– ప్రభుత్వాస్పత్రుల్లో మరో 7 వేల పడకలు
– ఎస్‌హెచ్‌జీ మహిళలకు హెల్త్ ప్రొఫైల్ కార్డులు : ఏఐజీ ఆస్పత్రి ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
హెల్త్ టూరిజం హబ్‌గా హైదరాబాద్‌ను మార్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. బుధవారం హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఆయన ఏఐజీ ఆస్పత్రి ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాట్లాడారు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ రూపొందిస్తున్నట్టు తెలిపారు. అందులో హెల్త్ టూరిజం ఒక చాప్టర్ గా ఉంటుందని చెప్పారు. హెల్త్ టూరిజంలో భాగంగానే డాక్టర్ నోరి దత్తాత్రేయుడిని క్యాన్సర్ కేర్ సలహాదారునిగా నియమించినట్టు తెలియజేశారు. హెల్త్ టూరిజంగా మార్చే ప్రభుత్వ ప్రయత్నంలో భాగస్వామి కావాలని డాక్టర్ నాగేశ్వర్ రెడ్డిని కోరారు.
ఆరోగ్యశ్రీ ద్వారా రూ. 10 లక్షల వరకు ప్రభుత్వం పేదలకు ఉచిత వైద్యం అందిస్తున్నదని గుర్తుచేశారు. సమస్య రాకుండా ముందు జాగ్రత్తలు చేపట్టేందుకు సరైన విధానంతో ముందుకెళ్తున్నట్టు సీఎం తెలిపారు. నిర్మాణంలో ఉన్న వివిధ ప్రభుత్వాస్పత్రులు ప్రారంభమైతే మరో 7 వేల పడకలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళలకు ప్రత్యేకంగా హెల్త్ ప్రొఫైల్ కార్డులను అందజేయాలని భావిస్తున్నట్టు చెప్పారు. ఒక యూనిక్ ఐడీతో ఈ హెల్త్ ప్రొఫైల్ కార్డులు ఉంటాయని వివరించారు. గతంలో ఫ్యామిలీ డాక్టర్ల వ్యవస్థ ఉండేదనీ, ప్రస్తుతం స్పెషలిస్టు డాక్టర్ల రోజులు వచ్చాయని తెలిపారు.
ప్రపంచ దేశాలతో పోటీ పడగలుగుతున్నా మని చెప్పడానికే మిస్ వరల్డ్ పోటీదారులకు ఏఐజీ ఆస్పత్రి సందర్శన వంటి కార్యక్రమాలు చేపట్టినట్టు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. కార్పొరేట్ ఆస్పత్రులతో పోటీపడి ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యం అందిస్తామని తెలిపారు. వైద్య రంగం అభివృద్ధికి రూ.11,500 కోట్లు కేటాయించినట్టు తెలిపారు. పేదలకు ఉచిత వైద్యం అందించే కార్యక్రమాలకు ప్రయివేటు వైద్యులూ సహకరించాలని కోరారు. ఏడాదిలో ఒక నెల రోజులపాటు సామాజిక బాధ్యతగా ప్రభు త్వాస్పత్రుల్లో సేవలందించాలన్నారు. పశ్చిమా సియా దేశాల నుంచి హైదరాబాద్‌కు డైరెక్ట్ కనెక్టివిటీ పెంచేలా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుతున్నట్టు తెలిపారు.
హైదరాబాద్‌లో రెండో అతిపెద్ద ఆస్పత్రిని అందుబాటులోకి తెచ్చినందుకు డాక్టర్ నాగేశ్వర్ రెడ్డిని అభినందించారు. ఆయన హైదరాబాద్‌కు, తెలంగాణకు గొప్ప పేరు తెచ్చారని కొనియాడారు. ఆయన సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం పద్మవిభూషణ్ పురస్కారాన్ని ప్రదానం చేసిందని గుర్తుచేశారు. నాగేశ్వర్ రెడ్డి భారతరత్న అవార్డుకు అర్హులని అభిప్రాయపడ్డారు. భారతరత్న వచ్చేలా తెలంగాణ నుంచి తన వంతు ప్రయత్నం చేస్తానని తెలిపారు. 66 దేశాల నుంచి రోగులు ఏఐసీ ఆస్పత్రిలో చికిత్స కోసం రావడం గర్వకారణమని హర్షం వ్యక్తం చేశారు.
హెల్త్ టూరిజం హబ్‌గా హైదరాబాద్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES