గజాలా హష్మీ విజయం
తొలి ముస్లిం మహిళగా రికార్డు
వర్జీనియా : అమెరికా స్థానిక ఎన్నికల్లో భారత సంతతికి చెందిన నేతలు సత్తా చాటారు. వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా డెమోక్రాట్ నాయకురాలు గజాలా హష్మీ విజయం సాధించారు. అమెరికా రాష్ట్రాల్లో ఈ పదవికి ఎన్నికైన తొలి ముస్లిం మహిళగా ఆమె సరికొత్త రికార్డు సృష్టించారు. గజాలా హష్మీ 1964లో హైదరాబాద్‌లో జన్మించినట్టు సమాచారం. బాల్యంలో అమ్మమ్మ ఇంట్లో కొంతకాలం నివసించినట్టు తెలుస్తోంది. నాలుగేండ్ల ప్రాయంలో తన తల్లి, సోదరుడితో కలిసి గజాలా అమెరికాలోని జార్జి యాకు వెళ్లారు. ఆ తర్వాత అక్కడే స్థిరపడ్డారు. అంతర్జాతీయ వ్యవహారాల్లో పీహెచ్‌డీ పూర్తిచేసిన ఆమె తండ్రి ప్రసిద్ధ విశ్వవిద్యాలయంలో ఉపాధ్యాయుడిగా పనిచేసే వారు.
చదువుల్లో అద్భుత ప్రతిభ కనబరుస్తూ అనేక స్కాలర్‌షిప్పులు, ప్రోత్సాహకాలు అందుకున్న గజాలా.. జార్జియా సదరన్ విశ్వవిద్యాలయంలో బీఏ ఆనర్స్ చదివారు. అట్లాంటాలోని ఎమరి వర్సిటీ నుంచి సాహిత్యంలో పీహెచ్‌డీ చేశారు. అజహర్‌తో వివాహం అనంతరం గజాలా 1991లో రిచ్‌మండ్ ప్రాంతానికి మారారు. 30 ఏండ్ల పాటు ఆమె అక్కడే రేనాల్డ్స్ కమ్యూనిటీ కళాశాలలో ప్రొఫెసర్‌గా పని చేశారు. 2019లో ఆమె తొలిసారిగా అమెరికా ఎన్నికల్లో గెలుపొందారు. 2024లో ఆమె సెనేట్ విద్య, వైద్య కమిటీ చైర్‌పర్సన్‌గా డెమోక్రటిక్ పార్టీ తరఫున ఎన్నికయ్యారు.



