Tuesday, August 12, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయం'హైడ్రా' మార్షల్స్‌ విధుల బహిష్కరణ

‘హైడ్రా’ మార్షల్స్‌ విధుల బహిష్కరణ

- Advertisement -

– చర్చలు జరిపిన హైడ్రా కమిషనర్‌
నవతెలంగాణ-సిటీబ్యూరో

నగరంలో విపత్తు నిర్వహణ, ఆస్తుల పరిరక్షణకు పని చేస్తున్న హైడ్రా మార్షల్స్‌ జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయం ఎదుట సోమవారం నిరసన తెలిపారు. తమకు గతంలో ఇచ్చిన వేతనాల్లో కోత విధిస్తున్నట్టు ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేయడం కారణంగానే తాము విధులను బహిష్కరిస్తున్నట్టు తెలిపారు. మార్షల్స్‌ విధుల్లో చాలా వరకు మాజీ సైనిక ఉద్యోగులు సేవలందిస్తున్నారు. అయితే విధులను బహిష్కరించిన మార్షల్స్‌తో హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ చర్చలు జరిపారు. పాత వేతనాలే ఇస్తామని కమిషనర్‌ హామీ ఇచ్చారు. ఈ క్రమంలో కంట్రోల్‌ రూమ్‌ మార్షల్స్‌ యధావిధిగా విధులకు హాజరయ్యారు. కాగా, హైడ్రా ఉద్యోగులకు రూ.7000 వేతనం తగ్గిస్తూ ఇటీవల ప్రభుత్వం జీవో విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ విషయమై సంబంధిత శాఖ ఉన్నతాధికారులతో హైడ్రా కమిషనర్‌ చర్చించారు.
హైడ్రాలో ఎవరివీ వేతనాలు తగ్గవు : హైడ్రా కమిషనర్‌
హైడ్రాలో పని చేస్తున్న సిబ్బంది వేతనాలు ఎవరివీ తగ్గవని హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ స్పష్టం చేశారు. ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొని రాత్రీ పగలూ పని చేస్తున్న ఉద్యోగుల వేతనాలు పెంచేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం కూడా ఇదే ఆలోచనలో ఉందన్నారు. ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల వేతనాలను రెగ్యులరైజ్‌ చేస్తూ ఇటీవల ప్రభుత్వం జీవో విడుదల చేయడంతో.. హైడ్రాలో పని చేస్తున్న మార్షల్స్‌ కొంతమంది అనవసరమైన ఆందోళన చెందారని అన్నారు. సమాచార లోపంతో ఈ జీవో ప్రకారం వేతనాలు తగ్గుతాయేమోనని కొంతమంది ఆందోళన చెందారని, వారితో మాట్లాడి అనుమానాలను నివృత్తి చేశామని, ఎట్టి పరిస్థితుల్లో వేతనాలు తగ్గవని స్పష్టం చేశారు. హైడ్రాలో పని చేస్తున్న మార్షల్స్‌ ఆందోళన చేస్తున్నారని, విధులకు గైర్హాజర్‌ అయ్యారని, హైడ్రా కార్యక్రమాలు ఆగిపోయాయని ఎలక్ట్రానిక్‌, సోషల్‌ మీడియాలో వచ్చిన వార్తల నేపథ్యంలో కమిషనర్‌ వివరణ ఇచ్చారు. ఎక్కడా ఎలాంటి సేవలకు ఆటంకాలు ఏర్పడలేదని స్పష్టం చేశారు. హైడ్రా అంటే ప్రజల్లో ఎంతో విశ్వాసం, గుర్తింపు ఉందని.. అందుకనుగుణంగా అందరూ కష్టపడి పని చేస్తున్నారని చెప్పారు. సైన్యంలో పని చేసి వచ్చిన వారంతా మార్షల్స్‌గా ఉన్నారని, వారి సేవలపట్ల హైడ్రా పూర్తి విశ్వాసంతో ఉందని తెలిపారు. మిగతా రాష్ట్రాల్లో వారికి ఇక్కడికంటే ఎక్కువ వేతనాలు చెల్లిస్తున్నట్టయితే.. ఆ విధానాలను కూడా అధ్యయనం చేస్తామన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img