కెప్టెన్ తిలక్ వర్మ డకౌట్
నవతెలంగాణ-హైదరాబాద్ : రంజీ ట్రోఫీ (ఎలైట్) గ్రూప్-డి తొలి మ్యాచ్‌లో హైదరాబాద్ ఎదురీదుతోంది. ఢిల్లీ తొలి ఇన్నింగ్స్‌లో 529/4 పరుగుల భారీ స్కోరు వద్ద డిక్లరేషన్ ప్రకటించగా.. హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్‌లో 400/7తో పోరాడుతోంది. 106.4 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయిన హైదరాబాద్.. తొలి ఇన్నింగ్స్‌లో మరో 129 పరుగుల వెనుకంజలో నిలిచింది. ఓపెనర్ తన్మయ్ అగర్వాల్ (132, 196 బంతుల్లో 15 ఫోర్లు) సెంచరీతో మెరువగా, అనికెత్ రెడ్డి (87, 100 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్స్‌లు) ధనాధన్ అర్థ సెంచరీతో రాణించాడు. కెప్టెన్ తిలక్ వర్మ (0) ఎదుర్కొన్న రెండో బంతికే వికెట్ కోల్పోవటంతో హైదరాబాద్ కష్టాల్లో కూరుకుంది.
రాహుల్ సింగ్ (35), హిమతేజ (29) సైతం నిరాశపరిచారు. వరుణ్ గౌడ్ (57, 112 బంతుల్లో 5 ఫోర్లు), రాహుల్ రాడేశ్ (41 నాటౌట్, 93 బంతుల్లో 4 ఫోర్లు) రాణించారు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి రాహుల్ అజేయంగా క్రీజులో నిలిచాడు. మరో వికెట్లు చేతిలో ఉండగా తొలి ఇన్నింగ్స్ లోటు పూడ్చుకునేందుకు హైదరాబాద్ నేడు బరిలోకి దిగుతోంది. రంజీ ట్రోఫీ తొలి రౌండ్ మ్యాచ్‌కు నేడు ఆఖరు రోజు కావటంతో టెయిలెండర్లు అద్భుతం చేస్తేనే హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్ లోటు నుంచి బయటపడగలదు. ఢిల్లీ బౌలర్లలో స్పిన్నర్ ఆయుశ్ బదోని (5/69) ఐదు వికెట్ల ప్రదర్శనతో మాయ చేశాడు.