బూరుకుంట చెరువులో భారీ అక్రమ కట్టడాల కూల్చివేత
నవతెలంగాణ-శంషాబాద్
హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ ఏజెన్సీ(హైడ్రా) రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో పంజా విసురుతున్నది. శంషాబాద్‌లోని బురుకుంట చెరువు ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లో వెలిసిన అక్రమ నిర్మాణాలను గురువారం హైడ్రా అధికారులు నేలమట్టం చేశారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. శంషాబాద్‌లోని అత్యంత ఖరీదైన ప్రదేశంలో 12 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న బూరుకుంట చెరువును రియల్ ఎస్టేట్ కబ్జా చేసి మట్టి పోసి నీళ్లు రాకుండా చేశారు. అందులో కొంత ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారు. శంషాబాద్‌లోని అన్ని చెరువుల్లోకి నీళ్లు వస్తున్నా ఇక్కడ మాత్రం చెరువు ఆనవాళ్లు లేకుండా చుక్కనీరు రాకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారులు ధ్వంసం చేయడంపై గతంలో వివిధ దినపత్రికల్లో అనేక కథనాలు వచ్చాయి. స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెరువుల పరిస్థితిని స్వయంగా పరిశీలించి, చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కొన్ని నెలల తర్వాత కమిషనర్ చెప్పినట్టుగానే ఇన్స్‌స్పెక్టర్ చిలుకురి తిరుమలేష్ నేతృత్వంలో భారీ బందోబస్తు మధ్య హైడ్రా రంగంలోకి దిగింది. ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లలో నిర్మించిన గోదాంలు, వాటర్ ట్యాంకులు, ప్రహరీ గోడలను జేసీబీలు, ప్రోక్లైన్‌లతో పూర్తిగా కూల్చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కూల్చివేతల ప్రక్రియ కొనసాగింది. చెరువులో నిర్మించిన వ్యాపారులకు కోట్లల్లో ఆస్తి నష్టం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ ఏఈ మౌనిక తదితరులు పాల్గొన్నారు.