛిన్నం చేస్తున్న వినిమయదారీ సంస్కృతికి అడ్డుకట్ట వేయాలి. ఈ వికృత ధోరణులను పెంచి పోషిస్తున్న సాంఘిక, మానసిక, ఆర్థిక పరిస్థితులను లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. పాఠశాల స్థాయి నుండే మానవతా విలువలు పాటించే పాఠ్యాంశాలను పుస్తకాల్లో చేర్చాలి. మర్యాద, దయ, కృతజ్ఞత వంటివి పాటించేలా యువతను ప్రోత్సహించాలి. ఆరోగ్యకరమైన మానవ సంబంధాలను పెంపొందించాలి. మహిళలపై పెరుగుతున్న దాడులు, హింసపై ప్రతి ఒక్కరిలో అవగాహన కల్పించాలి. ఐక్యరాజ్య సమితి చెప్పినట్టు మహిళలపై జరుగుతున్న హింసను మానవ హక్కుల ఉల్లంఘనగా గుర్తించాలి. హింసకు కారణమవుతున్న మద్యం, మాదకద్రవ్యాల నిషేధంపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి. కుటుంబం నుంచి విద్యా సంస్థల వరకు మహిళలను గౌరవించే సంస్కృతిని పెంచాలి. మరీ ముఖ్యంగా స్త్రీ,పురుష అసమానతలు రూపుమాపేందుకు చిత్తశుద్ధితో కృషి చేయాలి. అప్పుడే మహిళలకు రక్షణ.