నవతెలంగాణ-హైదరాబాద్ : నగరంలో గణేశ్ ఉత్సవాల సందర్భంగా మెట్రో రైల్ సంస్థ ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. భక్తుల సౌకర్యార్థం నేడు మెట్రో సేవల సమయాన్ని పొడిగిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ నిర్ణయంతో, అన్ని టెర్మినల్ స్టేషన్ల నుంచి చివరి మెట్రో రైలు రాత్రి 11:45 గంటలకు బయలుదేరుతుందని అధికారులు స్పష్టం చేశారు.
ప్రస్తుతం నగరవ్యాప్తంగా గణపతి నవరాత్రులు వైభవంగా జరుగుతున్నాయి. ఈరోజు వారాంతం కావడంతో గణేశ్ విగ్రహాలను సందర్శించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉంది. ఈ రద్దీని దృష్టిలో ఉంచుకుని, రాత్రి వేళల్లో ప్రయాణికులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు మెట్రో యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
ఈ పొడిగింపు వల్ల భక్తులు ప్రశాంతంగా దర్శనాలు పూర్తి చేసుకుని, సౌకర్యవంతంగా తమ ఇళ్లకు చేరుకోవచ్చని మెట్రో వర్గాలు పేర్కొన్నాయి. “వినాయక దర్శనాలు ఇప్పుడు మరింత సులభం, టెన్షన్ లేకుండా ప్రయాణించండి” అని మెట్రో ఓ ప్రకటనలో వెల్లడించింది. సాధారణ రోజుల్లో కంటే ఆలస్యంగా రైళ్లు నడపడం ద్వారా భక్తులకు ఎక్కువ సమయం, సౌకర్యం కల్పించాలన్నదే తమ ఉద్దేశమని వివరించింది.